కవిత్వపు ఆకలి తీర్చే వరిపంట 'మొలగొలుకు చేను'

By SumaBala Bukka  |  First Published May 14, 2023, 2:11 PM IST

శివకుమార్ పేరిశెట్ల  కవిత్వ సంపుటి  ' మొలగొలుకు చేను '  పైన  నిజామాబాద్ నుండి జి నరసింహస్వామి రాసిన సమీక్ష ఇక్కడ చదవండి :


కవిత్వం ఎలా వస్తుందనే దానిని తెలుసుకోవాలంటే శివకుమార్ పేరిశెట్ల  జీవితాన్ని తెలుసుకుంటే సరిపోతుంది. ఒక జీవితకాల అనుభవం ఎంతటి పక్వ ఫలాలని అందిస్తుందో తెలుస్తుంది. తన జీవితంలో ఎక్కడా వెనక్కి వెళ్లలేదు. జీవితం తనను శాసిస్తూ ఎటు తీసుకుపోయినా తనలోని కవిత్వపు తడిని వెంట బెట్టుకునే జీవితం చెప్పినట్లు నడిచాడు. తండ్రి తన తొలి గురువు కావడం ఎంతగా సౌకర్యవంతం అవుతుందో అతని జీవితం మనకు తెలుపుతుంది. కుటుంబంలో, సమాజంలో, స్కూల్లో అతని చుట్టూతా రంగస్థలం కమ్మేసినట్లే ఉండేది. కవిత్వాలు, సంగీతాలు, నాటకాలు, పాటలు... గురువుల ప్రోత్సాహంతో తనకు తెలియకుండానే లోలోన తనలోని వ్యక్తిత్వం చిక్కనైన కవిత్వం అవుతూ వచ్చింది. కాలేజీ రోజుల్లో మేగజైన్లో కవిత రావడం, బొమ్మలు వేయడం కలగల్సిపోయి అతనిలోని భావుకుడిని ప్రభావితం చేస్తూ వచ్చాయి.

చిన్నతనంలోనే అమ్మ పోవడం, చదువు చట్టుబండలు కావటం, పొలం పనులు చేస్తూ ఉండటం, ఉన్న కాస్త పొలం సముద్రంనీటిలో కలిసి ఉప్పుముద్ద కావడం, ఒడ్డున కట్టుకున్న గూళ్ళన్నీ సముద్రం తనలోకి లాగేసుకున్నట్లు తను పడిన కష్టమంతా ఫలితంరాని పంటచేనైంది. ఎటూ పాలుపోని జీవితం, ఎంతగా చూసినా ముందు ఏమీ కానరానంత చీకటిమయం అయిపోయింది. ఆ చీకట్లోనే వెలుగురేఖలా వైద్యవృత్తి సమాజానికి తాను ఇవ్వాల్సిన దాన్ని ఇచ్చేలా చేసింది. ప్రపంచాన్ని దాదాపు శూన్యంలోకి నెట్టేసిన కరోనాకాలంలో సమాజానికి తన వృత్తి ద్వారా చేయగలిగిన దానికన్నా ఎక్కువ సేవను చేశాడు. కరోనాకాలంలో వైద్యులందరూ ఒకవైపు డబ్బుల్ని పోగేసుకుంటుంటే తనేమో వైద్యానికి అసలైన పర్యాయపదమై సేవ చేస్తూ తన చుట్టుపక్కల వారి జీవితాల్లో నుంచి ఎన్నో చావుల్ని దూరం చేయగలిగాడు.

