వెన్నెల సంతకాలతో తరించిన కవిత్వం- “బువ్వపూలు”

By Arun Kumar P  |  First Published Apr 16, 2023, 1:43 PM IST

అవధానం అమృతవల్లి కవిత్వం “బువ్వపూలు” పైన విశాఖపట్నం నుండి డా. కె.జి. వేణు రాసిన సమీక్ష ఇక్కడ చదవండి :
 


ప్రతిరోజు తూర్పున సూర్యుడు ఉదయిస్తాడు. అదే సమయంలో జతగా తెలుగు నేలమీద వందలాది కవితలు పురుడు పోసుకుంటున్నాయి. పుట్టిన ప్రతిబిడ్డ మహాత్ముడు కానట్టే, రాయబడ్డ ప్రతి కవిత మెప్పించే స్థానాన్ని పొందలేదు. కలంతో రాసే కవితలకంటే, మనసుతో రాసే కవితల్లో విషయం వుంటుంది, విశేషం వుంటుంది. అలాంటి కవితల్లో సాహిత్యం, సంక్రాంతి పండగలా సంబరాలు జరుపుకుంటుంది. ఎత్తుగడ, ముగింపులు ఘనాపాటి స్థితిని ప్రదర్శిస్తాయి.  నడక వయ్యారంగానే కాదు, మనిషికి అవసరమైన పాఠాల్ని సైతం అందిస్తాయి. అక్కడ పదాల కూర్పు మాత్రమే జరగదు. సుందరమైన భావాల భవనాల నిర్మాణం సైతం తన ఉనికిని చాటుకుంటుంది. శైలి, కవితల చుట్టూ పహారాకాస్తూ కళాత్మక రూపానికి కాపలాదారుడి పాత్రను పోషిస్తుంది. అందులోని భాష పలికే ప్రతి ధ్వని, ఎద లోతుల్లో తన స్థావరానికి, అవసరమైన చిరునామాను సిద్ధం చేసుకుంటుంది. ఒక్కమాటలో చెప్పాలంటే అలాంటి కవితలు పాఠకుడి మనసు రెటీనామీద ఛాయాచిత్రాలై కదులుతూనే వుంటాయి. 'బువ్వపూలు’ కవితా సంపుటిని పలకరించినప్పుడు ఇలాంటి కవితలే అందులోనుంచి దూసుకువచ్చి కరచాలనం చేస్తున్నాయి. ఈ కవితలను తన మనసు మైదానాలమీది నుంచి పాఠకుల చేతుల్లోకి కానుకగా అందించిన కవయిత్రి, 'అవధానం అమృతవల్లి'

సాహిత్యాన్ని శ్వాసగా మార్చుకున్న అమృతవల్లి, అక్షరాల పందిరి కింద తన భావాల ఉత్తమ ప్రదర్శనకు వేదికగా ఈ సంపుటిని వెలువరించారు. అక్షరమై పంచిన స్నేహాపరిమళాన్ని, మానవత్వపు సంతకంతో మనసారా నింపుకుంటూ, అక్షర జ్యోతిగా వెలిగే ప్రయత్నంలో ఎడారుల్లో సైతం కవితా చివురుగా పల్లవించటానికి, మూగబోయిన గుండె గుడిలో కొయిల స్వరంగా తాను మారుతూ సాగిపోతున్న కవయిత్రి ఈమె. ముట్టుకుంటే పాలుగారే పాలబుగ్గల్లాంటి కవితలే కాదు, అలల కౌగిళ్లను సైతం ఆహ్వానించే కవితలు ఈ సంపుటిలో చోటు చేసుకున్నాయి. నిత్యం ఎగిసే అలల అల్లరులను సైతం సాహిత్య కవనాలుగా మార్చగల స్థితప్రజ్ఞావంతురాలు ఈ కవయిత్రి.  మానవత్వపు ఆనవాళ్లుగా తన కవితలు నిలిచేందుకు అక్షరాలతో చెలిమికట్టిన సహృదయత ఆ కలానిది. తనకంటూ ఒక గొప్ప లక్ష్యం వుంది. గమ్యస్థానాలవైపు తన నడకను గురించి చెబుతూ 'నవ్యాక్షరాన్నై' కవితలో తన గొంతును ఇలా వినిపిస్తున్నారు...‘గతం తాలూకు కాలం చెట్టుకు / చేదు అనుభవాల గబ్బిలాన్నై వ్రేలాడక / ఆశల తెరచాపనెత్తి కన్నీటి నావల్ని సైతం / విజయతీరాల వైపు నడిపించే సరంగునై / చెరగని సుహృద్భావ నవ్యాక్షరాలను లిఖించుకోవాలి...'. ఈ ప్రకటనలో చాలా స్పష్టమైన ఉద్దేశ్యాలు, ప్రణాళికతో, ఒక ధృఢ సంకల్పానికి స్వీకారం చుట్టుకున్న దాఖలాలు కనిపిస్తున్నాయి.

