బతుకు నన్ను భయపెట్టజాలదు అంటూ ఎలనాగ చేసిన అనువాద కవిత ఇక్కడ చదవండి..
గోడమీద నీడలు,
కింద హాలులో సవ్వడులు
బతుకుకు నేను అసలే భయపడను
దుష్టశునకాల మొరుగుళ్లు,
మబ్బులో పెద్ద దయ్యపు ఆనవాళ్లు
జీవితానికి నేను అసలే భయపడను
undefined
కథలు చెప్పి భయపెట్టే నికృష్టపు ముసలమ్మ,
విచ్చలవిడిగా తిరిగే సింహాలు
నన్నసలే భయపెట్టలేవు
నా మంచంమీది దుప్పటి పైన
మంటలుమిసే డ్రాగన్లు
నన్ను అసలే భయపెట్టలేవు
అరిచి అదిలించి వాటిని వెళ్లగొడుతాను
అవి పారిపోతుంటే వినోదంతో నవ్వుతుంటాను
ఏడవను కనుక అవి పలాయనం చిత్తగిస్తాయి
కేవలం చిన్నగా నవ్వుతాను
అవి ఉద్రేకంతో చెలరేగుతాయి
బతుకు నన్ను అసలే భయపెట్టదు
బలవంతులైన మనుషులు
రాత్రంతా ఒంటరిగా కొట్లాడుతుంటారు
జీవితానికి నేను అసలే భయపడను
తోటలో చిరుతపులులు,
అంధకారంలో అపరిచితులు
ఉహుc, వాళ్లు నన్ను భయపెట్టలేరు
తరగతిగదిలో నా జడలు పట్టి లాగే అబ్బాయిలు
(అమ్మాయిలేమో రింగులు తిరిగిన వెంట్రుకల్తో
మోహహాన్ని రేపుతారు)
నన్ను అసలే భయపెట్టలేరు
కప్పలనూ పాములనూ చూపించి
నేను భయంతో అరిస్తే వినాలనుకోకండి
కలల్లో తప్ప వాస్తవంలో
నేను అసలే భయపడను
నా దగ్గర మాయాతాయెత్తు వుంది
శ్వాస తీసుకునే అవసరం లేకుండా
సముద్రం అడుగున నడవగలను నేను
జీవితం నన్ను అసలే అసలే అసలే
కొంచెం కూడా భయపెట్టజాలదు
ఆంగ్లమూలం: మాయా ఆంజెలో
తెలుగు సేత: ఎలనాగ