2021 సంవత్సరానికి గాను ప్రముఖ సాహితీవేత్త పెన్నా శివరామకృష్ణ ప్రజాకవి కాళోజీ పురస్కరాన్ని అందుకోనున్నారు. నల్లగొండ జిల్లాకు చెందిన పెన్నా శివరామకృష్ణ అధ్యాపకుడిగా పదవీ విరమణ చేశారు.
హైదరాబాద్: ప్రముఖ సాహితీవేత్త పెన్నా శివరామకృష్ణ ప్రజాకవి కాళోజీ సాహిత్య పురస్కారాన్ని అందుకోనున్నారు. ఈ విషయాన్ని తెలంగాణ రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, క్రీడా, ఆబ్కారీ శాఖల మంత్రి వి, శ్రీనివాస్ గౌడ్ మంగళవరం ఓ ప్రకటనలో తెలిపారు.
తెలుగు భాష, సాహిత్య రంగా్లలో విశేషకృషి చేసిన సాహితీవేత్తలకు 2015 నుంచి ఏటా ప్రభుత్వం ఈ పురస్కారాన్ని ప్రదానం చేస్తోంది. నిపుణుల కమిటీ 2021 కాళోజీ పురస్కారానికి పెన్నా శివరామకృష్ణను ఎంపిక చేసినట్లు మంత్రి శ్రీనివాస్ గౌడ్ చెప్పారు. కాళోజీ జయంతి సందర్భంగా ఈ నెల 9వ తేదీన హైదరాబాదులోని రవీంద్ర భారతిలో పెన్నాకు ఆ అవార్డు ప్రదానం చేస్తారు.
అవార్డు కింద రూ. 1,01,116 నగదు, శాలువా, జ్జాపిక బహూకరిస్తారు. నల్లగొండ జిల్లాకు చెందిన పెన్నా శివరామకృష్ణ అధ్యాపకుడిగా పనిచేసి పదవీ విరమణ చేశారు. ఆయన అలల పడవల మీద, నిశ్శబ్దం నా మాతృక వంటి కవితా సంకలనాలను వెలువరించారు. గజల్ ప్రక్రియపై ఆయన విశేషమైన కృషి చేశారు.
సాహిత్య విమర్శలోనూ ఆయన తనదైన ముద్ర వేశారు. పలు సాహిత్య విమర్శనా గ్రంధాలను ఆయన వెలువరించారు. ప్రస్తుతం ఆయన హైదరాబాదులో నివాసం ఉంటున్నారు.