Latest Videos

undefined

రైతు వొంటిమీదనున్న మట్టి పరిమళాన్ని అందిస్తున్న బువ్వపూలు కవితలో... 'నీ కంచంలో బువ్వపూలు / పూయించేందుకు రోజంతా / నేలను చెమటతో తడుపుతుంటాడు...' అంటూ 'నీ ఇంట జ్యోతులు / వెలిగేందుకు తన కన్నీటి / నూనెను తోడుతూ వుంటాడు / ఇంకా తన దగ్గరేముందని / నీకు పంచివ్వటానికి...!? / చివరాఖరికి పొలాల్లోనే / శవమై నేలతల్లివొడిలో కలిసి పోయి / ఎరువై మళ్లీ నీ గుప్పెట మెతుకై నలిగిపోతున్నాడు...'. కవితలో ఈ పంక్తుల్ని చదివాక రైతన్న త్యాగానికి జనమంతా ఎలా తరతరాలుగా రుణపడిపోతున్నారో స్పష్టమవుతోంది. ఈ కవితను చదివాక కనురెప్పల మధ్య తడి చాలా సేపటిదాకా ఆరిపోవటానికి ఇష్టపడలేదు.

పొత్తిళ్లలో పచ్చని చివురులకు పాడుతున్న జోలపాట 'ఇంకొన్ని రోజులు..' కవితలో వినిపిస్తోంది. లాక్ డౌన్ నేపథ్యంలో కొనసాగిన ఈ కవితలో వాతావరణం సహజ ప్రక్రియతో ఊపిరితిత్తులను శుభ్రం చేసుకునే దృశ్యం కవయిత్రి ఆలోచనా స్థాయికి హారతులు పడుతోంది. భూగర్భ జలం తన గూళ్లను సవరించుకోవటం, వలస పిట్టొకటి విరిగితన కాళ్లకు ఆశాలేపనాలు రాసుకోవటం, విలువల వలువలతో మనిషి ఒంటరి దీవిలో కాలు మోపడం, నిశ్శబ్దపు వీధుల్లో నగరం తల స్నానం చేయటం, అందరి గళాలు కలిసి సంయమన రాగాన్ని శృతి చేసుకోవటం, ప్రపంచ చరిత్రలో భారతీయుల సహనాన్ని ఒక పుటలా రాసుకున్న దృశ్యాలు...సాహిత్యానికి పేరంటంలో బుగ్గలకు గంధం రాసినట్లుగా మనోహరంగా వున్నాయి.

‘కన్నీటి వరమై..’ కవితలో.. 'గుండెకు గాయమైన ప్రతిసారి తోడుంటావు...' అన్న మాట వెనక పెనవేసుకున్న ప్రేమ తాలూకు నీడలు కనిపిస్తున్నాయి. 'దుఃఖ సముద్రంలో మునిగిన ప్రతిసారీ / కంటి ఆల్చిప్పల్లో ముత్యపు చినుకై మెరుస్తావ్...’ ఈ పద ప్రయోగాలు కవితాత్మకత లోతులు కొలిచే సాధనాలుగా మిగిలిపోతున్నాయి. 'నా బరువైన శ్వాసకు సాంత్వన నువ్వే...” అన్నప్పుడు బరువైన శ్వాస వెనక కారణమైన కారణాలు వరుసల్లో నిలబడుతున్నాయి. అలాంటి శ్వాసకు సాంత్వన కలిగించే ఆ భరోసా ఎంత గొప్పదో అంచనా వేయటానికి తగిన కొలతలు లభించటం లేదు.

