జీవిత దీపం కొడిగట్టకుండా ఉదయమూ సాయంత్రమూ ఆవిష్కృతమవుతున్న అత్భుతాలను వారాల ఆనంద్ రాసిన కవిత ' దిన చర్య ' లో చదవండి :
ఊర్లో రోజంతా ఏంచేస్తారు
మహానగరంలో ఎవరో అడిగారు.....
ఉదయాన్నే సైన్ ఇన్ అయిన
సూర్యుడికి స్వాగతంచెబుతాను
సాయంత్రం సైన్ ఆఫ్ అయినపుడు
వీడ్కోలు పలుకుతాను
ఒకసారి
ఇంటి ముందటి గడప దాటి
వాకిట్లోకొస్తాను
అలుకూ ముగ్గై విస్తరిస్తాను
ఇంకోసారి
ఇంటి వెనకాలి పెరట్లో కెళ్తాను
గోడ్డూ గోదా కుడితీ గోళం
జ్ఞాపకల్లో ముప్పిరిగొని
సర్కస్ ఫీట్లు చేస్తాయి
ఇంట్లోకొచ్చి
కుర్చీలో కూర్చునో
నేలమీద కాళ్ళు బార్లా చాపుకునో
ఓ పుస్తకాన్ని తిరగేస్తాను
రిమోట్ నొక్కి మాటలోనో పాటలోనో
మునిగిపోతాను
రెండో షిఫ్టులో బయోమెట్రిక్ పంచ్ తో
వచ్చిన చంద్రున్ని చూసి సంబరపడతాను
స్విచ్ ఆఫ్ కాకుండా
మనసును
చార్జింగులో పెడతాను
నా దీపం కొడిగట్టకుండా
ఉదయమూ సాయంత్రమూ
ఆకాశంలో ఎగిరే పక్షుల గుంపొకటి దిగొచ్చి
‘హాయ్’ అని పలకరించి పోతుంది
నా దినచర్య
అట్లా గడిచిపోతుంది