అయినా మనిషికేం కావాలి ? గుప్పెడు ప్రేమ, తన కోసం ప్రేమగా కురిసే రెండు కళ్ళు అంటూ మంచిర్యాల నుండి తోకల రాజేశం రాసిన కవిత ' గుప్పెడు ప్రేమ కోసం ' ఇక్కడ చదవండి :
మనిషికే ముంటది
పిడికెడంత గుండె ఉంటది
దానిలో ఆకాశాన్ని సైతం నింపేటంత ప్రేమ ఉంటది
తోడుకోవటమే తెలియాల్సిన విద్య
కష్టాలను సుఖాలను
మల్లన్న బోనంకుండలోని బెల్లంబువ్వ లెక్క
పాయిరంగా పంచుకోవాల్సిన చోట
కులాల విస్తరాకులు పరుసుడెందుకు?
undefined
బండారునూ ఊదునూ కలిపి
అలాయి బలాయి గీతాలల్లుకుంటూ
అగ్ని సాక్షిగా స్నేహితులమైన చోట
మతాల కత్తులతో గోడ కట్టుడెందుకు?
ఆమె నువ్వూ కలిసి
మట్టిగోడలమీద వాలిన ముగ్గులోని జంట పక్షులై
పచ్చ పచ్చని కలల పాటలు పాడుకోవాల్సిన చోట
బతుకు తరాజుమీద మగవాడినని మొగ్గుచూపు డెందుకు?
నెత్తురునూ చెమటనూ మండించి
నీ యింటి నిండా నాజూకైన సుఖాలను పరిచి
నిన్ను లాభాల మెట్లెక్కించిన చోట
కార్మికుల కన్నీళ్లను దోచుకోవటమెందుకు?
మది మైదానంమీద విరిసిన పచ్చని వసంతాన్ని నరికి
బ్రహ్మజెముళ్లను నాటుకోవటమెందుకు?
అయినా మనిషికేం కావాలి
గుప్పెడు ప్రేమ
తన కోసం ప్రేమగా కురిసే రెండు కళ్ళు.