ఆధునిక పద్య కావ్యాల పరిశీలనాత్మక విశ్లేషణ "సౌందర్య భారతి"

By Pratap Reddy Kasula  |  First Published Jan 29, 2022, 4:37 PM IST

డా. బోలుగద్దె అనిల్ కుమార్ రచన "సౌందర్య భారతి" పై IIIT ఇడుపులపాయలో ఇంజినీరింగ్ చదువుతున్న మిద్ది సాయి కుమార్ రెడ్డి  రాసిన సమీక్ష ఇక్కడ చదవండి:


తెలుగు సాహిత్యాన్ని అధ్యయనా సౌలభ్యం కోసం కొన్ని యుగాలుగా విభజిస్తారు. ఈ విభజన వివిధ పరిశోధకులు వివిధ ప్రమాణాలతో చేశారు. ఆయా కాలాలలో ఉన్న కవుల పేర్ల మీద గాని, లేదా పాలనాధికారుల పేర్లమీద గాని, లేదా కాలానుగుణంగా గాని ఈ యుగాలకు పేర్లు పెట్టారు.

యుగ విభజన అనేది అధ్యయనంలో ఒక కొండగుర్తుగా ఉపయోగపడుతుంది.  కొన్ని విశిష్టమైన, సమానమైన ధర్మాలు గల కాలాన్ని ఒక "యుగం" అని వ్యవహరిస్తారు.  అంటే ఒక కాలంలోని సాహిత్యంలో సమానమైన, లేదా విలక్షణమైన అంశాలను ఆ యుగం పేరుతో గుర్తిస్తారు. యుగ విభజన ఎలా చేసినా గాని అది సమగ్రం, నిర్దుష్టం అని చెప్పలేము.  అందేదో ఒక విధముగా అతి వ్యాప్తి, అవ్యాప్తి దోషములు కనిపిస్తూనే ఉంటాయి.  ఒకే విధమైన కావ్యములు వివిధ కాలాలలో వెలువడవచ్చును. ఒకే కాలంలో బహువిధాలైన రచనలు కూడా రావచ్చును. ఒక కాలంలో పెక్కురు ఉద్ధండులైన పండితులుండవచ్చును. వాఙ్మయకారులు తమ అభిరుచిని బట్టి సౌకర్యం కోసం ఎలాగైనా యుగ విభజన చేయవచ్చును.  వాఙ్మయంలో అంతర ప్రవృత్తి, బాహ్య ప్రవృత్తి అనే రెండు అంశాలున్నాయి. ఇవి కాలాన్నిబట్టి మారడం మనం గ్రహించవచ్చును.  అందుకు బయటి భాషా, జాతుల సంపర్కం ఒక కారణం.  సమాజాంతర్గతమైన మార్పులు మరొక కారణం.  సాహితీ ప్రక్రియలలో అంతకు ముందు కాలంనుండి ఒక ముఖ్యమైన మార్పు సంభవించిన "హద్దు"ను యుగం మారందని చెప్పే సమయంగా భావించవచ్చును.

Latest Videos

సాహిత్య చరిత్రను అధ్యయనం చేసేటప్పుడు సాహితీమూర్తులనే యుగకర్తలుగా గుర్తించడం భావ్యం అని పింగళి లక్ష్మీకాంతం అభిప్రాయం.  అంటే కాలాన్ని బట్టి అనేక కావ్యాలు పుట్టుకొచ్చాయి. అందులోను ముఖ్యమైనది జీవ పరిణామక్రమం, ప్రజల జీవన విధానం వంటివి కొంత మందిలో ప్రేరేపించడం వలన వారిని కవులుగా మలచి వారిచే నవసమాజ నిర్మాణినికి పునాది ఏర్పడటం జరిగినది.  తెలుగుకు ప్రాచీనభాష హోదా వచ్చిన తర్వాత ప్రాచీన సాహిత్యం మీద పరిశోధనలు విసృతంగా జరగడానికి అవకాశం వచ్చింది.  ఆధునిక పాఠకులకు ప్రాచీన సాహిత్యాన్ని అందించడానికి డిజిటైజేషన్‌, కంప్యుటీకరణ వంటివి సాధనాలు అవుతున్నాయి. అంటే ప్రాచీన కావ్యాలను పాతపద్ధతుల్లోనే అందిస్తామంటే ఇప్పటికాలంలో కుదరని పని.  దానికి గల ముఖ్య కారణం నేడు ఉన్న ప్రపంచీకరణ లో ఆంగ్ల భాష ప్రాముఖ్యత వలన నేటి యువత ప్రాచీన కావ్యాలపైన దృష్టి పెట్టకపోవడం .

