మనసును వెంటాడే గుంజాటన - అఫ్సర్ కవిత్వం

By telugu team  |  First Published Mar 19, 2020, 6:09 PM IST

డొంకను కదిలించడం అనేది తీగను ఎంత ఒడుపుగా, లాఘవంగా, బలంగా లాగుతున్నామనే దానిపైనే ఆధారపడుతుంది. ఏ చిన్న పొరపాటు జరిగినా దానికి సందిగ్ధతగానో, సంక్లిష్టతగానో నామకరణం చేయాల్సి వస్తుంది. అఫ్సర్ ఆలోచన కవితగా మారడానికి ముందుగానే దానికి సంబంధించిన ముడులన్నీ సిద్ధంచేసుకుని వలను అల్లుతాడు.


అఫ్సర్ కవిత్వం చదువుతున్నప్పుడు మనసుపెట్టి చదవకపోతే ఉపరితలంపైనే అటూ ఇటూ పడి బొర్లుతం. పట్టుబడాలంటే వస్తువు తాలూకు కీనోట్ ని వెతికి పట్టుకోవాలి. అప్పుడు తీగలాగితే డొంకంతా కదులుతుంది. డొంకను కదిలించడం అనేది తీగను ఎంత ఒడుపుగా, లాఘవంగా, బలంగా లాగుతున్నామనే దానిపైనే ఆధారపడుతుంది. ఏ చిన్న పొరపాటు జరిగినా దానికి సందిగ్ధతగానో, సంక్లిష్టతగానో నామకరణం చేయాల్సి వస్తుంది. అఫ్సర్ ఆలోచన కవితగా మారడానికి ముందుగానే దానికి సంబంధించిన ముడులన్నీ సిద్ధంచేసుకుని వలను అల్లుతాడు. చేపపిల్లల్లా గిజగిజలాడటం సాధారణమే గాని ఓ దగ్గరిదారి బయటపడటానికి ఎప్పుడూ వుంటుంది. అయితే 'రక్తస్పర్శ' తర్వాత 'ఇవాళ'నుండి 'ఇంటివైపు'కు చేసిన ప్రయాణంలో వస్తువు పూర్తిగా కనుమరుగై రూపం మాత్రమే ఆవిష్కృతమైనట్టు ఒక భ్రమ, ఒక మాయాపొర చూపుల్ని కమ్మేయడం ఏమంత వింతకాదు. ఒక్కొక్కపొరను వొల్సుకుంట పోవడమే పాఠకుల పని.

ఒక ఉన్మాదస్థితిలో రాసిన కవిత్వమై తారసపడుతుంది. పోయెట్రీ లో సూపర్ స్పెషాలిటీ విభాగం లాంటిది తన కవిత్వం. ఈత తెలియనివాళ్లు, రానివాళ్లు ఆ కవిత్వ సముద్రంలో దూకకపోవడమే మంచిది. గాఢత అనుభవం నేర్పిన ఫలితాలుగా పరుచుకుని వుంటుంది. పలకలు పలకలుగా పేరుకుపోయి వుంటుంది. ఇదీ అఫ్సర్ మార్క్ డ్ పోయెట్రీ. లోతుకు పోయేకొద్దీ అంతులేని అగాధంలా అనిపిస్తుంది. చివరకు ఓ శూన్యం ఆవరిస్తుంది. మనిషి ఇంతలా మేధోపరమైన మానసికవేదనకు గురవుతాడా..అనిపిస్తుంది. ఇప్పుడు పాఠకులది అతని కవిత్వంపై అసహజ పరిశీలనే. కవిత్వం రాయడమంటే మాటలా? నెత్తురు బొట్టు బొట్టుగా అక్షరాల అవతారమెత్తడమే!

Latest Videos

ఒక ఆలోచన ఎలా పురుడుబోసుకుంటుంది. గత దృశ్యానుభవాలు ఎంత మెలిపెడితే, ఎంతగా కలత చెందిస్తే మరో ఆలోచన రూపుదిద్దుకుంటుంది? ఈ ఆలోచనలోనే వస్తువు, దాని పర్యవసానమూ కన్స్ ట్రక్ట్  అవుతూ వుంటుంది. వస్తువూ, రూపమూ పందిరిని అల్లుకున్న తీగలా పెనవేసుకుపోయి వుంటుంది. ఒక దశ తర్వాత వస్తువు పూర్తిగా రూపంలోకి ఇంకిపోయీ రూపమే కనిపిస్తుంది. తొలినాళ్ల కవిత్వంలో వస్తువుకు ఒక స్పష్టత వుంది. అది ఊరిచివర వరకు కొంత కొంత కొనసాగింది.

