ప్రముఖ తెలుగు కవి ఎండ్లూరి సుధాకర్ కన్నుమూత

By Pratap Reddy KasulaFirst Published Jan 28, 2022, 8:10 AM IST
Highlights

ప్రముఖ తెలుగు కవి, రచయిత ఆచార్య ఎండ్లూరి సుధాకర్ శుక్రవారం తెల్లవారు జామున కన్నుమూశారు. ఆయన సాహిత్యానికి చేసిన సేవ ఎనలేనిది. ఆయన మృతితో తెలుగు సాహిత్య లోకం దిగ్భ్రాంతికి గురైంది.

హైదరాబాద్: ప్రముఖ తెలుగు కవి ఆచార్య ఎండ్లూరి సుధాకర్ కన్నుమూశారు.  శుక్రవారం తెల్లవారు జామున ఆయన తుదిశ్వాస విడిచారు. ఆయన వయస్సు 62 ఏళ్లు. ఎండ్లూరి సుధాకర్ మృతితో తెలుగు సాహిత్య ప్రపంచం విషాద సముద్రంలో మునిగిపోయింది. ఆయనకు నివాళులు అర్పిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఎండ్లూరి సుధాకర్ తెలంగాణ రాష్ట్రం నిజామాబాదులో పాములబస్తీలో 1959 జనవరి 21వ తేదీన జన్మించారు.

ఎండ్లూరి సుధాకర్ తెలుగు విశ్వవిద్యాలయంలో సీనియర్ ప్రొఫెసర్ గా పనిచేసారు. కేంద్ర సాహిత్య అకాడమీ జ్యూరీ సభ్యుడిగా, తెలుగు సలహా మండలి సభ్యుడిగా, తెలుగు అకాడమీ సభ్యుడిగా పనిచేశారు. ప్రసిద్ధమైన హిందీ, ఉర్దూ పద్యాలను తెలుగులోకి అనువదించారు. 

హైదరాబాదు వీధి బడిలో ఎండ్లూరి సుధాకర్ విద్య ప్రారంభమైంది. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి ఆయన డాక్టరేట్ పొందారు. ఎండ్లూరి సుధాకర్ ను పలు అవార్డులు అందించాయి. 1992లో ఫ్రీవర్స్ ఫ్రంట్ అవార్డు ఆయనను వరించింది. కవికోకిల జాషువా పురస్కరాన్ని అందుకున్నారు. ఎండ్లూరి సుధాకర్ మృతితో దళిత సాహిత్యం మాత్రమే కాకుండా తెలుగు సాహిత్యం అత్యంత విలువైన సాహితీవేత్తను కోల్పోయింది. 

వర్తమానం, జాషువా నా కథ, కొత్త గబ్బిలం, నా అక్షరమే నా ఆయుధం, మల్లెమొగ్గల గొడుగు, నల్లదాక్ష పందిరి, పుష్కర కవితలు, వర్గీకరణీయం, అటా జని కాంచె.., జాషువా సాహిత్యం- దృక్పథం - పరిణామం, గోసంగి, కథనాయకుడు జాషువా, నవయుగ కవి జాషువా, కావ్యత్రయం వంటి పలు రచనలు చేశారు. ఆయన తన సతీమణి హేమను కోల్పోయినప్పటి నుంచి విషాదంలో మునిగిపోయారు. ఆయన కూతురు మానస సాహితీవేత్తగా ముందుకు వచ్చారు. మనోజ్ఞ అనే కూతురు కూడా ఉంది.

click me!