వురిమళ్ల సునంద కవిత : నీ జాన్ జిగిరి దోస్త్

By Arun Kumar P  |  First Published Apr 12, 2023, 10:41 AM IST

గుండెలో ఎగదన్నుతున్న జ్ణాపకాల  కమ్మలకు అక్షరాలను తొడిగి గీ ఉత్తరంలో పంపుతున్నా! అంటూ ఖమ్మం నుండి వురిమళ్ల సునంద రాసిన కవిత ' నీ జాన్ జిగిరి దోస్త్ ' ఇక్కడ చదవండి : 


ఏయ్ దోస్త్!
నిన్ను తలచుకోగానే 
'ఈ వేళలో నీవు ఏం చేస్తు ఉన్నావో '_ పాట గుర్తొచ్చిందోయ్!

ఆకాశ దేశాన ఆషాఢ మాసంలో 
తిరిగేటి మేఘం లాంటిది కాదు ఈ లేఖ!

Latest Videos

నువ్వు మరిచిపోయిన ఎక్కాల పుస్తకంలో 
పదిలంగా ఉన్న నెమలీక ఇది!

'మా పెరటి జాం చెట్టు కింద కూర్చుని' 
జామాకులో బెల్లం, చింతపండు, 
ఉప్పు , కారంతో చేసి చుట్టిన లాలిపాప్ తిన్నప్పటి
పుల్ల పుల్లని తియ్య తియ్యని  ముచ్చట్ల యాది ఇది!

ఎండాకాలంల మనం పోటీపడి కొనుక్కున్న 
సెకండ్ హ్యాండ్ పుస్తకాలకు
తుమ్మ బంక అతికించి అట్టలేసుకున్న  బడి మురిపెం ఇది!

కావలి వున్న తాత కళ్ళు గప్పి 
రాయిసిరి రాల్చుకున్న పిందె మామిడి కాయ 
బాల్యపు రుచి ఇది!

పై సదువులకై
సంద్రమంత పట్నం వెళ్ళిన నువ్వు 
గివన్నీ మర్సిపోయిన వేమోనని
ఇదిగో ఇంటి గుమ్మంల కూసోని...

గుండెలో ఎగదన్నుతున్న జ్ణాపకాల  కమ్మలకు 
అక్షరాలను తొడిగి 
గీ ఉత్తరంలో పంపుతున్నా!

గిది అందిన నాలుగు పొద్దులకు
నీ చిన్నప్పటి పొత్తంలో  
మన అల్లరి ఊసుల పుటలు తెరిచి 
పంపే నాకు ఇష్టమైన అత్తరంటి నీ లేఖకై...

పెద్ద దర్వాజాకు నా  చూపుల తోరణాలు గట్టి 
ఎదురు చూస్తూ...
నీ జాన్ జిగిరి దోస్త్ ....
 
 

click me!