అమ్మలక్కల చీరకొంగుల నుంచి రాలిపడే మాటల్లోని తెలుగు తల్లి వైభవాన్ని మంచిర్యాల నుండి తోకల రాజేశం రాసిన కవిత ' మట్టి భాష ' లో చదవండి:
నోటితో అక్షరాలను ఏరుకోవటం
తెలిసిన తరువాత
పదాలను కాగితపు పొలంలో నాటేయటం
నేర్చిన తరువాత
భాష తెలిసిందని సంబరపడ్డాను
నా కలం నుంచి
ప్రాణహితా జలాలు కురుస్తుంటే
నా గళం నుంచి
కోయిల స్వరాలు విరుస్తుంటే
నాదే అసలు భాషగా భ్రమ పడ్డాను
నాయిన రెండెద్దుల నడుమ నాగలై
చాళ్లుగా విచ్చుకుంటున్న భూమితో మాట్లాడుతున్నప్పుడు
నా తల్లి పొలం గడప మీద ఆకుపచ్చని ముగ్గులేస్తూ
మట్టిగొంతునెత్తి పాటందుకున్నప్పుడు
తెలుగు భాష
అన్నం మెతుకంత తియ్యగా మారటం చూసాను
నా చెయ్యి పట్టుకొని
రామాయణం చుట్టూ భారతం చుట్టూ తింపుతూ
నాయనమ్మ చెప్పే కథల్లోని పలుకులు
జీడి పలుకులంత కమ్మగా ఉంటై
మా ఊరి నుంచి మంచిర్యాలకు పోయే బస్సులో కూసుంటే
అమ్మలక్కల చీరకొంగుల నుంచి
రాలిపడే మాటల్లోని తెలుగు తల్లి
కాళ్లకు చేతులకు వెండి కడియాలు పెట్టుకున్న
నిండు ముత్తైదువులా కనిపిస్తుంది
చదువుకున్నోళ్లంతా భాష నోట్లో మట్టి కొడుతుంటే
భాషకింత మట్టినిపూసి బతికించుకుంటున్నది వాళ్లే