"రాత్రి గుండెల్లో చిక్కుకున్న పూలతొడిమెలు/కళ్ళ లోతుల్లో మొలిచిన కన్నీటి వృక్షాలు తొలగించుకుంటూ/నిద్రలేస్తుంది ఆలోచన" (ఎండకన్నుల్లో)

"ఎవరు కనిపారేసిన పసికందు ఈ ఆలోచన" అంటాడు అఫ్సర్ . ఇక్కడి వరకూ .. చెప్పదల్చుకున్న వస్తువుకు సంబంధించిన ప్రొలాగ్ లా అనిపిస్తుంది. "బాధలవేళ్లను తడుముకుంటు విషాదాల్ని మడుచుకుంటూ సిగరెట్ చితిపై పూలబతుకుల్ని కాల్చుకుంటాయి" అన్నప్పుడు వస్తువు ఎలివేట్ అవుతుంది.

"తల్లిగర్భంలోంచి నేలమీద పడకముందే నెత్తుటి ముద్దగా మారిన ఒక పసికందు ఆక్రందన వినిపిస్తోంది"(నిద్రకు వెలియై) 

ఇది మాత్రమే వస్తువు. దీని తాలూకు ఆవేదనంతా కవిత్వం. ఆవేదన ఏ రూపాన్నైనా సంతరించుకునే వెసులుబాటు వుంటుందిప్పుడు. ఇక్కడ వస్తువును మోయడం కంటే మిన్నగా దాన్ని అంటిపెట్టుకునివుండే భావోద్వేగాల్ని ఎంతదూరం కవిని లాక్కెళ్తాయో..అంతవరకూ, అన్నిలోతుల్లోకి వెళ్లిరావడమే అతని కవిత్వమవుతుంది. అంటే వస్తువుకు కేవలం ఫిజికల్ స్ట్రెంత్ మాత్రమే వుండదు. దాని క్షేత్రపరిధి ప్రభావం ఎంతవరకుందో అంచనా వేయగలిగే గట్స్ కవికి వుండాలి. "శవం కూడా కన్నీరుగా కరిగిపోతుంది/స్మశానం కూడా నిట్టూర్పు విడుస్తుంది" అన్నప్పుడు ఇలా దృశ్యాల శిథిలాల్ని కవి ఎంతకాలం మోసుకుతిరుగుతాడో తెలీదు.

కవి ఏదో ఒక వస్తువును ఎంచుకున్నప్పుడు తన పర్సెప్షన్ , లోచూపు ప్రత్యేకమై నిలుస్తుంది. ఇతరులకది విస్మరించినదై, విసర్జించినదై, పట్టనిదై వుండి వుంటుంది.

"అమ్మా తెల్లారనీకు అంటూ కాళ్ళూ చేతులు ముడుచుకొని తల్లికడుపులో తలకిందులవుతున్నా పుట్టని పసికందులా అర్ధరాత్రి పన్నెండు" (రాత్రి పన్నెండు)

కొన్ని వస్తువులకి ముగింపు ఇదీ అంటూ ఏదీ వుండదు. మనసు ఎంతవరకు లాక్కెళ్లి వదిలేస్తే అక్కడే అదే ముగింపు.

"తెల్లారదు దిక్కుమాలిన కల తీరానికి తల బాదుకుంటూనే వుంటుంది/తను చావదూ/నన్ను బతకనీదూ"

ఇదీ దాని ముగింపు. "చీకటి ఉరికంబంపై ఆఖరిక్షణం జీసస్ లా నెత్తురొడుస్తుంది" లాంటి వాక్యాలు ఎప్పటికీ వెంటాడుతూనే వుంటాయి. అఫ్సర్ చేసేదల్లా తన ఆయుష్షును కొంత పోసి కవిత్వానికి ప్రాణప్రతిష్ట చేయడమే!

ఒకానొక దశలో ఇంత గుంజాటన అవసరమా? అనిపిస్తుంది. ఎవడికీ లేని బాధ ఈ కవికే ఎందుకు? సంపాదించుకునే దాంట్లో దర్జాగా బతుకొచ్చు గదా! ఎందుకు పట్టిన తీటజెప్పు? కవితాసంపుటాలకు పెట్టిన పేర్లు చూసినప్పుడు (ఇవాళ, వలస, ఊరిచివర, ఇంటివైపు) 'హోమ్ సిక్ ' అయిన పిల్లవాడిలా కనిపించి, అయ్యో పాపం ! అనిపిస్తాడు. అయితే ఒక పరిణామక్రమం తెలిసిపోతుంది. 