రాసే కలం విశాల హృదయతను కలిగివున్నప్పుడు కదిలించే అనేక విషయాలు అందులో చోటును కోరుకుంటాయి. అలా 'బతుకు రంగు..’ కవితలో వచ్చి చేరిన అంశమే రంగులు అమ్మే ఆ పిల్ల. చింకీ పరికిణీ సర్దుకుని, చిట్టి తమ్ముడ్ని చంకలో బెట్టుకుని, బాధ్యతల బ్రతుకు బండిపై ఆశల రంగులను నింపుకున్న ఆ అమ్మాయిని మరింతగా పరిచయం చేస్తూ 'తనకు తెలుసు రంగుల లోకం / అంత అందమైంది కాదని / ఆదమరిస్తే అసలు రంగు నీలమని ...' అంటూ ఈ లోకంలోని పోకడను తెలియజేస్తున్న క్రమంలో మరొక అద్భుతమైన భావాన్ని ఈ కలం ఇలా అందిస్తోంది... 'ఆ పిల్లకూ ఉందొక ఇష్టమైన వర్ణం / అమ్మ నేర్పిన నిజాయితీ స్వచ్ఛత...’ ఈ మాటల్లో ప్రతి తల్లి రూపం కనపడుతోంది. ఈ జాతి నిజాయితీ లక్ష్యాలను ఎలా కలిగి వుండాలో దిశా నిర్దేశం చేసిన మాటలివి.

కరోనా శాసించిన దుర్భర పరిస్థితుల్ని మరోమారు కళ్లముందు ఉంచిన కవిత 'ఏ నైరాశ్యామో..'. ఇందులో దృశ్యాలు మనతో మాట్లాడుతాయి. గుండె లోతుల్లని నీటిని కనురెప్పల మధ్య ప్రదర్శనకు సిద్ధం చేస్తాయి. మూటా ముల్లె చంకనెత్తుకుని, పసిపిల్లలతో, ఆకలి తోడుగా, జవసత్వాల అలసటతో తూలిపోతూ, రాలిపోవటానికి సిద్ధపడ్డ ప్రాణాలను.... కవిత్వీకరించిన తీరు, తేరులో భావాలను రథం మీద ఊరేగినట్లుగా వుంది. దీపావళి ఏడాదికి ఒక్కసారే కాదు, 'అమ్మ చేతి గోరుముద్దలు తిన్న ప్రతిసారి దీపావళే ...’ అంటూ మనముందు వాలిన ‘రోజూ దీపావళే..' కవితలో పొన్నచెట్టు నీడన అమ్మ పాడిన జోలపాటలు వినిపిస్తున్నాయి. తడబడే అడుగులకు భరోసా నిచ్చిన నాన్న చేతులు స్పర్శిస్తున్నాయి. పొలంలో కాలుత్ను రాగికంకులు గుర్తుకొస్తున్నాయి. ఏట్లో ముంచే కడవల బుడుంగు ధ్వనులు చెవుల్లో సరిగమలను సరిచేస్తున్నాయి. ఇవన్నీ చదివాక మళ్లీ నా బాల్యం నన్ను కౌగిళించుకుంది. అమ్మలా ముద్దులు పెట్టింది. తన వొడిలో నన్ను కూర్చోపెట్టుకున్నప్పుడు నన్ను వదిలి వెళ్లవద్దని బాల్యాన్ని బ్రతిమాలుకున్నాను. ఈ కవితను దగ్గరవుంచుకో, దీన్ని చదవగానే నేను మళ్లీ వచ్చి నీ ముందు వాలిపోతానంటూ హామీపత్రం మీద బాల్యం సంతకం పెట్టింది. మనిషి వయసును మళ్లీ వెనక్కి తీసుకుపోగల శక్తి ఒక్క కవిత్వానికి మాత్రమే వుందని ఆకాశం సైతం ప్రతిధ్వనించిన సందర్భం ఇది.

స్త్రీ తత్వానికి తిలకం దిద్ది హారతులిచ్చిన కవిత 'అంతుబట్టని...”. నిజమే మానవ మేథస్సు అంచనాలకు అందని స్థాయి, ఆదినుంచి స్త్రీలకు సొంతమయిన విషయాన్ని కవిత్వ రూపంలో చెబుతూ.. ఎన్ని హింసలు, ఎన్ని అవమానాలు, ఎన్ని అకృత్యాలు... వీటిని భరిస్తూ, అనుభవిస్తూ, సహిస్తూ... ఎలా తలెత్తుకుని నిలబడిందో ఆశ్చర్యమే. ఆకాశమే తన సరిహద్దుగా మారినప్పుడు, భూమి భారాన్ని తన భుజాలపై అవలీలగా మోస్తున్నప్పుడు, నిప్పు సైతం ఆమెకు సలాములు చేస్తున్నప్పుడు, తన శ్వాసలో యావత్తు వాయువులన్నీ ఇంటి గుమ్మాలుగా నిలబడునప్పుడు, దేన్నయినా భరించే శక్తి సహజంగానే ఆమెకు సొంతమయింది. స్త్రీ అస్తిత్వానికి తాత్విక రూపంగా మారిన కవిత ఇది.

