ఇరుగు పొరుగు శీర్షిక కింద ప్రముఖ కవి వారాల ఆనంద్ రెండు బెంగాలీ కవితలను తెలుగులో అందించారు. ఆ కవితలను చదవండి.
మరణం
స్మశానంలో కట్టెలపై
ఓ చితి కాలుతున్నది
కాలిపోవడం నాకు అంగీకారమే
కానీ
ఓ నది ఒడ్డున కాలడం మరింత ఇష్టం
ఎందుకంటే
ఓ సమయం రావచ్చు
బహుశ తప్పకుండా రావచ్చు
నది ఒడ్డున
చితి మంటల వేడిని తట్టుకోలేక
శవం లేచి
ఓ గుక్కెడు నీళ్ళు అడగొచ్చు
అప్పుడు
చావుకు ఓటమే
'విజయమూ' దక్కదు
బెంగాలీ మూలం: శక్తి చటోపాధ్యాయ్
ఇంగ్లిష్: సమీర్ సేన్ గుప్తా
తెలుగు స్వచ్చానువాదం: వారాల ఆనంద్
'వృక్షారాధన'
లేదు నేనెప్పుడూ
నీ పాదాల మీద
ఒప్పంద సంతకం చేయను
స్వతంత్ర అమ్మాయిలా
నిన్ను ప్రేమిస్తాను
ఎట్లయితే
అడవికీ వేటగానికీ నడుమ
హిమనగానికీ పెంగ్విన్ పక్షికీ మధ్య
ప్రేమ మొలకెత్తుతుందో
లేదు నువ్వు ఎప్పుడూ
ఒప్పంద సంతకం చేయమని అడగలేదు
ధన్యవాదాలు
నీముందు తలవంచుతాను
నీకు నమస్కరిస్తున్నాను
ప్రియమయిన ఓ వృక్షమా
ప్రేమలోనూ జగడంలోనూ
నిన్ను ధృఢంగా ప్రేమిస్తాను
వేటగాడూ అడవీ
మన రక్త ప్రవాహంలో కలుస్తారు
బెంగాళీ మూలం: మల్లికా సేన్ గుప్తా
ఇంగ్లీష్: పారమితా బెనర్జీ, కరోలిన్ రైట్
తెలుగు: వారాల ఆనంద్