తలారి సతీష్ కుమార్ కవిత:పిల్లల కోడిలా పొద్దు

By narsimha lodeFirst Published Jan 29, 2024, 7:26 PM IST
Highlights

తలారి సతీష్ కుమార్  రాసిన పిల్లల కోడి పొద్దు కవితను ఇక్కడ చదవండి.


పల్లికాయ పీకనికె
కూలొళ్లు దొరుకుతలేరని పొద్దు!
అమ్మ అంచున మునుమువడుతది

మీ పని సల్లగుండా పొద్దు నెత్తిమీదికొచ్చింది 
ఇంకెంత సేపని అట్ల తినకుండ చేస్తరు రా
తిందు రాండి! అని మనిషి కోపడినట్టుగానే పొద్దూ
మాలో ఒకరిగా కలిసితిరుగుతది...

ధూళ్ళకాడికోయిన నాయిన
అలిసి ఏ చెట్టుకిందయిన నిదురవోతే
పొద్దె ధూళ్ళని మలిపినట్టూ 
సాయంత్రం సక్కగ ఇంటి బాటవడుతాయి

ఒక్క ధూల్లనే కాదు!
పొద్దుని నిద్రలేపిన కోళ్లతో సహా పక్షులన్నీ
గూటికి చేరగానే ఇంట్లో దీపం ఎలుగుది...

దారితప్పిన మనుషులందరిని 
దారిలోకి తెచ్చినట్టూ పొద్దూ
పోత పోత ఎవరింటికాడ వాళ్ళని దిగవెట్టి మాయమైనట్టూ ఊరెనికి కట్టకిందికిపోతది.!

పొద్దంతా పక్కపక్కనే ఉన్న పనిలో 
ఎవరికి వాళ్ళం వేరు వేరుగా మిగిలిపోతున్నం

ఊరుముందల కట్టకాడనో
ఛాయి హోటల్ కాడనో 
రాశులుగా గుమరిచ్చిన మాటలని 
యినిపోడానికి వచ్చిన పొద్దూ! 
పిల్లల కోడిలా 
చుక్కలన్నింటిని యెనకేసుకొని వస్తది..

click me!