అంబేద్కర్ వేసిన ప్రశ్నలు నేటికీ వెంటాడుతున్నాయి

By Siva Kodati  |  First Published Apr 13, 2023, 8:28 PM IST

వనపట్ల సుబ్బయ్య రాసిన దీర్ఘ కవిత ' మా అక్షరం, ఆయుధం అంబేద్కర్ ' ఆవిష్కరణ సభ గురువారం హైదరాబాద్ లోని సాహిత్య అకాడమీ కార్యాలయంలో జరిగింది. 


వనపట్ల సుబ్బయ్య రాసిన దీర్ఘ కవిత ' మా అక్షరం, ఆయుధం అంబేద్కర్ ' ఆవిష్కరణ సభ గురువారం హైదరాబాద్ లోని సాహిత్య అకాడమీ కార్యాలయంలో జరిగింది. అంబేద్కర్ 132వ జయంతి సందర్భంగా రాసిన ఈ కవితా సంపుటిని సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరి గౌరీశంకర్ ఆవిష్కరించారు :

జాతీయోద్యమ కాలంలో దేశానికి స్వతంత్రం వస్తే దళిత బడుగు వర్గాలకు ఆ స్వతంత్రం లభిస్తుందా అని అంబేద్కర్ అడిగిన ప్రశ్న భారత రాజ్యాంగ రచనకు పునాది అయ్యిందని, రాజ్యాంగ కర్తగా అంబేద్కర్ రాసిన రాజ్యాంగం, ఆ రాజ్యాంగం ద్వారా లభించిన హక్కులు నేడు మనకు లభించాయని, అయితే అంబేద్కర్ వేసిన ప్రశ్నలు నేడు కూడా మిగిలి ఉన్నాయని తెలంగాణా సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్ అన్నారు. ఆ ప్రశ్నలను పూర్తి చేయడానికి తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం దళితబంధు పథకాన్ని పెట్టడమే కాదు, బిసీ, యస్సీ, యస్టీ, మైనారిటీ పిల్లల చదువులకు సంబందించి గురుకుల పాఠశాలలు కూడా భారతదేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణాలో స్థాపించారని ఆయన అన్నారు. 

Latest Videos

హైదరాబాద్ నగరంలో 125 అడుగుల అంబేద్కర్ మహావిగ్రహ స్థాపన గురించి మాట్లాడుతూ దేశంలో మతతత్వాన్ని, కులతత్వాన్ని వ్యతిరేకిస్తూ మహా ఉద్యమంగా, విశ్వరూపంగా ఈ విగ్రహావిష్కరణ జరిగిందని ఆయన చెప్పారు. ఈ విగ్రహావిష్కరణ సందర్భంగా వనపట్ల సుబ్బయ్య రాసిన దీర్ఘకవిత చాలా గొప్ప కవిత అని ప్రశంసించారు. ఈ విగ్రహావిష్కరణ పట్ల వెంటనే స్పందించడం ఎంతో సంతోషించదగిన విషయమని అన్నారు. అంబేద్కర్ విగ్రహాన్ని చూస్తే ఏమనిపిస్తోందో, ఆ చూపుడు వేలును చూస్తే ఏమనిపిస్తుందో ఇప్పటికే తెలంగాణాలో 250 మంది కవులు కవితలు రాశారని తెలియజేశారు. 

తెలంగాణా రాష్ట్రం జాతికి అంకితం చేస్తున్న అంబేద్కర్  విగ్రహానికి సంబంధించి తొలి దీర్ఘకవిత వనపట్ల సుబ్బయ్య రచించారని అన్నారు. ఇలాంటి అద్భుతమైన, అపురూపమైన నిర్ణయం తీసుకుని హైదరాబాదు నగరంలో అంబేద్కర్ మహావిగ్రహాన్ని ఆవిష్కరిస్తున్న తెలంగాణా ముఖ్యమంత్రి కే.చంద్రశేఖరరావుగారికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ దేశంలో మతతత్వానికి, కులతత్వానికి వ్యతిరేకంగా జరగబోయే మహాయుద్ధం దక్షిణాది నుంచి హైదరాబాదు నుంచి మొదలు పెట్టడానికి అంబేద్కర్ మహావిగ్రహాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలని కోరుతూ దీర్ఘకవిత రచించిన వనపట్ల సుబ్బయ్యను అభినందించారు.
 
ఈ కార్యక్రమంలో పాల్గొన్న శాసనమండలి సభ్యులు, కవి, గాయకుడు, దేశపతి శ్రీనివాస్ మాట్లాడుతూ స్టాట్యు ఆఫ్ ఈక్వాలిటీ, స్టాట్యు ఆఫ్ ఫ్రాటర్నిటి, స్టాట్యు ఆఫ్ లిబర్టీ అంబేద్కర్ విగ్రహమన్నారు. 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని తెలంగాణా రాష్ట్రప్రభుత్వం నెలకొల్పడం అన్నది అపురూప ఘట్టమని చెప్పారు. అట్టడుగు వర్గాల నుంచి వచ్చిన అంబేద్కర్ భారత రాజ్యాంగాన్ని రచించిన స్థాయికి చేరుకున్నారని, రాజ్యాంగం ద్వారా బలహీన, బడుగు వర్గాల హక్కులకు రక్షణ కల్పించారని చెప్పారు.

నేటికి అంబేద్కర్ వెలుగుబాటగా మనందరికీ దారి చూపిస్తున్నారని చెప్పారు. అంబేద్కర్ పుస్తకాలు నేటికి కూడా ప్రజాస్వామ్యానికి రిఫరెన్సులుగా ఉఫయోగపడుతున్నాయని అన్నారు. అంబేద్కర్ పుస్తకాలు, ఆయన ఆనవాళ్ళు అన్నింటిని ఒకచోట చేర్చి అంబేద్కర్ విగ్రహం క్రిందనే అంబేద్కర్ స్మారక కేంద్రం ఏర్పాటు చేయాలని తెలంగాణా రాష్ట్రప్రభుత్వం సంకల్పించిందన్నారు. అలాంటి అంబేద్కర్ గురించి అణగారిన వర్గాల నుంచి వచ్చిన అద్భుతమైన కవి వనపట్ల సుబ్బయ్య దీర్ఘకవిత రచించారని ప్రశంసించారు. 

ఈ కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ సంచాలకుడు డా. మామిడి హరికృష్ణ మాట్లాడుతూ తెలంగాణాలో అంబేద్కర్ మహావిగ్రహావిష్కరణ సందర్భంగా వనపట్ల సుబ్బయ్య అంబేద్కర్ పై రాసిన దీర్ఘకవిత రావడం అభింనందించదగిన పరిణామమని అన్నారు. ప్రముఖ విమర్శకుడు, కవి, సామాజిక కార్యకర్త జీలుకర్ర శ్రీనివాస్ మాట్లాడుతు అంబేద్కర్ విగ్రహాన్ని ఈక్వాలిటీ స్టాట్యుగా ప్రకటించాలని అన్నారు. వనపట్ల సుబ్బయ్య దీర్ఘకవిత రాయడం అభినందనీయమన్నారు. 

ఈ కార్యక్రమంలో చరిత్ర పరిశోధకుడు సంగిశెట్టి శ్రీనివాస్, కవి కోయి కోటేశ్వరరావు, కవయిత్రి జూపాక సుభద్ర, స్కైబాబా, రాపోలు సుదర్శన్, సుంకర రమేష్, రేడియం, కందికండ మోహన్ తదితరులు పాల్గొన్నారు.


 

click me!