గడియ ముందో వెనకో తెల్లారక మానదు అంటున్న వారాల ఆనంద్ రాసిన ఆసక్తికరమైన కవిత ఇక్కడ చదవండి
గడియ ముందో వెనకో తెల్లారక మానదు అంటున్న వారాల ఆనంద్ రాసిన ఆసక్తికరమైన కవిత ఇక్కడ చదవండి :
గడియ ముందో వెనకో...
అలసిన కళ్ళకు కొంత
ఉపశమనమిస్తూ రెప్పలు మూసుకు
పడుకున్నా
టిక్ టిక్ టిక్
కాలం నడిచి పోతూనేవుంది
కునుకు పట్టదు
నిద్ర రాదు
వాకిలి దాకా వచ్చి
గడపలో నిలబడిపోయిన
నిద్రను రా రమ్మని ఎవరు పిలవాలి
రాత్రా..చీకటా..
నడిచీ నడిచీ డస్సి పోయి వున్నా
రెప్పలు తెరిచే ఓపిక లేదు
చేతులు చాచే ఓరిమి లేదు
శిలలా పడుండి పోయా
చీకటీ రాత్రీ
నా రెండు వైపులా
తోడుగా నిలబడ్డాయి ఉపశమనంగా
నాలోపల రక్తం ప్రవహిస్తూనే ఉంది
శ్వాస సాగుతూనే ఉంది
ఏదీ ఎవరి కోసమూ
నిలబడదు
నడక సాగాల్సిందే
గడియ ముందో వెనకో
తెల్లారక మానదు