చేతులనే కాదు శరీరాలనే విసిరేస్తున్న బలమైన గాలిముందు పాపం చిన్నపిల్లాడై దిక్కుతోచక ఏడుస్తున్న దీపం అంటూ డా. సరోజ వింజామర కవిత ' విఫల యత్నం ' ఇక్కడ చదవండి :
నువ్వోసారి నేనోసారి
విరిగిన అద్దపు ఫలకాల్ని జోడించుకుంటూ
పలచబడిన పొరలతో తెగుతున్న దారానికి
పువ్వులల్లే ప్రయత్నం
విరాగి నవ్వుల మధ్య
మనం మనంగా మిగలని తీరాలపై మౌనంగా
undefined
స్పష్టంగా కనిపిస్తున్న దూరాలను
తగ్గించుకోవాలనే తాపత్రయంలో మరోసారి కలుస్తూ
రెండు పర్వతాల మధ్య ఆగాధానికి వంతెన వేస్తూ
ఇపుడో అపుడో మిథునరాశులు
ఏదీ మనసుల జాడ
ఏదీ తేలికపరచే ఆ ఆత్మీయ ఆలింగనం
చల్లదనాల కోసం కలిసే ఆ సాయంత్రాలు
మిట్టమధ్యాహ్నపు సూర్యుణ్ణి
ఎప్పుడు వెంటేసుకొచ్చాయి!!
కొడిగడుతున్న దీపానికి
ఎన్నిసార్లని చేతులడ్డం పెట్టగలం
చేతులనే కాదు శరీరాలనే విసిరేస్తున్న
బలమైన గాలిముందు
పాపం చిన్నపిల్లాడై దిక్కుతోచక ఏడుస్తున్న దీపం
చెవులు మూసుకున్నా
వేళ్ళ సందులను తోసుకుని వస్తోంది
నిన్నూ నన్నూ మనంగా మిగల్చని
విధి వికటాట్టహాసం.