కవి విశ్వభద్ర రాసిన కవిత ‘ప్రవాసం ముగిసింది’ ఇక్కడ చదవండి..
ఏ గాన గంధర్వుడో
ఏ మోహన స్వర స్వరూపుడో
విధి వశాత్తో
అణగారిన వర్గాల అదృష్ట వశాత్తో
పుట్టిన నేల తెలంగాణ
నారద తుంబురులు పెక్కురున్నా
నవరస స్వరరాగ రంజితులైనా
ఒక ప్రత్యేక గళముద్రా గభీరతాగతి
దివినుండి భువికి దిగి వచ్చిన సుస్వర అమందానంద భాగీరథి
అల్లాడుతున్న నేలమ్మ గొంతుకను తన శ్రుతితో
స్వరకరవాలంగా మలచుకున్నాడు
ఎగసి పడుతున్న ఎర్రని ఆక్రోశాలకు వాయులీనమై
రాగాభిషేకం చేశాడు
సుస్వర మోహితులైన సబ్బండ వర్ణాలకు
గజ్జెకట్టి బ్రతుకు పాట నేర్పాడు
బ్యాలెట్ ను బందూకుతో జయించిన మావో యిష్టుడైనా
బందూకును బ్యాలెట్ తో పేల్చే అంబేద్కర్ వారసుడైనాడు
బుద్ధునికి రామానుజునికే కాదు
అణగారిన వర్గాల ఆప్తులందరికీ ఆదుకునే రాగాల్ని పంచాడు
పరిణతి చెందని ప్రజాస్వామ్యంలో ఓటు విలువకు సలాం కొట్టాడు
వెన్నులో గరళం లాంటి బుల్లెట్ తో చేసిన
పాతిక సంవత్సరాల సహజీవనం
ఖద్దరు రాజకీయాలకు నిషానిగానే మిగిలింది
చద్దరు విందు రాజకీయాలకు లొంగని సాంస్కృతిక స్వచ్ఛ మూర్తి
మాట పాట ఆట
ఆశయ స్వరాల ఊట
చిత్తజల్లులా అందరి అక్కున చేరింది
అతడు మాత్రం పాడుకుంటేనే
పాటను మనకు ధారాదత్తం చేసి
ప్రవాసం ముగిసిందని వెళ్లి పోయాడు
.. కవి విశ్వభద్ర
సెల్ : 8125365236