లిండా ఎలిస్ రాసిన ఇంగ్లీష్ మూలం కవితకు డాక్టర్ కొండపల్లి నిహారిణి చేసిన అనువాదాన్ని ఇక్కడ చదవండి
ఇంగ్లీష్ మూలం - లిండా ఎలిస్
తెలుగు అనువాదం - డాక్టర్ కొండపల్లి నీహారిణి
అది ఒక చితాభస్మ వేదిక
మిత్రుని చివరి ప్రయాణం
సమాధి పైన రెండు తేదీలు
ఇక్కడి నుండి అక్కడి వరకు అంటూ !
అక్కడొకతని కన్నీటి మాటలు
మొదటిది పుట్టింది చివరిది గిట్టిన జీవితానుసరణ అంటూ
ఇంకా అతని భావంలో
ఆ ఖాళీ కొన్ని సంవత్సరాల మధ్యదని
అది వట్టి ఖాళీ మాత్రమే కాదు
బ్రతుకు విశేషం
ఆ ఖాళీ కాలానికి ప్రతినిధి
నేలపై గడిపిన సమయమూ
ఆ ఖాళీ గురుతులే
ఎవరైతే జీవన సహచరులో
వారి ప్రేమ గుర్తులు కూడా!
అందుకే ,
రెండు తేదీల మధ్య ఆ చిన్ని గీత
ఎంతన్నదే కాదు
ఇంతలేనంతది
కార్లు ఇల్లు రొక్కమూ
అంతా మన నడత ఆప్యాయతలదీనూ
ఆ ఖాళీ పై నడిచొచ్చినంతదిగా
అదేమరి
అందుకేమరి
ఆ ఖాళీపై నుండి
కష్టమైనదీ సుదీర్ఘమైనదిగానే
కదా చేయాలి ఆలోచన
నీవేమైనా మార్చాలన్న ప్రయత్నం చేసావా ?
నీ కోసం
నీ ఏకాంత జీవనం కోసం
నీకేమైనా సమయాన్ని మిగుల్చుకున్నావా
నీ ఈ బ్రతుకు దొంతరలు సవరించుకోవడానికి!
మనదైన బ్రతుకు కోసం
మనముగా నెమ్మదించామా!
ఈ పరుగుల జీవన పోరాటాలలో !
సత్యాసత్య
నిర్థారణ కోసం
నీవే ఓ అర్ధమైపోయావు
అందరి ఆలోచనలలో
అందరి సంతోషాలలో
నీవే ఓ అనుభవమై పోయావు
నిన్ను నువ్వు తెలుసుకో వాళ్ళ నుండి
మరేమో
తొందరగా కోపానికి రాకు
అంతేకాదు
ఇతరులను మెచ్చుకో
నీ పరిధిలోని వారందరికీ
నువ్వు ఎప్పుడూ కోల్పోయే ప్రేమను పంచు
ఎక్కడైతే అరుదైన చిరునవ్వును ధరిస్తావో
అక్కడే ఇరువురి మధ్య కాపాడిన గౌరవం భద్రపరుచుకో
ఆ చిన్ని ఖాళీలో
ప్రత్యేకమైనదిగా కొద్దిగానైనా మిగులుతుంది ఆ స్మృతి
అయితే,
ఎప్పుడైతే నీ ‘ ఎలిజీ‘ , నీ స్మృతి గీతం చదువుతారో
నీ సజీవ చిత్రాలు వచ్చిపోతాయి
ఇదేకదా నీ సగర్వతా చిహ్నాలు!
ఏదైతే
నీవు ఆర్జించిన
ఖాళీలో ప్రతిబింబం అదే అయ్యేది!