రైతులు వెతలను, వారి పనులను హృద్యంగా ఆవిష్కరిస్తూ వికారాబాద్ జిల్లాకు చెందిన తలారి సతీష్ కుమార్ మట్టిచెదల పుట్ట అంటూ రాసిన కవితను ఇక్కడ చదవండి..
దినాం బురద మింగి బురద గక్కే
మట్టి సెదల పుట్టవాడు...
పొలంలో ఎత్తుపల్లాలను సాపుజేయా
చీలుకపోయిన రెండుపాయల గొర్రు వాడు
తెల్లారకముందే గోసివోసి గడ్యంగట్టి
తిమ్మిర్లెక్కే సన్నీళ్లతో తానం జేసిన
పచ్చిమన్ను ముద్ద వాడు...
ఇంటిల్లిపాదిని ముందుకు నడుపే
బండినొగ ఇర్సుజారి ఎన్కబడిపోయింది
వొదులైన తాళ్లను గుంజి బిగ్గిత బిగించాడానికి
నరంలా సాగిన వానపాము వాడు...
ఒకటి గొట్టే రాతిరికి మడలుదిప్ప
వొరంగట్లపొడితి తిరుగులాడుతూ
సేనంతా పారాజూసే,
మిణుగురు పురుగుల కాంతి వాడు...
దిన, దినంకి సన్నవడ్తూ
ఆకలి బతుకులను ఈడుస్తున్న
ఎండుటాకుల చప్పుడు వాడు...
తెల్లారు జాముల్లో
పచ్చని పంటపొలాలపై వాలే
తెల్లరంగు పిట్ట వాడు...
పదిమందికి తిండివెట్ట
నల్లర్యాగడి మడుల్లో పూసే
బోనపు కుండల మెతుకు వాడు...
ఆకలి మంటలను ఆర్ప
నిత్యం వొళ్ళంత తడుపుకునే
సెమట సుక్కల వాగు వాడు...
వాడు రుమాలు కడితే
దేశం మొత్తం పొత్తిజుడుతది
వాడు నాగలి ఎత్తితే
ఎట్లాంటి ఎడ్లైనా మెడలు వంచుతాయి.
*మట్టిచెదల పుట్ట* కవిత నా స్వంతం.
అనువాదం/ అనుకరణా కాదు. ఏ మాధ్యమం లోనూ చేర్చలేదు.