పద్యం అర్ధమవడమంటే ప్రతిపదార్థ - తాత్పర్యాలను చెప్పడమనే భావన పోవాలి. ఆంతరంగికాంశాలైన రసం, ధ్వని, వక్రోక్తులను గురించే తెలుసుకోగలిగితేనే పద్యసాందర్యాన్ని పరిపూర్ణంగా అస్వాదించగలుగుతాం. పాఠకుడు కావ్యాన్ని చదివేటప్పుడు అందులోని అంతర్గత అందచందాలను గురించి సమన్వయరూపంలో తెలుసుకోగలగాలి.   అప్పుడే స్వారస్యాన్ని అందుకోగలుగుతాడు.  లేకపోతే కావ్య పఠనము - లక్షణ పరిశీలన సమాంతర రేఖల్లా ప్రయాణిస్తాయి.   కాని వాటి మధ్య సయోధ్యను సాధించలేం.  పాఠకులు ప్రాచీన సాహిత్య సౌరభాలను ఆస్వాదించలేరు.  అందుకు అనువైన ఆధునిక విజ్ఞానాన్ని వినియోగించుకోవలసిందే. కొత్త తరాల వారికి ప్రాచీన భాషాసాందర్యాలను గాని, సాహిత్య మధురిమలను కాని ఆధునిక పరిజ్ఞానంతో చెప్పగలగాలి.  అప్పుడే కృతకృత్యులం కాగలుగుతాం. ఈ ఆధునిక విధానంలో పరిశోధనలు జరిపి పిల్లలకు రసవత్తరంగా చెప్పగలిగే ధీరుడు డా|| బోలుగద్దె అనిల్ కుమార్.   వారు రాసిన "సౌందర్య భారతి" పుస్తకాన్ని క్షుణ్ణంగా పరిశీలించి ఈ  సమీక్ష చేస్తున్నాను.

ఈ సౌందర్య భారతి పరీశీలనాత్మక పుస్తకంలో మొదటి రెండు గంగుల శాయి రెడ్డి గారి కాపు బిడ్డ రైతుల స్థితిగతుల గురించి వివరణాత్మకంగా విశ్లేషించారు భారతీపుత్ర అనిల్ కుమార్.  గంగుల శాయిరెడ్డి గారు స్వయంగా వ్యవసాయదారుడు కావడం వలన ఎంతో మంది రైతులకు సహాయం చేసినవాడు కావడం వలన ఆయన శాలీనత కాపు బిడ్డలో మూర్తియై కూర్చున్నది అంటున్నారు అనిల్ కుమార్.   రైతు యొక్క వాస్తవ పరిస్థితులను కళ్ళకు కట్టినట్లు వర్ణన, వర్షాకాలంలో పడేపాట్లు, పురుగుల వలన కలిగే నష్టాలు  మొదలైనవి....అలాగే రైతుకు
పచ్చ జొన్న సంకటి - పరమాన్నం
చల్లటినీరు - అమృతసారం
వడికిన  బట్టలు - జరీ పట్టుబట్టలు   
గొంగడి - వజ్రకవచం
కుడిచేతిలో కర్ర - వజ్రాయుధం
చుట్టూ పనిచేసే జనాలు - సాధుజంతువులు 
అందమైన పొలాలు - నందనవనాలు
పండే పంట - దాచిన ధనం
ఉన్నవాటితో సంతృప్తి పడటం అనే విషయాన్ని కవి చెప్పిన విధానంతో పూసగుచ్చినట్లు వివరించడంలో అనిల్ కుమార్ కు సాటి మరొకరు ఉండరు అని భావిస్తున్నాను.  గంగుల శాయిరెడ్డి కావ్యాన్ని వ్యవసాయ విజ్ఞాన సర్వస్వంగా అభివర్ణించిన తీరు అనిల్ కుమార్ విజ్ఞానానికి మరియు ఆలోచన గాఢమైన పరిశీలన విధానానికి అద్దంపడుతాయి.

అలాగే గంగుల శాయిరెడ్డి గారి వర్ణనా నిపుణత కవన చతురత గురించి విశాలంగా విస్తారంగా ప్రస్తావించిన తీరు వివరణ ఇవ్వడంలో సాగిన నడక, పరిశీలనలో విన్యాసం మనకు ఇందులో అగుపిస్తాయి.   పద్యాల్లో ఉన్న మార్మికతను చెప్పడం అంటే ముడిగా  ఉన్న వడ్లను దంచి పొట్టు నుంచి  బియ్యం వేరు చేసి వండి నోటిలో పెట్టె అంత కష్టం కానీ మా గురువర్యులకు ఆ పని నీళ్లు తాగినంత పని మాత్రమే అని నిస్సందేహంగా చెప్పగలను.