Latest Videos

ఎంతైనా కవిగదా... కవిత్వమే జీవితమైన వాడు గదా.... ఆధ్యాత్మికత జీవితాన్ని పరిపూర్ణత్వం వైపు తీసుకెళ్తుంది అనే మాటలు నిజం చేసేలా తను "శ్రీ చాముండేశ్వరి సుప్రభాత శతకా"న్ని రాశాడు. తద్వారా తన మానసిక స్థైర్యాన్ని పెంచుకొని, తనలోని మానవత్వాన్ని వెలిగించుకోగలిగాడు. సమాజం ఎన్నో కొరతలతో నిండిపోయి ఉంది. దానికి మనం ఇవ్వగలిగేది ఆ కొరతల్ని పూరించడంతో పరిపూర్ణం కావాలి. ఆధునిక కవి తను నివసించే సమాజంలోని అట్టడుగు వ్యక్తికి ఒక ఉద్దీపన ఇవ్వగలగాలి. ఆ దిశగా తన జీవన ప్రయాణాన్ని సాహిత్యం ద్వారా సాధించగలగాలి. ఈ దిశలో ఆయనను నడిపించింది అచ్చమైన ఆధునిక కవి రాధేయగారే. ఎవరు మన జీవితంలోకి వస్తే మొత్తం జీవితంలోని ఆలోచనల్లో విస్తృతత్వం వస్తుందో, ఆ పనిని శివకుమార్ పేరిశెట్ల  జీవితంలో రాధేయ చేయగలిగారు. పట్టాలపై కూడా ఆగుతూ ఆగుతూ నడుస్తున్న వాణ్ణి అసలైన వేగంతో వెళ్లగలిగేలా చేశాడు. ఒక కొత్త కోణాన్ని, సాహితీ సౌందర్యాన్ని శివకుమార్ పేరిశెట్ల కవిత్వానికి అబ్బేలా చేశాడు. మార్పు మంచికేననే విషయం తన సాహితీ ప్రస్థానం ద్వారా చూయించింది.

మొలగొలుకు అనేది నెల్లూరు జిల్లాకు పర్యాయపదమై అందరి నోళ్ళూ నెల్లూరు పేరును తలుచుకునేలా చేసిన ఒక రకం వరివంగడం. శివకుమార్ స్వయంగా చిత్రకారుడు కూడా కావడం వలన తన పుస్తకానికి అందమైన, ఆలోచనాత్మకమైన ముఖచిత్రాన్ని వేయగలిగాడు. నోట్లోకి వచ్చి అందరి ఆకలిని తీర్చేలా బువ్వ పెట్టిన  నెల్లూరు మొలగొలుకు  వరి వంగడం చేపల చెరువుల వలలోకి ఎలా తనకు తెలియకుండానే వెళ్ళిపోయిందో కవి, చిత్రకారుడు అయిన శివకుమార్  అద్భుతమైన ముఖచిత్రాన్ని అందించి, అందరి ఆలోచనలని తన పుస్తకం లోపలికి వెళ్లేలా చేయగలిగాడు.

ఇక 'మొలగొలుకు చేను' కవిత్వంలోకి వస్తే "మా ఊరి మందల" కవితలో రైతు సేద్యం చేసి చేసి చివరికి 'యానామీ రొయ్యల్ని యాడాది పొడుగూతా తినమరిగి... ఏందో ఐపోయిందయా!' అంటూ రైతు తన పొలాన్ని పాడు చేసుకుంటూ రొయ్యలచేను చేసుకుని ఎలా చెడిపోయాడో చెబుతాడు. "నేనొక పనిపురుగుని" కవితలో కవి 'తన నెత్తురే జాతికి ఇంధన'  మని, 'వూపిరి యచ్చదనమే లోకానికి పొద్దుపొడుప'ని,  'కండల కరుకుదనమే నేలకి ఎక్కడలేని ముడుప'ని, తన 'వెన్నెముకే జాతి జలపాతానికి ఆనకట్ట  కడుతుంద'ని కష్టజీవిని మనకు మరో కోణంలో దర్శింప చేస్తాడు. "ఆకాశానికి రంగులద్దండి" లో 'పారాసిటమాలు కూడా దొరకని పల్లె మబ్బుల్లో  / ఆకుల సూరీడు ఉదయించడంలో ఆశ్చర్యమేముంది' అంటూ పల్లెలు వైద్యానికి దూరమై అలమటిస్తుంటే, ఆయుర్వేదమే ఆదుకుంటుందని లేదా ఏదో పసరు పూసుకుని రోగం తగ్గడమో, జనం తగ్గడమో జరుగుతుందని నర్మగర్భంగా తెలుపుతాడు. చివరికి 'ఆకాశానికిపుడు కొత్త రంగెయ్యాల'ని, 'సూర్యుడికి కొత్తదారి చూపించాల'ని, 'గుర్రాల రథాన్ని గుడిసెల ముందు నిలపాల'ని, 'ఆకాశపు హైవేని నేలకు మళ్లించాల'ని సామాన్యుని వైపు మనం  ఖచ్చితంగా  నిలబడేలా చేస్తాడు. కరోనాను పారదోలే వైద్యులు కనక మరణిస్తే 'ఏ కిరీటాలు పెట్టకున్నా సాటి మనిషిగా అంతిమ సంస్కారం చేయమ'ని "సాటి మనిషిగా" అనే కవితలో  ఒక డాక్టర్ గా తను అర్థిస్తాడు.

