వారాల ఆనంద్ కవితలు : కవిత్వం

By SumaBala Bukka  |  First Published May 26, 2023, 10:09 AM IST

కవిత్వం చిన్నది, విశ్లేషణ పెద్దది.  అదే మినీ కవిత ప్రత్యేకత.  
వారాల ఆనంద్ రాసిన అలాంటి ఆసక్తికరమైన కొన్ని మినీ కవితలను ఇక్కడ చదవండి : 


కవిత్వం

ప్రేమలేఖ రాసాను 
స్పీడ్ పోస్టులో పంపనా కొరియర్ చేయనా 

Latest Videos

చిరునామా గుర్తు లేదు
                 *
నా ఇద్దరు మిత్రులు అపరిచితులు 
ఒకర్నొకరికి పరిచయం చేసాను 

నేనిప్పుడు అపరిచితుణ్ణి 
                 *
నా నీడ 
నాకంటే పొడుగు 

మనసేమో ఆకాశమంత 
                 *
మొగ్గ విచ్చుకుంటే  
అందమయిన పువ్వవుతుంది 

రెక్కలు విప్పదీస్తే మనసు ముక్కలవుతుంది 

                   *
ఆకాశంలో నిండు మబ్బులు 
ప్రసవం ఏ క్షణాన్నయినా కావచ్చు 

నేలంతా సంతోష ప్రవాహం 
                   *
గోడమీది ఫోటోలో 
గల గల పారే నది ఉండాలి 

వేసవి కదా ఎండిపోయింది
                   *
ప్రయాణంలో కలిసిన వాళ్ళు 
ప్రయాణంలోనే దిగి పోతారు 

మిగిలేది ప్రయాణమే 
                      *
అతను గద్దెనెక్కాక 
కళలు మాయమయ్యాయి 

ప్రచారం మొదలయింది 
                    *
చౌరస్తాలో నిలబడ్డాక 
నాలుగు దిక్కులు 

దిక్కులేని వాడికి ఎదిక్కయినా ఒకటే 
                    *
సొంతూరులో అంతా గుర్తుపట్టే వాళ్ళు 
నేనేమో ఇప్పుడెవర్నీ గుర్తుపట్ట లేను  

వలస నాదా వూరుదా 

                        *
పచ్చీసు అష్టాచెమ్మా 
చార్ పత్తా ఒనగుంటలు 

ఒటీటీ సిక్సర్ కొట్టింది

click me!