ఇక్కడి మట్టిని వదల్లేక వదిలి పరాయి దేశంలో పనిచేసే బదులు మాతృదేశంలోనే బతికితే ఈ రంది ఇక్కడితో వొడ్శిపోతదా? ఈ కుందాపన వొడ్శిపోయిందనుకో.. ఇక కవిత్వం రాయగలడా? దీనంతటికీ పరాయికరణే కారణం అయితే మాతృదేశానికి రాకుండా తనకు అడ్డుపడుతున్న శక్తులేమై వుండొచ్చు? పోనీ.. పుట్టినగడ్డపై పరాయీకరణ భావన అస్సలే లేదా? ఇక్కడున్నోళ్లు ప్రశాంతంగానే వున్నరా? తన మనసును కుంపటి చేసి కుమిలే బదులు ఒక పరిష్కారం ఆలోచించే స్థితిలో కూడా లేడా? ఇంకొంచెం విపరీత ధోరణిలో ఆలోచిస్తే పాఠకులను మభ్యపెట్టి మనగలుగుతున్నాడా? తాను గిరిగీసుకున్న ఛట్రం నుండి బయటకు రాలేక మదనపడుతున్నాడా? ఎప్పటికీ ఒక ట్రాన్స్ లోనే వున్నట్టు అనుకోవడం, అలానే జీవించడం ఏమైనా మానసిక లోపమా? కొన్ని భేతాళ ప్రశ్నలకు సమాధానం తెలిసీ మనసు విప్పలేకపోతున్నాడా..అనేది కవి అఫ్సర్ మాత్రమే చెప్పగలడు.

*

"ఇవాళ"అఫ్సర్ మొదటి కవిత్వ సంపుటి. 'ఇవాళ' అప్పటి నిర్బంధ పరిస్థితులు ఇప్పుడు అలాగే ఉన్నాయి. దశాబ్దాలు గడిచినా వచ్చిన మార్పేమీ ఆశాజనకం కాదు. నిర్బంధం. అంతటా కమ్ముకున్న  ఆంక్షల విషాద వలయం. ఆలోచనల మీద, ప్రశ్నల మీద విధించబడుతున్న అ(న)ధికార కర్ఫ్యూ.

"చిరుగాలి అలల కదలికలు వినిపించ కూడదు/ ముఖం మీద విషాద కవళికలు కనిపించకూడదు/ చెట్లకింద నీడలు చేతులు చాచకూడదు/పగటి ఆకాశంలో సూర్యుడి చిరునామా ఆనకూడదు/ నలుదిక్కుల కర్ఫ్యూ" (కర్ఫ్యూ)

*

 దేశంలో ఇక ఎప్పటికీ మారని పరిస్థితుల్ని వల్లెవేస్తూ, జరిగిన అమానుషాల్ని గుర్తు చేస్తూ, తన దేశభక్తిని చాటే తీరు దృశ్యమానమౌతుంటుంది. జాతీయ జెండాను చూసినప్పుడు అది ఇప్పుడు దేనికి ప్రతీకగా మారిందో ఆవేదనా హృదయాన్ని మన ముందు పరుస్తుంది.

 "కాషాయాన్ని చూస్తే నాకు కారంచేడు గుర్తొస్తుంది/ పచ్చటి పొలాల్లో చిమ్మిన రక్తం ధారలు కనిపిస్తాయి/ పచ్చదనాన్ని చూసినప్పుడు నాకు రాయలసీమ గుర్తొస్తోంది/ ఎడారి భూమ్మీద ఎండుడొక్కల్ని ఆరేస్తున్న రైతు కనిపిస్తాడు/ పావురాయి తెల్లటి ఆ రంగుని చూసినప్పుడల్లా పాతబస్తీయే గుర్తొస్తుంది/ కర్ఫ్యూ నీడలో ప్రవహిస్తున్న మతం లేని నెత్తుటి ధారలు కనిపిస్తాయి/ ఆ ధర్మ చక్రాన్ని చూసినప్పుడల్లా ఆవులిస్తున్న కటకటాలే కనిపిస్తాయి / మేధావి ఆలోచనల మీద పేలుస్తున్న తుపాకీ శబ్దాలు వినిపిస్తాయి" (ఇదే నా జాతీయ గీతం)

*

కొంత నోస్టాల్జియా ఎవరి కవిత్వంలో నైనా మామూలే. అదే.. కవికి ఒక ఊరట. మళ్లీ బాల్యాన్ని తొడుక్కోవడం, కాళ్ళకి మట్టి అంటించుకుని తిరగడం తలుచుకుంటే జవజీవాలు తిరిగి పోసుకున్నట్టుంటది. చెరువు కంటపడితే గుండె చెరువు అవ్వడం చూస్తాం.