టైటిల్ కవిత "మొలగొలుకు చేను" లో పల్లె గొప్పదనాన్ని తెలుపుతూ 'తొలిగొడ్డు ఊరు దాటినా చివరిదింకా కొట్టం దాటేది కాదు' అని వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు పల్లెల్లో ఎంత ఘనంగా పాతుకుపోయి ఉండేవో చెబుతాడు.

'వరి కోతలప్పుడు వైకుంఠం దిగివచ్చిన లచ్చిందేవిలా వరికుప్పలు... కాదు... కాదు....  బంగారు తిప్పలు' అంటూ, 'ఆకుపచ్చని అమృతాన్ని నేలకు తెచ్చింది  / తూర్పార పట్టిన తులమెత్తు తాలు గింజలు ఉండని మొలగొలుకులు' అంటూ విశ్లేషణ అక్కర్లేనంత గొప్పగా చెబుతూ, 'బంగారం పండించిన రైతు  / ఇప్పుడు బియ్యం కొనుక్కుంటుండాడు' అంటూ వాస్తవానికి మనల్ని లాక్కొచ్చి కవితను ముగిస్తాడు. ఈ అద్భుతమైన కవితకు  ఎక్స్ రే అవార్డు - 2021 రావడం చాలా సముచితంగా ఉంది. తన తండ్రిని గురించి "కారణజన్ముడు" కవితలో  'సంగీతం ఆయన ఉచ్ఛ్వాస / సాహిత్యం ఆయన నిశ్వాస / నాటకం ఆయన ధ్యాస / వైద్యం ఆయన తుదిశ్వాస  / మానవత్వానికి ఆయన ఓ మణిపూస' అంటూ తన తండ్రి జీవితం మొత్తాన్ని ఐదు పంక్తుల్లో చెబుతాడు. తన జీవితాన్ని తండ్రి మార్గదర్శకత్వ దర్శనంలో తరింపజేసుకుంటాడు.

మరో కవిత "రుణంలేని రుషి"లో 'కూలి మగ్గం నేసినా నేల సాగుచేసినా సంగీతం వినిపించినా సాహిత్యం విరచించినా తనలో కళామతల్లి తొంగిచూసేది లలిత కళలన్ని కలబోసిన ఘనుడు మా నాన్న' అంటూ తలుచుకుంటాడు. మరో కవితలో  'బంతికూటిని బతుకంతా ఎరగని బజారు జాతోడి బంధువున'ని తను నిరంతరం చెమటజీవికి చెందిన వాడినని నిర్భయంగా ప్రకటిస్తాడు. "నూలు పురుగులు" కవితలో మనుసుల్ని గొడ్డుల్నుండి ఏరుజేసే గుడ్డపాతల్ని కనిపెట్టిన నూలుదేవుళ్ళం  / మొగ్గం సప్పుల్లతో సూరీన్ని నిదర్లేపి / కండిలు రాటంతో చీకట్ని తోడిన మేము / చిరుగ్గుడ్డల్లో సిగ్గును దాసుకుని / పొస్తుల దీపంతో ఆకలి మసకలో బతుకీడుస్తుండాం' అని 'మా ఎడారిపొట్టల'కు 'నాయకులు చల్లే పరిగ్గింజల్తో చంటి పేగులు కూడా కుదుటపడ్డం లేదం'టూ పద్మశాలీల బతుకుల ఛిద్రాలను బహిర్గతం చేస్తాడు.  రైతును గురించి చెబుతూ  'రైతు చాటపొలి తగలని అన్నం ముద్ద అసలెక్కడుందబ్బా?  నేలబిడ్డ కన్నీటిసుక్క నేలపాలయితే ఆకలిపాతమే' అంటూ రైతుల ఉసురు తీసుకుంటున్న సమాజాన్ని, రాజ్యాన్ని నిలదీస్తాడు.

