అంతా నేననే అహంతో చెలరేగిపోతున్న వాళ్ల తీరుపై చర్నాకోలాను ఝులిపించాల్సిందే..! అంటూ గోపగాని రవీందర్ రాసిన కవిత " సవాళ్ల పద్మవ్యూహం..! " ఇక్కడ చదవండి :
ప్రశ్నల జడవానలో
తడవడమెంతో ఇష్టమైనదే
ఎదుగుతున్న తరాల్లో
నశించి పోతున్న ఓర్పును గూర్చే
నా దుఃఖమంతా
ఫలవంతమయ్యే జీవితాల కోసం
కార్యోన్ముఖులమై సాగాల్సిందే..!
స్నేహ మాధుర్యాన్ని
జుర్రు కోవల్సిన వయసులో
శిఖరాయమైన ఆశయాలను
సాధించుకోవల్సిన తరుణంలో
అంతా నేననే అహంతో
చెలరేగిపోతున్న వాళ్ల తీరుపై
చర్నాకోలాను ఝులిపించాల్సిందే..!
ప్రేమ పుష్పాల వంటి
నవ్వులు వికసించాల్సిన చోట
ద్వేషపు బీజాలు మొలకెత్తుతున్నాయి
రాబోయే రోజులెంత భీకరమో
కొంచెం బుజ్జగించైన
కొంచెం లాలించైన
కొంచెం మందలించైన సరే
అచరణకై అడుగులు వేయాల్సిందే..!
మొగ్గలు విచ్చుకోకుండానే
రాలిపోవడమెంత
ఆందోళనకరమైనదో కదా
పరిపరి విధాలైన ఆలోచనలతో
నిరాశ దుప్పటి నిలువెల్లా
చుట్టుకుంటున్నది దర్జాగా
అయినా కానీ
సవాళ్ల పద్మవ్యూహాన్ని ఛేదించాల్సిందే..!