చెంపలమీద కెంపులు పూయించటం ఈ కవయిత్రికి సాధ్యమేనని నిరూపించిన కవిత  'హృదయతోరణం..'. ఈ తోరణాల ఆవరణంలోకి అడుగు పెట్టగానే రాధా మాధవీ లతల మాటున విచ్చుకుని తొంగిచూసే రెప్పలు కనిపిస్తున్నాయి. బిందెలో దాచితెచ్చిన తాయిలం తీపి రుచులు, దగ్గరకు వచ్చి చేరుతున్నాయి... ఇలా ఇందులోని ప్రతిపదం నాట్యకత్తె కాలి మువ్వల్లా కదిలి కనువిందు చేయటం ఒక తియ్యటి జ్ఞాపకంలా మిగిలిపోతోంది. కవితా చట్రంలో ప్రవేశానికి ప్రతి అంశానికి అవకాశం ఉందని నిరూపించిన కవిత ‘ఆశా సౌధం...’. ఈ కవితలో కథానాయకులు ఇంటి నిర్మాణంలో ప్రధాన పాత్రధారులైన కూలీలు. వారి చెమట చుక్కల్ని సిరాగా మార్చి రాసిన కవిత కాబట్టే ఇన్ని సువాసనలతో ఈ కవిత తన ఉనికిని చాటుకోంటోంది. 'సిమెంటును శ్వాసిస్తూ / పొడవు వెడల్పులను శాసిస్తూ / తమకు నిలువ నీడ లేకున్నా అందరికోసం అందమైన భవంతులు / కడతారు వారు / నీవు ఎక్కే అంతస్తుల కింద వంగిన వారి నడుములు / అయినా విదల్చలేకున్నాయి...' ఇలా సాగిన భావవ్యక్తీకరణలో ఒక మెచ్చుకోలు వుంది, త్యాగాల వెనకనున్న శ్రమ సౌందర్యం వుంది, కాలే కడుపులోని ఆకలి కేకలున్నాయి, కష్టజీవుల పట్ల ధారగా కురుస్తున్న జాలితనం ఆవవాళ్లు వున్నాయి... వీటన్నింటిని పుష్కలంగా పండించిన మాగాణి నేల ఈ కవిత.

రక్తం పూసుకున్న వార్తాపత్రికలను పాఠకుల చేతికి అందించిన 'మరణశాసనం' కవితలో హృదయాన్ని కదిలించే అనేక సన్నివేశాలు ఉన్నాయి. ఇవన్ని రోజూ జరుగుతున్న యదార్థ విషయాలే. 'ఎర్రటి మొగ్గలు / నెత్తుడి మడుగులో ...తేలుతూ / లేత పెదాల రేకుల్ని తెంపేసి / ముక్కలు ముక్కలుగా నలిపేసి / ఊపిరి గొంతులను నొక్కేసి / రహదారులకు రక్తం మరకలంటించి / కమురు వాసనలతో మనసుని కకావికలం చేస్తున్న మదోన్మత్తులు...' అంటూ పలకరించిన ప్రతి అక్షరం నేత్రాలను కన్నీటి బావుల్లా మార్చాయి. ప్రతిదృశ్యం రాక్షసానందం చేస్తూ వికృతంగా నాట్య చేస్తోంది. మొత్తం కవిత నిలువునా పరచుకున్న గాఢత ఒక సుస్థిరమైన స్థానాన్ని ఈ కవితకు కల్పించింది.
        