 "మళ్లీమళ్లీ చిన్నప్పటి ఇసుకలో కాళ్లు చేతులు దూర్చి దూదుంపుల్ల ఆడుకోవాలి/పొలం వెంటా గట్ల వెంబడీ దారీతెన్నూ తెలియకుండా ఎటెటో పరిగెత్తాలి/మానవ దేహాల కారడవిలో స్పర్శ విచక్షణ కోల్పోయి సహజ బాల్యంలో మెరవాలి " (చిన్నప్పటి సంగీతం -1)

 "ఇప్పుడేదో ఇక్కడ పొడిపొడిగా పగిలిపోయిన భూమి గుండెల్లో నుంచి బావురుమంటున్న స్వప్నంలా.."( చిన్నప్పటి చెరువు)

*

కవికి స్త్రీ పట్ల ఉన్న కన్సర్న్, గౌరవం ఎలా ఉందో ఆమెను  కవిత్వీకరించిన విధానం చెబుతుంది. ఇక్కడ  ఆమె మరణాన్ని గూర్చి మాట్లాడుతాడు. మరణం అంటే ఆమె జీవితం కూడా అని అనిపిస్తాడు.

 "ఇది ఆమె ఆఖరి మరణం/ ఆమె రోజూ వెయ్యి మరణాలు చూసింది" (ఆమె మరణం)

మనిషి మనిషి కాకుండా పోయే వైనాన్ని , తనకు తానే పరాయిగా మారే క్షణాల్ని, ముసుగులు వేసుకుని బతికే జీవితాన్ని గురించి కలత చెందడం కనిపిస్తుంది.

" నా పాత్రలో ఇతనెవరో అద్భుతంగా జీవిస్తున్నాడు/ నన్ను వెతుక్కుంటున్న ప్రేక్షకుడు నిశ్శబ్దం చివర్న శోకిస్తున్నాడు/ తెర పడిపోయింది /నా పాత్ర సగంలోనే జారిపోయింది" ( తెరపడింది)

*

'వలస' కవిత్వసంపుటి వచ్చేటప్పటికీ "కవిత్వమే ఓ ఎండుటాకు" అంటాడు.

"చీలిపోతున్న దారుల్లో గమ్యం గురించి అడక్కు/ఎటో వొకవైపు అడుగుపడనీ/అడుగులోనే ఆకాశం కనపడనీ" (వెళ్లిపోతూ..!)

ఆకాశం అనేది మిథ్య. అది వున్నట్టు ఒక భ్రమ. మరి ఎటుపోతున్నాడో తెలీని మనిషి. పోవాలె.. నడుసుకుంటనో..దేక్కుంటనో..పరిగెత్తుకుంటనో ఏదో ఒక విధంగా నదిలా ప్రవహించాలి. అంతేకాని నిలువనీరులా పాకురుపట్టిన మనసుతో అలా స్తబ్ధంగా వుండకూడదు. ఏదో ఒకదిశలో అడుగులైతే పడుతున్నాయి కదా! చివరికి మనిషి ప్రవాహగుణమే అతన్ని పరిశుద్ధున్ని చేయగలదు. అప్పుడు నేలంతా ఆకుపచ్చ వనాల్ని నాటుకుంటూ పోగలడు. అయితే ఇలా వెళ్లడం గమ్యం తెలియకనా...లేక ఇంకెవరైనా వెంటబడి తరుముతున్నారా? అనేది పరిగణనలోకి తీసుకోవాల్సి వుంటుంది. 

*

కవిని కూడా ప్రశ్నించేవాడొకడుండాలి. ప్రశ్నే లేకపోతే సమాధానాలకై వెతుకులాట కనిపించదు. వెతుకులాటే లేకపోతే నూతన సృజనావిష్కరణలేవీ లేకపోగా జీవితం వొఠ్ఠి శూన్యమేమో అనిపించకమానదు. వెతుకులాటలోనే కదా..విశ్వరహస్యాలు తెలిసేవి! "ఇన్నాళ్లుగా రాస్తుండారు, మా కష్టాలు మీకు ఆపడ్డయా" అని అఫ్సర్ ని ప్రశ్నించిన మాదేటి సుబ్రమణ్యం కావచ్చు. ఆ ప్రశ్న కవి నిశ్చలమైన మనస్సంద్రంలో అలజడిని సృష్టించిందనేది సత్యం. అప్పటికి తెరుచుకోని మూడోకన్ను పనిచేయడం మొదలవుతుంది.

