కవి, రచయిత, అనువాదకులు నిజాం వెంకటేశం స్మృతిలో గాజోజు నాగభూషణం రాసిన కవిత " అక్షర బంధువుకు అశృనివాళి " ఇక్కడ చదవండి :
ప్రతి ఎదను ఎన్నముద్ద గా తలచిన
అమాయకపు ప్రేమదీపం ఆరిపోయింది
ప్రతి భుజాన్ని తన్మయత్వంతో తట్టిన
భరోసా వాక్యం ముక్కలయ్యింది
పసితనపు పారవశ్యపు నవ్వు
వసివాడిన పువ్వై నేల రాలింది
కాసులను లెక్కచేయని ఆ చేతులు
ఎన్ని కన్నీళ్ళను తుడిచిన కరుణ కలువలో..
అతడొక జీవిత పాఠ్యగ్రంథం
జీవనోత్సవాన్నెరిగిన ప్రబంధ కావ్యం
ఇంటింటా ప్రేమతో పంచిన పుస్తకమై
మనను నిత్యం పలకరించే అక్షర బంధువు
అతడు సాహిత్య 'దిక్సూచి'
అలిశెట్టి అక్షరాల దివిటీ
తల్లి మరణానికి తల్లడిల్లిన హృదయం
గాయపడి ఘనీభవించడం విషాదం
పుస్తకమున్నన్ని నాళ్ళు
కొన్ని పుటలు అతడి కీర్తిని
గానం చేస్తూనే ఉంటాయి.