ఆధునిక కాలంలోనూ తెలుగుకు ప్రత్యేకత - ప్రముఖ రచయిత డా.సూర్యప్రకాశ్ రావు

By Siva KodatiFirst Published Aug 29, 2023, 6:49 PM IST
Highlights

నర్సాపూర్ మండలం కాగజ్ మద్దూరు జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా  నేడు  ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు.

నర్సాపూర్ మండలం కాగజ్ మద్దూరు జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా  నేడు  ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఆధునిక కాలంలోనూ తెలుగు ప్రత్యేకతను నిలుపుకుంటోందని ప్రముఖ రచయిత డా.రాయారావు‌ సూర్యప్రకాశ్ రావు అన్నారు. నర్సాపూర్ మండలం కాగజ్ మద్దూరు జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా మంగళవారం నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. 

'ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్' గా తెలుగు‌ గుర్తింపు పొందిందని ఆయన చెప్పారు. ఆధునిక సాంకేతిక విషయాలను కూడా తెలుగులో నేర్చుకోవచ్చని ఆయన వివరించారు. వ్యావహారిక భాష ప్రాచుర్యం పొందేందుకు గిడుగు వేంకట రామమూర్తి‌ చేసిన కృషి‌ని‌ తెలుగు జాతి‌ ఎప్పటికీ మరిచిపోదని ఆయన పేర్కొన్నారు. గిడుగు‌ వేసిన పునాదులపైనే పత్రికల్లోనూ, రచనల్లోనూ వ్యావహారిక భాషకు పెద్దపీట వేస్తున్నారని చెప్పారు.

 

 

ఎన్ని భాషలు నేర్చుకున్నా మాతృభాషలో ఏదైనా విషయాన్ని తేలికగా వివరించవచ్చని పాఠశాల తెలుగు ఉపాధ్యాయులు ఏ.శ్రీనివాస్ అన్నారు. తెలుగులో సంభాషించాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు అప్పలనాయుడు తెలుగు భాషపై పాడిన పాట విద్యార్థులను అలరించింది. 

తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా కాగజ్ మద్దూరు ఉన్నత పాఠశాలలో ప్రత్యేక పోటీలు నిర్వహించారు. పోటీల్లో విజేతలకు కార్యక్రమంలో బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు వేంకటేశ్వర రావు, సురేశ్, షరీఫ్, కవిత తదితరులు పాల్గొన్నారు.

click me!