"మాటకీ అక్షరానికీ చెమట చేతుల మోటుదనం కావాలిక/../మనువు మాటలో చెప్పాలంటే అది కాళ్లలోంచి పుట్టాలి/మట్టికాళ్లలోంచి పుట్టాలి!"(యానాం వేమన ఏమనె)

*

లౌకికరాజ్యం కదా మనది. మూడురంగుల జెండా కదా మనది. ఎందుకని ఎప్పుడూ ఒక రంగును అనుమానంగా చూస్తూ అవమానిస్తుంటాం. ఇక్కడ మనమనుకునే రంగు ఎవరికి ప్రతీకగా నిలబడుతుందో తెలీక కాదు. ఎవరి తప్పులకు ఎవరిని నిందిస్తామో, ఇంకెవరిని శిక్షిస్తామో తెలీదు. "నా ఆగస్టు పదిహేనులన్నీ స్మశానవాటికలోనే.." అని కవి ఎందుకు అంటున్నాడు?

"ఈ పద్యంలో చివరిపాదం వొట్టి కొయ్యకాలేనని తెలుసు/వందేమాతరంలో నా తరం లేదు/జనగణమనలో నా జనం లేరు/కంఠనాళాలు తెగిపోయాయి/నా గొంతు జెండాలా పూరా విచ్చుకోదు." (అగర్ జిందో మే హై)

ఇక్కడ పద్యమంటే జాతీయజెండానేనా? చివరిపాదమంటే ఆకుపచ్చ రంగేనా? మరి ఆకుపచ్చరంగు ముస్లిం జీవితాన్ని ప్రతిబింబిస్తే అది ఇప్పుడు ఎందుకు వొట్టి కొయ్యకాలులా కనిపిస్తుంది? వివక్షను ఎత్తిచూసీ చూసి జీవంలేని కొయ్యకాలు వుంటే ఎంత? లేకుంటే ఎంత? అని సాధారణీకరించడానికేనా ఈ ప్రయత్నమంతా?

*

పేదముస్లిం జీవితాల్లోని పండుగ సందర్భాల్ని కవిత్వం చేస్తే ఎలా వుంటుంది?  "రోజుల భారాన్ని మోయలేక నాన్న అసహనంతో వేసిన కేకల్లో ఎన్ని రోజా పిలుపులున్నాయో!" (ఇఫ్తార్ సైరన్ ) అన్నప్పుడు బతుకు దినదినగండమయ్యే  జీవితంలో 'రంజాన్ ' నిజంగా పండుగ తెస్తుందా? పండగంటే రోజుకు మూడుపూటలు అన్నం దొరకడం కదా..ఇప్పటికీ వాళ్ల బతుకులు రంజాన్ మాసంలో ఉపవాసదినాలుగా ఎందుకు గడుస్తున్నట్టు? స్వాతంత్ర్యం మనిషికింత కూడు పెట్టనప్పుడు వృథానే కదా!

"ఆరని అగ్నిపర్వతం దేహం/సూర్యుడికి తలకొరివి ఎవరితరం?" (నిషిద్ధాక్షరి) లాంటి వాక్యాలు అఫ్సర్ మాత్రమే రాయగలడనిపిస్తుంది. ఒకరి కనుసన్నల్లో బతకడం, ఒకరి ఆదేశాల్ని శిరసావహించడం, మన జీవితాలే..జారీచేయబడిన ఫర్మానా అని తెలియకపోవడం మరీ విడ్డూరమనిపిస్తుంది. ఇలా ఇంకెంతకాలం నిరీక్షించాలో ఏమో! అనికూడా అనిపించకమానదు.

'వలస' లోని వస్తువు స్పష్టమైనది. అది వ్యక్తిగతమూ, సామూహికమైనది కూడా. ప్రాంతీయత, జాతీయత, అంతర్జాతీయత స్థాయీ భేదాలన్నీ తొంగిచూసే కాలానికి ఒక తాళం చెవిలాంటి కవిత్వం.

*

'వలస' నుండి 'ఊరిచివర'కు జరిగిన ప్రయాణంలో ఇల్లు ఇల్లులా లేదు. మనిషి మనిషిలా లేడు. దేశం దేశంలా లేదు. వలస అనివార్యత ఊరిచివర నుండి మొదలై ఖండాంతరాలు దాటుతున్న కాలాన్ని వొడిసిపట్టిన కవిత్వంగా కనిపిస్తుంది. కారణాల గురించి ఆలోచించే సమయమెక్కడిది? ఆకలి..ఆకలి..ఆకలి. అప్పటికీ ఇప్పటికీ పెద్దగా తేడా వున్నట్టు అనిపించదు. అప్పుడు ఒకరి కన్నును మరొకరి వేలు పొడిచేది. ఇప్పుడు ఎవరి వేలు వారి కంటినే బలితీసుకుంటుంది. అలాంటి అనివార్యత కల్పించబడింది. ఇలా రూపాంతరం చెందించిన ఉత్ప్రేరక శక్తుల గురించి మాట్లాడ్డం మానేసి కూడా చాలా కాలమైంది.

