తెలుగు సాహిత్యంలో తెలుగు కవిత్వం అత్యంత విశిష్టమైంది. వేణు నక్షత్రం రాసిన కవిత మనల్ని మరిచిన మనంను పాఠకుల కోసం అందిస్తున్నాం.
ఇప్పుడు సూర్యోదయాలు , సూర్యాస్తమయాలు ఉండవు
అన్ని వేళల నక్షత్రాలు మెరుస్తూనే ఉంటాయి
మన చుట్టూ గోడలు లేని తలుపులూ,కిటికీలు బిగించి
ఇంట్లోకి చొచ్చుకొచ్చిన నక్షత్రాల చిందుల మధ్య
బంధీ అయిపోయాం మనం
మన ఉనికిని మనమే కోల్పోయి
భ్రమల డిష్ ఆంటీనాలో తన్నుకుంటున్నాం
నక్షత్రపు కాంతుల చీకటిలో ఊరేగుతున్న
అమానవీయ విలువలు మనల్ని అధ:పాతాళానికి తొక్కేస్తున్నాయ్
గలగలా పారే గోదారి సెలయేటి శబ్దాలు
పిల్లగాలి రెపరెపలు , కోకిల కుహుకుహు రాగాల మధురిమలు
ఇక మన ఉచ్వాస,నిశ్వాసాల్లో ప్రతిధ్వనించవు
కన్నీటికి కొదువలేకున్నా కడివెడు నీళ్ళు కరువైన మనం
చమట వరదలై పారినా జానెడు పొట్టనిండని మనం
"కలహండి " నుండి "రువాండా" దాకా పయనిస్తున్న మనం
మూసుకున్న పిడికిలి పైకెత్తి మన సంఘీభావాన్ని ఘోషిద్దాం
మనల్ని బంధించిన నక్షత్రాల ఎలక్ట్రానిక్ సంకెళ్లని బద్దలుకొడదాం
నక్షత్రాల మత్తులోంచి, విద్యుదయస్కాంత క్షేత్రాల్లోంచి
విముక్తి కోసం కంటి చూపును సారిద్దాం
వేగుచుక్క పొడిచే వేకువల్లోనూ
కోడిపుంజుల కొక్కొరొకోల్తోనూ మొదలయ్యే
దినచర్యల జీవన ప్రయాణం లోనూ
అరుణారుణ సంధ్యాసమయాలలోని ఆరాటాల్లోనూ
గజ్జెకట్టి ఆడే జానపదాల జాడల్లోనూ
తాటాకు గుడిసె రెక్కవిప్పి పాడే శ్రమైక జీవన ప్రతిధ్వనుల్లోనూ
మనం కోల్పోయిన మనల్ని తిరిగి వెతుక్కుంద్దాం !
మరింత సాహిత్యం కోసం ఇక్కడ క్లిక్ చేయండి: https://telugu.asianetnews.com/literature