శేషభట్టర్ నరసింహాచార్యులు( 89) కళాభారతి వ్యవస్థాపకుల స్మృతిలో నాగర్ కర్నూల్ నుండి వనపట్ల సుబ్బయ్య రాసిన కవిత ' కళాభారతి' ఇక్కడ చదవండి.
కళకోసం నడిచాడు
కళానదై ప్రవహించాడు
నాటక వృక్షమై నిలిచాడు
కళాభారతై వెలిగాడు
ఊరూరు తిరిగి
ప్రతి మొఖానికి అర్దళం రుద్దీ
మనిషి మనిషికి కిరీటం తొడిగాడు
రాగం తాళం దరువు వంటబట్టించి
నాటకాలకు బండికట్టాడు
యక్షగానాలు
చిరుతల నాటకాలు
వీది ఆటలతో
గదను గాండీవంచేసి గానాల్ని పలికించి
కళల్ని పండించాడు
కందనూలును కళాభారతిగా నడిపాడు
ఆయన
అన్నంలో రాళ్లనైనా సహిస్తడు గాని
భాషలో దోషాల్ని సహించడు
జానపదుల అధ్యయనం ఆయన ఆహరం
సాహిత్యం సాంస్కృతి రెండు కళ్లు
నటన,సంగీతం, దర్శకత్వం క్యాస్టూమ్ డిజైనింగ్ కళలు ఆయన ప్రాణనదులు
చిందుభాగోతాలు
పౌరాణికాలంటే పంచప్రాణాలు
కన్నబిడ్డలను సాదినట్లు
కళాభారతిని పెంచాడు
కళాకేతనాలను అలంకరించాడు
రంగస్థలాలకు డ్రామా డ్రస్ కంపెనై
కందనూలును కళాకేంద్రంగా నిలబెట్టాడు
భూమికి జల దాహంలా
ఆయనకు రంగస్థల దాహం!
ఏ రాగమైనా ఆయన గొంతులో కళాయిపోసినట్లే!
హార్మోనియం మెట్లపై సరిగమల విన్యాసం!
ఏ ఆటైనా ఆయన చేతుల్లో
బొడ్డెమ్మ బంతి తిరిగినట్లే
కర్టెన్లు, కాస్ట్యూమ్స్, కిరీటాలు, ఆయుధాలు
లెక్కకు మించి ఆహార్యపు రూపకల్పనలు
ఆ చేతుల పురుడుపోసుకోని
నాటక సరంజామ ఒక్కటీలేదు!
రూపక కళానిధి
ఆయన ఇల్లే ఓ నాటకశాల.