నిమ్న జాతి పాకల్లోని చిమ్నీ దీపాలకు చైతన్యపు చమురు పోసినాడు అంటూ నల్లగొండ నుండి డాక్టర్ మండల స్వామి రాసిన కవిత ' నిత్యప్రవాహం ' ఇక్కడ చదవండి :
అస్పృశ్యతా శూలాలెన్నో
భరించిన బాల్యం
అక్షర సముద్రాలను
ఎదురీదిన స్వానుభవం
ఆ పేరు ప్రతిధ్వనించినపుడు
గ్రంధాలయాలెన్నో
గర్వంతో తలెత్తుకుంటవి
పుస్తకాల పుటలన్నీ
పఠన జెండాలై
రెపరెపలాడుతుంటవి
undefined
నిమ్న జాతి పాకల్లోని
చిమ్నీ దీపాలకు
చైతన్యపు చమురు పోసినాడు
అసమానతా
అంచెల అంచుల్లో
సమతా గళం
బలంగా వినిపించాడు
మూఢత్వపు ముంగిళ్లకు
మేలిమి ఫలాలు పంచినాడు
రాజ్యాంగం రాసిచ్చిన
విద్యామూర్తిమత్వంతో
ప్రపంచ ప్రశంసలందుకున్న
భారత దేశ మేధో ప్రతినిధి
జ్ఞానకిరణాలు
విరగబూయించిన
ఆతని తాత్వికతకు
విశ్వ విజ్ఞాన కేంద్రాలు
ప్రణమిల్లిన మజిలీలెన్నో
డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్
శిఖర చరితార్థుడు
ఆయన రూపం.....!!
నిండైన నిగ్రహ విగ్రహం
కోటానుకోట్ల చూపులకు
సరి కొత్త పాఠం
నిరంతరంగా.........
నిత్య ప్రవాహంలా.........