అవనిశ్రీ కవిత : వాన బుగులు

By Arun Kumar P  |  First Published Jul 13, 2022, 2:51 PM IST

వానొస్తే ఇంటిని కాపాడుకోవాలనే పేదోడి కన్నీటి కావ్యం ఎలా ఉందో అవనిశ్రీ కవిత   " వాన బుగులు " లో చదవండి :           


వాన వస్తుందంటేచాలు
మా వాడలపొంటి గుడిసెకున్న తాటాకు మట్టలు 
కొట్టుకపోతాయని దిగులు
తడిసిన మట్టిగోడలు కూలిపోయి
పసికందులు మరణిస్తారనీ బుగులు.

వానొస్తే
మట్టిమిద్దెల మీద గడ్డినదీసి
కొట్టుకపోయిన మట్టిని గంపలకొద్ది మోసుకొచ్చి
ఒరిగిన కట్టెవాట్లకు దూలాలను అనిచ్చి
ఇంటిని కాపాడుకోవాలనే పేదోడి కన్నీటి కావ్యం.

Latest Videos

undefined

మధ్యరాత్రి వానకు
బొట్లు బొట్లుగా ఇల్లు కారుతుంటే
తలెలు గ్లాసులు గిన్నెలు నిండిపోయినాక
దోసిలినింపి వాననీటిని పారబోస్తుంటే
నిద్రబోని దినంగా మా గుండెల్లో గుర్తుండే రాత్రి కథ.

వానలో
పచ్చికట్టెలను మట్టిపొయ్యిలపెట్టి
ఊది ఊది ఊపిరంత పొగొట్టుకొని
పిడికెడు బువ్వవండి ఇంటంతమంది
కడుపు నింపాలని పడే ఎందరో తల్లుల ధీనత్వం.

జడివానలోనే
గోనె కొప్పెరను తగిలించుకొని
సేన్ల తుమ్మకొమ్మలకింద కట్టేసిన 
ఎద్దులకు ఏ ఉరుము పడి ఏమౌతుందోననీ భయపడి
ఇంటికి తీసుకొచ్చే రైతన్నల వేదన.

వాన 
బయటొక్కటే కాదు
పేదోడి లోపల లోలోపల ఎప్పటికీ ఎడతెగని వాన
కురుస్తనే ఉంటది.
 

click me!