"సిపాయి సింహం" కవితలో  'లోయలోని మంచుగడ్డకి మరతుపాకీ కున్నంత పొగరే కాదు / మాతృ దేశ రక్షణలో తనూ మారణాయుధమైంది /యుద్ధంలో నేలకొరిగినా  సరిహద్దు సైనికుడి సమాధి వందేమాతరం ఆలపిస్తుంది / శరీరం ఛిద్రమైనా సిపాయి గుండె కవాతు చేస్తుందం'టూ సైనికుని త్యాగాన్ని చిరస్మరణీయం చేస్తాడు.  అట్టడుగు వారికి జ్ఞానం ఇవ్వకపోవడం ఎంత నేరమో "ఉప్పాసులు" కవితలో  'ఊరికి దూరంగా దరిద్రానికి దగ్గిరగా మీరు నెట్టేయబట్టే...  / మేము కొత్త బొమ్మల్ని కొలువు దీర్చుకుంటున్నం! /  ఉపనిషత్తుల్లో సారం మాకూ రవ్వంత చెప్పుంటే...  / ఉప్పాసుల తోరణాలు మేమెందుకు కట్టుకుంటాము సామీ??' అంటూ జ్ఞానం మా సొంతమే అని విర్రవీగే జాతిని చర్నాకోలతో కొడతాడు. తమదైన దేవతల్ని తామెందుకు సృష్టించుకుంటారో తెలియజేస్తాడు.

వరద ఉధృతిలో సముద్రం పక్కన ఊరు ఎలా ఉంటుందో "పిచ్చి పెన్నమ్మ" కవితలో  'సమంద్రం పిలిసిందో ఏమో / నీటి సుట్టాలనందరినీ కూడేసుకుని పరుగులు తీస్తా వుంది పిచ్చి పెన్నమ్మ !  రైతుల చెమటకి... సముద్రం  ఉప్పెక్కింది / యాటాడందే పూట గడవని జాలరి పొట్టల్లో జలగలు పెరకతుండాయి' అంటూ హృదయ విదారకమైన జీవన విలయాన్ని తెలుపుతాడు.  మరికొన్ని కవితల్లో 'నువ్వు జర్కిన్ కప్పుకుని ఊరంతా వెచ్చగుందంటే ఎట్ట?  వీధి దీపం కింద చిరిగిన దుప్పట్లో బిగబట్టిన ఊపిర్లుండాయి చూడు!',  'మానవ సంబంధాలన్నీ... ఆర్థిక వృక్షానికి విరిసిన కరెన్సీ పువ్వులే!, 'కులం నిచ్చెనమెట్ల కిందిమెట్లు తొలగిపోతే  పై మెట్లనెక్కే దారుంటదా' అంటూ తను చెమట జీవి కష్టం వైపేనని, అణగారిన వాడు అందలం ఎక్కడమే తన ఆశయమని తెలుపుతాడు.

చివరి "ప్రేమవాచకంలో"    'గోరంత దీపాన్ని చేత పట్టుకుని  / గోపురమంత లక్ష్యాన్ని ఛేదించాం / చీమంత అవకాశాన్ని అందిపుచ్చుకొని / శిఖరమంత ఆనందాన్ని చేతబట్టాం! / రువ్వ రువ్వనీ పొదుపు చేసి అప్పులతిప్పల్ని కరగదీశాం / ప్రతీ నిమిషాన్ని పిడికిట దాచి సమయపాలన చేశాం! / వెనుదిరిగి చూసుకుంటే సుదీర్ఘ బతుకు నైలునది మా జీవితం! /  తెప్ప నేనైతే తెరచాప తను... / నది నేనైతే తీరం తనే...!!'  అంటూ  తన జీవితంలో నిరంతరం చేదోడు వాదోడుగా   నిలిచిన తన శ్రీమతి గురించి అద్భుతంగా కవిత్వీకరణ చేస్తాడు‌.   ఇంత అందమైన అభివ్యక్తి ఉన్న ఈ పుస్తకంలో గొప్పవైన పదబంధాలు మనల్ని పలకరిస్తాయి. నెల్లూరు జిల్లా మండలికాలు కనిపిస్తాయి. జీవితాలు కళ్ళముందు కదలాడుతాయి. జీవనం ఎంతగా ముళ్ళ ప్రయాణమైనా, పువ్వుల తోవలని చేసుకుంటూ ముందుకు సాగాలని, తనకున్న దాంట్లోంచి సమాజానికి ఎంతో కొంత ఇవ్వాలని ఎంతో గొప్పగా తెలియజెప్పిన శివకుమార్ పేరిశెట్ల   'మొలగోలుకు చేను ' కవితా సంపుటి తెలుగు సాహితీ వనంలో సుగంధాలని వెదజల్లుతూ ఉంటుంది.

click me!