"ఎవరైనా అంతే!/కడుపే దేశం/ఎంగిలి మెతుకే కల/ఎక్కడికైనా వెళ్లాల్సిందే/అమ్మలకూ, కన్ననేలలకూ తెలియదు/దేశాల పటాలు మారిపోయాయని/ఆకలి సరిహద్దులు విస్తరించాయని!/నేలతల్లి ఏనాడో మోసపోయింది/ఆయమ్మ మానం/ముళ్లకంప మీది వస్త్రం" (ఎడారి నుంచి కాస్త తడి)

*

సమకాలీన రాజకీయ, ఆర్ధిక, సామాజిక పరిణామాల పరిజ్ఞానం ఇసుమంతైనా లేకుండా అఫ్సర్ కవిత్వాన్ని అర్ధం చేసుకోవడం కష్టమవుతుంది. ఏమాత్రం లవలేశమైనా సామాజిక స్పృహ వున్నా.. రాళ్లను రాళ్లనీ, నీళ్లను నీళ్లనీ తెలుపగలిగే, నిర్ధారించగలిగే బుద్ధి వున్నా ఈ కవిత్వం మరికొంత అర్ధమవుతుంది. కులంగానో, మతంగానో విడిపోయి ఆలోచిస్తే మాత్రం ఎక్కడో కలుక్కుమంటుంది. సున్నితంగానే చెప్పినట్టు అనిపించినా నిజాలు ఎప్పుడూ గొంతు దాగని చేదు బువ్వే అని ఒప్పుకోక తప్పదు.

ఇంతకీ కవి ఏం చెప్పదల్సుకున్నడు? ఒక సందిగ్ధ స్థితిలో ఎప్పుడూ పీకల్లోతు ఇసుక ఎడారిలో కూరుకుపోతూ మాట్లాడుతాడెందుకు?  అనిపిస్తుంది.

"నాదో ప్రాణాంతక జనన యుద్ధం/వాయిదా వెయ్యలేను/ఇలాగేలే అనీ వుండలేను"

సంఘర్షణ మనిషిని ధీరోధాత్తున్ని చేయగలదు. పిరికివానిగా మార్చి ప్రాణమూ తీయగలదు. ప్రాణాలు తీసే పిరికితనంతో సాధించేదేముంటుంది? ఎలాగూ పోయేదేగా అని నిశ్చయించుకున్నప్పుడే ఓ అడుగు పోరాటం వైపుకు పయనిస్తుంది.

*

ఎక్కడా నంగితనం వుండదు. చెప్పాల్సి వచ్చినప్పుడు కటువుగానైనా చెప్పే తీరుతాడు. కవికి వుండాల్సిన లక్షణం ఇదే కదా.. ఎందుకు భారతదేశంలో హిందూ - ముస్లిం సమస్య ఎప్పటికీ పచ్చిపుండుగానే కనిపిస్తుంది? ఎవరి స్వార్ధప్రయోజనాలు దాగున్నాయిందులో? ఎందుకని ఎన్నికల ముందే మళ్లీ మళ్లీ రాజుకుంటుంది? ఆ తర్వాత ఎందుకని దాని ఊసే వుండదు? కొందరి రాజకీయ ప్రయోజనాలు మనుషుల మధ్య చిచ్చు పెడుతుంది. అది ముస్లిం కావడం వల్లనే కాదు. వాళ్లు మైనార్టీలు కావడమే అసలు కారణం. ఒకవేళ హిందువులు మైనార్టీలు అయితే ఊచకోతల్లో, శవాల లెక్కల్లో వారే ఎక్కువుంటారు. రాజకీయానికి మతం ఒక అవసరం మాత్రమే. దానికేమతమూ వుండదు. అధికారకాంక్ష తప్ప! ఇది అర్ధమైతే ముస్లింల బాధ కొంతలో కొంత అవగతమైతది.

