డాక్టర్ సిహెచ్ ఆంజనేయులు కవిత : బతుకు చిత్రం

By Arun Kumar PFirst Published Sep 30, 2022, 11:31 AM IST
Highlights

పాతాళానికి దిగజారిన నేటి బ్రతుకు చిత్రాన్ని చూడండి దుర్మార్గమైన సంస్కృతి సాక్షిగా అంటూ ఖమ్మం నుండి డాక్టర్ సిహెచ్ ఆంజనేయులు రాసిన కవిత  " బతుకు చిత్రం " ఇక్కడ చదవండి : 
 

ఆధిపత్య సంస్కృతి అద్భుతంగా వెలుగుతోంది
మనిషిని ప్రేమించడం మరిచిన కాలంలో
దేశం వెలిగిపోతుంది 
స్వార్ధపు ఊబిలో తలదాకా మునిగిన ఈ దేశంలో ప్రజలంతా ఓట్ల నోట్ల స్వాధీనంలో చిక్కుకున్నారు
సంస్కృతి సామ్రాజ్యవాదం
జాతి సామ్రాజ్యవాదం 
సంపదల సామ్రాజ్యవాదం
సహజ సంపదలన్నీ కొద్దిమంది భోగవంతుల 
గుప్పిటిలో చిక్కుకున్న సన్నివేశం ఒకవైపు
సామాన్యుని బ్రతుకు చిత్రమంతా గందరగోళం మరోవైపు
రూపాయి నోట్ల కట్టల్లో తలదాచుకున్నది ప్రజాస్వామ్యం
బడ్జెట్లతో పూరిస్తాం 
రంగుల కాగితాలు అచ్చు వేస్తాం 
దేశం మీదికి వదిలేస్తాం
ధరవరలు ఆకాశంలో నాట్యం చేసే సన్నివేశంలో సామాన్యుని గోడు ఎవరికి అవసరం ??
జీవితం ఇప్పుడు
కొద్దిమంది చేతుల్లో తిరిగే రంగులరాట్నం
చక్రం తిప్పడమే నేటి నాయకుల  చర్య ప్రతి చర్యల సన్నివేశం
దారుణమైన  అహంకారం చెలరేగిపోతుంటే
దేశం వెలిగిపోతోంది కొద్దిమంది గుప్పిట్లో
సామాన్యుడు రోజురోజుకు
పాతాళానికి దిగజారిన నేటి బ్రతుకు చిత్రాన్ని చూడండి
దుర్మార్గమైన సంస్కృతి సాక్షిగా

 

click me!