‘వైతాళికుడు’ కవితలో కాళోజీ గారి దర్శనభాగ్యం కలిగింది. నిజాం ఆజ్ఞలను సైతం ధిక్కరించిన ఆయన నైజానికి ఈ కవిత తిలకందిద్దినట్లుగా వుంది.  ప్రతి మనిషికి మలిసంధ్య తప్పదు. మానవ జీవితంలోని బాధలను, బాధ్యతలను, త్యాగాలను, తప్పిదాలను, ఎదురైన ఎత్తుపల్లాలను, ఎన్ని నష్టాలు ఎదురు దాడిచేసినా మొక్కవోని దీక్షను అక్షరీకరణం చేసి కవితరూపంలో అందించిన నేర్పుకు అభినందనలు. 'మరే ప్రాణి చేయలేని హింస నీకు మాత్రమే చెల్లు / రాసుకో నీ వినాశనానికి చెల్లు చీటి...’ అంటూ మనిషిని తాను చేసిన తప్పిదాల బోనులో దోషిగా నిలబెట్టి, అతడి వికారమైన చర్యలను సూటిగా ప్రశ్నించిన కవిత ఇది. ఒక ప్రేమ పూర్వక రూపాన్ని ఆవిష్కరించిన కవిత 'ఐతే'.   'చెప్పకుండనే అతడికి ఆమె అర్థమై పోతోంది, ఆమె ఆకలికి అతడు అమృతమై నిలుస్తున్నాడు, ఆమె ఆశలకు రెక్కలు కట్టి ఎగురువేస్తున్నాడు, ఆమె విజయాలలో అతడు జెండాగా మారి ఎగురుతున్నాడు, అంతేకాదు, అతడు దీపస్తంభమై ఆవతలి ఒడ్డున తన కోసం అతడు ఎదురు చూస్తున్నాడు, ఇంతకన్నా ఇంకే కావాలి..’ ప్రతి వనిత తన జీవితంలో ఏం ఆశిస్తుందో, ఆ మనసు భావాలకు ప్రతిబింబమే ఈ కవిత.

దిగుళ్లతో కృంగిపోయేవాళ్లకు మనోధైర్యాన్ని సాహిత్యం రూపంలో అందిస్తున్న కవిత 'వెలిగించుకో..'. ఈ వర్తమానంలో మనిషి చాలా తొందరగా అపజయాలకు కృంగిపోతున్నాడు. అందుకే ఈ కవయిత్రి 'ముళ్ల బాటలో సైతం విశ్వాసపు చిరునవ్వుల / దడి కట్టుకుని సాగిపో...’ అంటూ భుజంతట్టి ముందుకు అడుగులు వేసేలా చేస్తున్నారు.   కవయిత్రిలోని ఆశావాదాన్ని సంపూర్ణంగా ఆవిష్కరించిన కవిత 'వెన్నెల సంతకమై..'. ఈ సంతకం నిండా ఆశా రేఖలే కనిపిస్తున్నాయి. 'ఎన్ని శిశిరాలు చుట్టేస్తేనేం / మరో వసంతం తొంగి చూస్తుందన్న ఆశ / నాకెప్పుడూ / ఘనీభవించిన హృదయ వీణ మీటగలవన్న / ఆశ నాకెప్పుడూ..’ ఇలా చాలా స్పూర్తిదాయకంగా నడిచిన ఈ కవిత చాలామందిని ఆ దారిలో నడిపించగల అవకాశాలు మెండుగా వున్నాయి

తమ సమూహంలోకి ఒక సరికొత్త ‘బువ్వపూలు’ వచ్చి చేరడంతో రోజూ పూచే పువ్వులన్నీ ఆశ్చర్యపోతున్నాయి. అందుకు కారణాలు లేకపోలేదు. ఈ బువ్వపూలు తమకంటే అందంగా వుండటమే కాదు, సువాసనలో సైతం తలదన్నేలా వున్నాయి. పైగా ముట్టుకుంటే చాలు పలకరిస్తున్నయి, తమ రెక్కలతో పలవరించేలా చేస్తున్నాయి. గుండె దగ్గరికి చేర్చుకుంటే, నేరుగా గుండె కవాటాల్లోకి చొచ్చుకుపోయి, కరచాలన ఉత్సవాలను నిర్వహిస్తున్నాయి. స్నేహపూర్వక వేడుకలకు ఆతిథ్యాన్ని అందిస్తున్నాయి. తమలోని శిల్పసౌందర్యాలను రాసులుగా పోస్తూ కానుకలుగా అందిస్తున్నాయి. తమ నిర్మాణంలోని ప్రత్యేకతలను మామిడాకు తోరణాల్లా ముచ్చటగా ప్రదర్శిస్తున్నాయి. కాలం చెప్పే సాక్ష్యాలను నమోదుచేసే బాధ్యతను విజయవంతంగా నిర్వహిస్తున్నాయి. ఎన్నో సాహిత్య విలువలతో ఇన్ని పూలతో అందరిని అలరించే అజెండాతో తెలుగు సాహిత్యలోకానికి ఒక కానుకగా ఈ కవితా సంపుటిని అందించిన కవయిత్రి అవధానం అమృతవల్లిని హృదయపూర్వకంగా అభినందిస్తూ...
 

click me!