అనువాదానికి మరో పేరు 'జలజం'

By SumaBala BukkaFirst Published Nov 4, 2023, 9:57 AM IST
Highlights

నేడు జలజం సత్యనారాయణ వర్ధంతి సందర్భంగా కోట్ల వెంకటేశ్వర రెడ్డి రాసిన వ్యాసం ఇక్కడ చదవండి : 

బహుముఖీన ప్రతిభకు, సామాజిక చైతన్యానికి, బహు భాషా పాండిత్యానికి నిలువెత్తు నిదర్శనం జలజం సత్యనారాయణ. కవిగా, విద్యావేత్తగా, అనువాదకునిగా సామాజిక రాజకీయ విశ్లేషకునిగా సుప్రసిద్ధుడు. పాఠశాల ఉపాధ్యాయునిగా జీవితం ప్రారంభించి జూనియర్ లెక్చరర్ గా, డిగ్రీ కళాశాల రాజనీతి అధ్యాపకునిగా ఉద్యోగ ప్రస్తానం కొనసాగించాడు. వారి బోధన ఆ రోజుల్లో తరగతి గదికే పరిమితమయ్యేవి కావు. విద్యార్థుల్లో సామాజిక చైతన్యాన్ని రగిలిండంలో అతని శైలి అతనికే స్వంతం. తాను పనిచేసిన ప్రతిచోట చుట్టూ ఉండే సమాజంలో చైతన్యాన్ని నింపడానికి తన కాలాన్ని, ధనాన్ని త్యాగం చేశాడు.  
           
తన వంటి అభిప్రాయాలు, స్పృహ కలిగిన మిత్రులను కలుపుకొని తన ప్రాంత అభివృద్ధికి, వికాసానికి కృషి చేసిన  బాధ్యత కలిగిన పౌరుడు. పేద విద్యార్థులకు తక్కువ ఫీజుతో నాణ్యమైన విద్యను అందించాలనే సంకల్పంతో ఉన్నత పాఠశాలను, జూనియర్, డిగ్రీ కళాశాలలను స్థాపించి విద్యాగంధాన్ని పంచిన విద్యావేత్త. 

రాంమ్మోహన్(విరసం), అర్విణి రాజేంద్ర బాబు వంటి చైతన్య శీలురతో కలిసి " న్యూథింకర్స్ ఫోరం"ను ఏర్పాటు చేసి సామాజిక, రాజకీయ చైతన్యానికి దోహదం చేశాడు. తెలుగు దేశం అధినేత నందమూరి రామారావు శాసన సభకు పోటీ చేయమని కోరినా సున్నితంగా తిరస్కరించి సాహిత్య, సామాజిక రంగాలలోనే కొనసాగారు. తొలి, మలి తెలంగాణ ఉద్యమంలో ఎంతో చురుకుగా పాల్గొని ఎన్నో సభలు, సమావేశాలు నిర్వహించిన చరిత్ర వారిది. ఉద్యమ కాలంలో ' ధ్వని ' పత్రికను నిర్వహించి భావజాల వ్యాప్తికి కృషి చేశాడు.

తన వృత్తి రాజనీతి శాస్త్ర బోధనైనా సాహిత్యం పట్ల మక్కువ వారికుండేది. అత్యవసర కాలంలో ' అనల' కవితా సంపుటిని ప్రచురించి వరవరరావుకు వివాహ సందర్భంగా అంకితమిచ్చాడు.  వారిద్దరు జడ్చర్ల కళాశాల లో సహోద్యోగులు. అక్కడే సృజన పురుడు పోసుకుంది కూడ. క్రాంతి వంటి పత్రికను కూడా కొంత కాలం నిర్వహించిన చరిత్ర వారిది.

జీవన మలిదశలో అనువాద రంగాన్ని ఎన్నుకున్న జలజం అనేక ఇతర భాషల కవుల కవిత్వాన్ని వేగంగా అనువదించి తెలుగు సాహిత్యానికి అందించిన అనుసృజన శీలి. మొదట అటల్ బిహారీ వాజ్ పాయ్ ఎంపిక చేసిన కవితలను ' శిఖరం' పేర అనువదించి పాఠకాదరణ పొందాడు. ఆ తర్వాత కబీరు కవిత్వాన్ని ' కబీరు గీత'గా, ఆంసు హిందీ కవిత్వాన్ని 'వేదన' గా బిల్హణుని బిల్హణీయాన్ని ' శృంగార బిల్హణీయం'గా అనువదించారు. ఫైజ్ కవిత్వాన్ని ' ఇప్ప పూలు' పేర అనువదించారు. ఇట్లా పన్నెండు అనువాద కవితా సంపుటాలతో పాటు తన కాలం నాటి ప్రసిద్ధ కవుల కవితలు సేకరించి ' మానవుడే మా సందేశం' వంటి విశిష్టమైన కవితా సంకలనాన్ని మనకు అందించిన జలజం నవంబర్ నాలుగు 2021న అనారోగ్యంతో మరణించడం సాహితీ ప్రపంచానికి తీరని లోటు.

click me!