"సగానికి కూలిన మసీదు గోడల మీద పడీ పడీ ఏడుస్తున్నాను ఇవాళ్టికీ/బ్రోచేవారెవరురా! రామా..రామా..రా/నేను తిరిగిన వూళ్లలో/నువ్వింకా సుంతీ చేయించుకోనే లేదురా/నా రహస్యాంగాన్ని పబ్లిగ్గా చూసిన చిన్నప్పటి నుంచీ నువ్వింకా ఏడిపిస్తూనే వున్నావు కదరా!/ఆ సగం ముక్కకి ఎప్పుడో మోక్షం దొరికింది కదరా!/ఆ తెగిన ముక్క రాల్చిన నెత్తురే నా ఇప్పటి పద్యం కదరా" (బోడి పద్యం)

ఇప్పుడు మొండిగోడల్ని పూర్తిగా కూల్చేయ్యమని అత్యున్నత న్యాయస్థానం ఏకపక్ష తీర్పు చెప్పనే చెప్పింది. పోనీలే.కఇప్పటికైనా ఓ కొలిక్కి వచ్చిందని దేశం ఊపిరితీసుకునే స్థితిలో కూడా లేకుండా చేస్తుందనేది ఆలోచించాల్సిన విషయం.

*కవి ఖండాంతరాలు దాటినా వివక్ష ఇప్పుడు జాత్యహంకార పడగనీడై వెక్కిరిస్తుంది. అక్కడ రంగుల లొల్లి. ఏడికిబోయినా ఏదో ఒక లొల్లి వుంటదని ఒక్కషిత్తం చేసుకునేటట్టు లేదాయె బతుకు! తెల్లతోలుంటే వలసవాదులకీ జాత్యహంకారం వుంటుందా? ఏమో !

"ఆ వంటపాత్రల్లో ఏ నల్ల ఆడది ఏ పందిని వుడకబెట్టిందో?/వొక డాలరుకి ఈ పూట నా పప్పుగిన్నె అదే!/ఏ తాగుబోతు చొల్లుతో తడిసిపోయిందో ఆ చలికోటు?/ఈ చలిలో రెండు డాలర్లకి అదే నా శరీరానికి చలిమంట/లోపల నా తెల్లకణాల తిరుగుబాటు పూట పూట బతుక్కి ఎంత మిడిసిపాటు?" (తోలు మందం)

"ఇంతకీ ప్రశ్నని మించిన వక్రరేఖ/ఏదీ ఇంకోటి చూపించు" అంటాడు కవి. ఇది ఊరిచివరి కథ. అక్కన్నుంచి మళ్లీ "ఇంటివైపు" కు చూసే ధైర్యం చేసినవాడినేమనాలి? ఇప్పటికైతే నేను ప్రవాస జీవి అఫ్సర్ అంటాను. ఇక్కడిదన్క బాగనే వున్నది. ప్రయాణమూ.. పురోగమనమూనూ. ఇప్పుడీ తిరోగమనంలోనే అసలు సిసలు సంక్లిష్టతలతో కూడిన సందిగ్ధత దాగి వున్నది. అందుకే ఎక్కడమంత అలుపుండదు. దిగడమంత దిగులుండదు.

*'ఇంటివైపు' లో పంక్తులన్నీ కోట్ చేయదగిన వాక్యాల్లా మెరుస్తాయి. అది అనుభవసారంగా పాఠకులు మిగిల్చుకోగలగాలి. అటువంటి సారాన్ని లోలోపలికి ఇంకించుకోవాలి. పాలను మరగబెట్టి మరగబెట్టి తయారుచేసిన పాలకోవాలా తన కవిత్వం వుంటుంది. ఆస్వాదించే హృదయం కావాలి. అది దుక్కమైనా..సంతోషమైనా.. ఇప్పుడు కవితా వస్తువుల గురించో, సంఘటనల గురించో, నిర్మాణ పద్ధతుల గురించో, శైలీ శిల్పాల గురించో చర్చ అనవసరం. చెట్టుమీద పండిన తీపి మామిడిని రుచి చూడాలనుకుంటే దాని జాతి, ప్రజాతి, సైంటిఫిక్ నేమ్ లతో పనుండదు. జీవితాన్ని కాచి వడబోసిన సారాన్ని సిప్ చేస్తామో, గుక్కెడు గుక్కెడు గుటుక్కుమని మింగుతామో మన ఇష్టాయిష్టాలపై ఆధారపడి వుంటుంది. మచ్చుకు కొన్ని చూద్ధాం.


