రామప్ప దేవాలయాన్ని వరల్డ్ హెరిటేజ్ మాన్యుమెంట్స్ లలో ఒకటిగా గుర్తించి నేటికి సంవత్సరం అయిన సందర్భంగా డా॥ కొండపల్లి నీహారిణి రాసిన కవిత "రామప్ప హృదయ కళాపూర్ణోదయం '' ఇక్కడ చదవండి :
అక్కడంతా ఏదో అలవోకగా పైరగాలి తాకితే కలిగే పరవశం
కనుబొమ్మలు ఎత్తితే మనసును మురిపించే సింగిడి తన్మయత్వం
అనుభవ రమ్యత తన సగర్వతై
విశ్రాంతెరగని శ్రమతత్వమంతా
ఉలి చేతి వెలుగే అయినప్పుడు
మహా శిల్పీ! రామప్పా!
ఈ నల్లని రాళ్ళలో ఎల్లలెరుగని కళాకృతులు
నీ చల్లని చేతులతో కుప్పబోసావు కదూ !
హృదయ కళాతత్వం
చెక్కిన ప్రతిసారీ
గెలుపురవ్వలు పడి నేలంతా
ఎర్రని మట్టి పరిమళాలు కదూ విరజిమ్మింది !
చీకటిని చీల్చి వచ్చిన కిరణాల్లా రస భావాలు ఉదయించి
నీవు నీవై నిలిచావు
చూసే మనస్సుల పడిలేచే భావ కెరటాలలో
శిల్పచాతురిగా నిను యెదకెత్తుకున్నారు
రామప్పా , పొగడ్తలన్నీ
గుంపులు గుంపులుగా
స్వరదృశ్య మాలికలయ్యాయి
రాతి గోడల ప్రతిధ్వనులలో
లోకం పోకడల పోలికలే
ఉరకలెత్తుతుంటాయి
ఇక కొందరు అంటుంటారులే ..
ఏవేవో రాగ విరాగ భావనలు
నిన్ను కలవర పరచగా
ప్రఖ్యాత శిల్పివయ్యావని
కళాహృదయం అనేకానేక రసనదుల సంగమస్థలి అని
నీ పేరనే శివుడు గుడిగా వెలిసాడనీ
తెలిసీ తెలియనితనమది
రామప్పా !
నీ చేతి నున్నని పనితనం
ఉలి నుండి సన్నగా జారి తేరి
కరముద్రలూ నిర్ణిద్రభంగిమల సౌందర్యాలూ
ప్రతిమల మెరుపులైనవి
undefined
రాళ్లు చక్కని పూలుగా పూచాయి
పున్నాగలు సన్నాయి గీతాలెత్తుకున్నాయి
చెక్కణాలు మృదంగాలు మోగాయి
పురాణకథలు తీరొక్క రీతి బొమ్మకట్టాయి
నాట్య భంగిమల రాగిణీ నాగినిలు క్రీగంటి వాల్గంటులైనారు
దేవళ శుభోత్సాహ
మంగళ ధ్వనులు వినిపిస్తూ
చెరగని చిక్కని ఊహల్లా
చిరగని వెన్నెల వస్త్రాల్లా అనిపిస్తాయి!!!
కొందరిహృది లయ లోయలలో పడి విలవిల
కొందరి మనసేమో వరద గూటి ఆశల గుండంలో పడి గిలగిల
ప్రకృతి ఏ కృతి చేసిందో గానీ...
మొలక లాలిత్యంగా
తన ఆకుపచ్చరంగును పంచినట్టు
కొత్త కవిత్వపుస్తకంగా ఎగిరొచ్చిన పక్షి ఒకటి
తన స్వేచ్ఛనంతా చూపరుల
ఆనందాలకు పంచినట్టు
చేత చిక్కిన కొత్త చైతన్యం
హాస పరిహాస సమ్మిళిత వాక్యంలో
వర్ణమిశ్రమాలైనట్టు జాతి చరిత్రను రూపుకట్టావు
నింగి నేలల చిత్రాల్లో అందాలుగ పెంచావు
మనోరమ్యతకు ఆలవాలమై
మాటలు ఆడని మౌనవన శబ్దమూలాన్ని
స్వరం వినబడినంతవరకూ
దృశ్యగమనం చేస్తూ
అంతరాలు తోసిరాజనే మణిమకుటాన్నిచ్చావు
ఓహో రామప్పా!
రక్తి రసాభిషిక్తా !!!
ఎంతటి చతుర రంగాంతరంగంతో
నీ శిల్ప చారిమను ఆవిష్కరించావో!
జాతి చరిత్ర కాలగర్భంలో కలిసిపోవద్దని
అలసట మరచి
నీవు చెక్కిన శిల్పసోయగాలను
కనుల కరవు తీరా కన్న ప్రపంచం
నిన్ను గుర్తించింది నేడు !
నీవు శిల్పాక్షర హృదయ కవివి,
శిల్పకవివి !
అనల్ప శిల్ప రసవత్ కవివి !
నీ కావ్యం రామప్ప గుడి