మేఘాలకు మనిషితనం లేదు గనుక ఇచ్చిన మాటను విసిరేసే గుణం కాదు గనుక ' వానొస్తుంది ' అంటూ ఆదిలాబాద్ నుండి డా. ఉదారి నారాయణ రాసిన కవిత ఇక్కడ చదవండి :
వానొస్తదా
నిజంగానే వానొస్తదా!
రావాలనడానికి
పెనం మీది నూనె బొట్టులా
చెరువులో మూలనున్న నీటిచుక్కలే సాక్ష్యం
వానొస్తది
మేఘాల కడుపుల్లో
ఎన్ని రోజులు గర్భవతిగా గడుపుతుంది
ఆకాశం చీకటి గదిలో
ఎన్నిదినాలు పురిటి నొప్పులు భరిస్తుంది
వానొస్తది
నేడో, రేపో, ఇప్పుడో, ఈజామో, ఆజామోవచ్చి
సూర్యుని ఎండదుప్పటిని
నీటి కత్తులతో చీల్చి
భూమిపై పచ్చని తివాచి పరిచి
గర్మివాళ్ళు తనివి తీరా
హాయిని పీల్చుతున్నపుడు
కళ్ళారా చూసి మురిసి పోదామని
వానొస్తది
undefined
ఆకుపచ్చని చెట్ల కురులు
ఎండకు ఎరుపెక్కినయని
పూల బాలల చెంపలు మాడి పోయాయని
పాలకోసం గుక్కపట్టిన పసిపాపలా
పశుపక్షాదులు నదుల ఎదలపై
తండ్లాడటంను చూడలేక వానొస్తది
ఎగదోస్తున్న మంటల్లో పడ్డ
భూచరాల కేకలు విని ఉండలేక వానొస్తది
మేఘాలకు మనిషితనం లేదు గనుక
ఇచ్చినమాటను విసిరేసే గుణం కాదుగనుక
మాటిచ్చి మోసపు మడుగులో
ముంచే తత్వం లేదు గనక
కొంచెం వెనకో ముందో తప్పకుండా వస్తది
మలినాలతో కడుపుబ్బిన
సముద్ర ఘోష విషమించడం చూసి
మనకు ప్రాణజల మివ్వడానికి వానొస్తది
భూమి ఆకాశాల సుదీర్ఘ ప్రేమకు
చిగురులు తొడగడానికి వానొస్తది
వాన తప్పకుండా వస్తది
పక్షికంటి దుఖాన్ని తుడవడానికి
పశువుల కాలిడెక్కల మంటలు ఆర్పడానికి
చెట్ల తాపాన్ని తీర్చడానికి
వానొస్తది వాన తప్పకుండా వస్తది
తాను ఖాళీ దేహమై
తన జీవితమే ఖాళీ చేసిన ఇల్లయి
మనకోసం ఇక్కడో అక్కడో ఎక్కడోఒకచోట
వస్తూ కురుస్తూ పలుకరిస్తూనే ఉంటది
తన జీవధాతువుల్ని ధార పోస్తూనే ఉంటది.