" నేనెప్పు డో ఎంగిలి పడి పోయాను కాబట్టి ఇప్పుడే వండినంత వేడిగా మెరుస్తూ కనిపించలేను" ( నిర్వాణం)

 "చింతల చిగురాకులో, సుఖాల నిప్పు కణికలో  దాటి వెళ్ళాక కానీ స్పృహ  రాదు. వొళ్లే అగ్నిగుండమయినప్పుడు" (అంతిమ క్రియలు కొన్ని)

"ఒక పగటి కల అయినా పర్లేదు నాకు, దాన్ని అనేక రాత్రుల శిఖరం మీద వెలిగిస్తాను" (కాసేపు ఉండిపొమ్మని)

 "ఎప్పటికప్పుడు మునిగి పోవడమే తిరగదోడుకునే బతుకు పాఠమైనప్పుడు ఏ అనుభవాన్ని నువ్వు ప్రేమించలేవు, ఏ క్షణంలోనూ తలమునకలై బతకలేవు (అలవాటుపడనితనమేదో)

"నిజానికి పిసరంత వెలుతురు కూడా ఇక రాలేదు అన్నంత చీకటి తెలిస్తే మంచిది"(యివేవీ తెలియలేదనుకో)

 "లోపల వెయ్యి తలుపుల ఇల్లు. ప్రతి ఇంట్లో కొన్ని అపరిచిత లోకాలు" (పాడేటప్పుడు)

 "ఆగిపోవడం తప్పేమీకాదు. ఎవరో విధించిన శిక్ష కూడా కాదు. ఆ కాసేపు నిన్ను ఆపాలని ఎందుకనుకుందో జీవితం" (ఆ చిన్ని పాదాలు)

"ఒక క్షమాపణ తరువాత ప్రపంచమేమీ పెద్దగా మారిపోదు" (ఒక చేరువ ఒక క్షమాపణ)

 "ప్రేమలో ఉన్నదేదో ఎంత చెప్పినా అర్థం కాదే. ద్వేషమే గూడుకట్టిన లోపలి చీకట్లో !"(గాలి మోసుకెళ్లే పాట)

"నాదాకా ప్రవహించడానికి నువ్వు ఎన్ని దాటుకుంటూ రావాలి ?" (జ్వర సమయం)

 "తన అనుక్షణ పరాజయాల చరిత్రని మగవాడెప్పుడూ తానై చదువుకోలేడే ! అతనిలోని ఒక స్త్రీ కలవరించినప్పుడు తప్ప!"

" నా ఎగుడుదిగుడు రాళ్ల మీంచి నీ మాటల చేతుల అలలతో నిమురుకుంటూ వెళ్ళు. ఎప్పుడో ఒకప్పుడు నా రాతి దేహం నీ మునివేళ్ల నునుపవుతుంది " (నిన్ను బాధించిన ఆ ఒక్క క్షణం తరువాత)

ఇదో వ్యక్తిత్వ వికాస పుస్తకంలా  కనిపించే కవిత్వ సంపుటి. వ్యక్తిలోని సమూల జాఢ్యాల్ని విదిలించుకునే మార్గం ఉపదేశించే ఒకానొక మంత్రదండం. మనిషి పుట్టుకే ఏడుపులోంచి. అది దుఃఖనదిలా ప్రవహించి ప్రవహించి ఇగిరిపోవాలే కానీ సముద్రపు పెను ఉప్పెనై మిగిలి పోకూడదు.

 "ఇంటివైపు"లో మనల్ని మనం చూసుకోవచ్చు. ఇందులోని నరేషన్ మనసు గుంజను పట్టుకొని వేలాడుతుంటుంది. అన్వయించుకోవడమనే కళ వంటబట్టాలే కానీ మనిషికి ఉన్న సమస్త సమస్యలకీ ఇక్కడో పరిష్కారమార్గం దొరికి తీరుతుంది. అహం బద్దలవుతుంది. మనిషి నిర్మలత్వం బోధపడుతుంది. నిర్మలమైన మనసుతో ఏది కోరుకుంటే అది సిద్ధిస్తుంది. అందుకు దానికి కొంచెం శ్రమను తోడు చుక్కలా వేస్తే సరిపోతుంది.

 మనతో సమాజానికీ,  మనలోని మనకీ షటిల్ సర్వీస్ చేసే పరాయీకరణ,  దిగులు, అంతర్గత సంఘర్షణ, సమకాలీన ప్రపంచంలోని అసమానతలు అన్నీ గాజు పెంకులై గుచ్చి గుండెను గాయపరిస్తే ఉబికి వచ్చిన నెత్తురు చేసిన సంతకం అఫ్సర్ కవిత్వమని నిర్ధారించవచ్చు.

 దశాబ్ధాలుగా కొనసాగుతున్న అఫ్సర్ లోని కవికి వినమ్రంగా నమస్కరిస్తూ శనార్తులు.

- బండారి రాజ్ కుమార్ 

click me!