రామాయణ కల్పవృక్షం తెలుగులో విశ్వనాథ సత్యనారాయణ రచించిన పద్య కావ్యము.  తెలుగులో రామాయణం అనేక కావ్యాలుగాను, వచన రూపంలోను, సినిమాలుగాను, గేయాలుగాను, జానపద గీతాలుగాను చెప్పబడింది.   ప్రతి రచనకూ ఒక విశిష్టత ఉంది.  అలాగే విశ్వనాథ సత్యనారాయణ రచన "రామాయణ కల్పవృక్షం" అతని సాహితీ ప్రతిభకు, తాత్విక భావాలకు, ఆధ్యాత్మిక ధోరణికి, తెలుగు సాహిత్యంలో పద్య కావ్యాల విశిష్టతకు నిదర్శనంగా ప్రసిద్ధమైంది.  రామాయణాన్ని, విశ్వనాథను, పద్యకవిత్వాన్ని విమర్శించే వారికి కూడా ఇది ఒక ప్రధాన లక్ష్యంగా ఉంటున్నది.   శ్రీమద్రామాయణ  పంచవటి అనే వ్యాసంలో స్వభావిక పాత్రల చిత్రణ మనకు అలరారుతుంది.  అలాగే విశ్వనాథవారి పదప్రయోగం గురించి విపులంగా వివరించారు.

గుఱ్ఱం జాషువా గారి గబ్బిలంలో ఉన్న ఆధునిక విజ్ఞాన శాస్త్రం గురించి తెలియజేయడం నాకెంతో సంబ్రమాశ్చర్యాన్ని కలిగించింది.  రచయిత ఇందులో గబ్బిల కావ్యాసార్థక భాషాప్రయోగాలు, కవి హృదయావిష్కరణ అనే వ్యాసంలో అనుభావికశాస్త్రము (emperical సైన్స్) అలాగే పదపరికల్పన శాస్త్రం (neologism) జాషువా గారు వాడిన వాడుక భాష గురించి ధ్వన్యునుకరణ (onomatology) శబ్దార్ధ సంబంధ కృత్రిమత అంటే సాహిత్యాన్ని ఆధునిక శాస్త్రాలతో జోడించి చెప్పడం ఇందులో విశేషం .

వానమామలై వరదాచార్యులు రచించిన పోతన చరిత్రము అందులోనున్న గాఢతను వివరించిన తీరు మనిషిని మహర్షిని చేస్తుంది .సిరిప్రెగడ భార్గవరావు 'కన్నీరు పద్యశైపం' స్మృతి కవితాభావపోశణం లో కవిత్వంలో రకాలు వాటి విధానాల తీరు గురించి చెప్పడం వలన నేను ఎన్నో కొత్త విషయాలను నేర్చుకున్నాను.విశ్వంభర: ఈ కావ్యానికి నాయకుడు మానవుడు. రంగస్థలం విశాల విశ్వంభర.  ఇతివృత్తం తేదీలతో నిమిత్తంలేని, పేర్లతో అగత్యంలేని మనిషి కథ. ఈ కథకు నేపథ్యం ప్రకృతి.  మనిషి ధరించే వివిధ భూమికలకు మూలధాతువులు మనశ్శక్తులు.   అలెగ్జాండర్, క్రీస్తు, అశోకుడు, సోక్రటీస్, బుద్ధుడు, లింకన్, లెనిన్, మార్క్స్, గాంధీ - ఇలా ఇలా ఎన్నెన్ని రూపాలో మనిషికి.  కామం, క్రోధం, లోభం, మదం, ఆత్మశోధనం, ప్రకృతిశక్తుల వశీకరణం - ఇలా ఇలా ఎన్నెన్ని విభిన్న ప్రవృత్తులో మనిషికి!  ఆదిమ దశ నుంచీ ఆధునిక దశ వరకు మనిషి చేసిన ప్రస్థానాలు ఈ కావ్యంలోని ప్రకరణాలు.  మనిషి సాధన త్రిముఖం - కళాత్మకం, వైజ్ఞానికం, ఆధ్యాత్మికం.  ఈ సాధనలో అడుగడుగునా ఎదురుదెబ్బలు.  క్షతుడైనా మనిషి తిరోగతుడు కాలేదు.  ఇలాంటి మహోన్నతమైన ఆలోచనల రేఖాచిత్రం 'విశ్వంభర' కావ్యరచనకు పునాది.  ఇందులో ఉన్న ప్రకృతి, కుటుంబం, సమాజం ఉన్న వాస్తవిక సౌందర్యపరమైన విషయాలను నెమలి నాట్యం చేస్తే ఎంత అందంగా ఉంటుందో అంత అందంగా వివరించారు. 

ఈ పుస్తకంలో బోయిభీమన్న అకాండతాండవం, పల్లాదుర్గయ్య గంగిరెద్దు సారాంశం అనుమాండ్ల భూమయ్య జ్వలిత కౌసల్య మరియు ఆచార్య ఎన్ గోపి వంటి వారికి సంబంధించిన విశ్లేషణాత్మక వ్యాసాలు ఉన్నాయి.  సాధారణంగానే ఒక విషయాన్నీ వివరించడం ఒక ఎత్తు అలాంటిది ఏకంగా సాహిత్య పరమైన విషయాన్ని ఆధునిక విజ్ఞానంతో మేళవించి చెప్పిన  డా।।అనిల్ కుమార్  "సౌందర్య భారతి"  పుస్తక పఠనానికి మిమ్మల్ని ఆహ్వానిస్తూ....

click me!