వేణు నక్షత్రం కవిత : అంటే .. నేను బ్రతికే ఉన్నానని కదా ?

By Arun Kumar P  |  First Published Aug 10, 2023, 2:38 PM IST

నా ఫొటోకు  నీవేసిన ఆ పూలదండ నా గుండెకెంత  గాయం చేస్తుందో  అంటూ   వా‌షింగ్టన్ డిసి నుండి   వేణు నక్షత్రం రాసిన కవిత  ' అంటే .. నేను బ్రతికే ఉన్నానని కదా ?  ' ఇక్కడ చదవండి : 


నన్ను నేను గిల్లి  చూసుకున్నాను 
నొప్పి స్పష్టంగా తెలుస్తోంది 
అద్దంలో మరీ మరీ చూసుకున్నాను  
నా ఉంగరాల జుట్టును  తడిమి చూసాను    
నా చేతి వేళ్ళకి మెత్తగా తగులుతోంది 
అంటే….  నేను బ్రతికే ఉన్నానని  కదా? 

ఆ వార్త చూసిన నాలో
రక్తం సలసలా మరుగుతుంది  
నా రోమాలు నిక్కబొడుచుకుని  చూస్తున్నాయి 
నా ఆవేశం అంచులు తెంపుకుని 
అన్ని దిక్కులూ కలియ చూస్తుంది 
అంటే….   నేను బ్రతికే ఉన్నానని కదా?

Latest Videos

నా ఫొటోకు  నీవేసిన ఆ పూలదండ 
నా గుండెకెంత  గాయం చేస్తుందో 
హృదయమే లేని నీకు ఎలా అర్థం అవుతుంది?

నా ఫోటోలో పెట్టిన ఆ మండుతున్న దీపాలు 
నా మనసుకి  పెట్టిన మందు పాత్రల్లా పేలి 
నాలో ఎంతటి బీభత్సం సృష్టిస్తున్నాయో   
మనసే లేని నీకు ఎలా తెలుస్తుంది?

నీ ఒక్క తప్పుడు వార్త 
ఎన్ని జీవితాలని బలి తీసుకుంటుందో 
ఎందరు ఆత్మీయుల్లో కలకలం సృష్టిస్తుందో 
తల్లితండ్రులకు ఎంతగా  గుండె కోతను కలిగిస్తుందో 
ఒక్క సారి ఆలోచించావా? 

పెట్రోలు  మంటల వేడికన్నా 
నీ ఇంకు సిరా తప్పుడు రాతలే  
నన్ను  దహించి వేస్తున్నాయి 

నీ తప్పుడు రాతలతో సగం చచ్చినా..
నేను ఇంకా బ్రతికే ఉన్నాను! 
నా కోసం పరితపించే  వాళ్ళ కోసం 
నేను చేయాల్సిన ఇంకా కొన్ని సమాజహిత 
కార్యక్రమాల కోసం 
నాపై ఆశలు పెట్టుకున్న ఎందరో అభిమానుల కోసం 
నేను ఇంకా బ్రతికే ఉన్నాను!!

(బ్రతికున్న కొందరు ప్రముఖులు మరణించినట్లు తప్పుడు వార్తలు మీడియాలో  ప్రసారం అయిన  సందర్బంగా కలిగిన స్పందనకు అక్షరరూపం)

click me!