వడ్లకొండ దయాకర్ కవిత: ఇల్లు సదిరినప్పుడు

By telugu teamFirst Published Nov 18, 2019, 4:22 PM IST
Highlights

వొయ్యిలమధ్య నలిగి/ చీకుడుపట్టిన ఓ పాతకమ్మమీది/ పత్తిపెన్ను రాతలు/ ఇన్నేండ్లు జర్పుకున్న పుట్టినరోజులు/ తప్పని రూబిడిజేత్తయి అని అంటున్నాడు తెలుగు కవి వడ్లకొండ దయాకర్ తన కవిత ఇల్లు సదిరినప్పుడులో...

వొయ్యిలమధ్య నలిగి
చీకుడుపట్టిన ఓ పాతకమ్మమీది
పత్తిపెన్ను రాతలు
ఇన్నేండ్లు జర్పుకున్న పుట్టినరోజులు
తప్పని రూబిడిజేత్తయి

సందుక అడ్గున
తుప్పుమరుకల దస్తావేజులు
నాయిన తేర్పిన బాకీలను లెక్కగట్టి
కన్నీళ్లతో ఫోటోలోని నాయిన పాదాలు కడుగుతై

మైలుదానిపెట్టెల ఇరికి
బల్వంతంగ బైటికచ్చిన ఎక్సెరే ముక్క
గోదాట్లె కల్పిన ఇరిగిన తాత తుంటెముకను
కండ్లముందు ఫ్రేముకడుతది

అటుకమీద సాలెగూడు బంధనాల్ని ఛేదిస్తే
మాగినదుబ్బల తలతలమెరిసిన
గిలుక, కీసుపిట్ట
చిన్నతనపు జాతరకు గొర్రగొర్ర గుంజుకపోతై

మూటకట్టిన పాతబట్టలమూట 
 ముడిప్పుతే
నాయినమ్మ చెక్కుడుసంచిలోని
మూడోజేబుల
ముడుపుగట్టిన చిల్లరపైసలు బైటవడ్తై

ఇల్లంతా గాలిచ్చినా దొర్కని తాళంచేయి
తనబ్బీలకేలి బైటికొచ్చి
మతిమరుపును ఎక్కిరిత్తది

తాత్పరెంగ సూడాలెగని
ముంతగూడు చిలుక్కొయ్య పెద్దగాబు
యిసిరెల లంకెబిందెల్ని
పాతిపెట్టిన నేలమాళిగలే

అనుభూతులు పెనవేసుకున్న జ్ఞాపకాలకోసం 
మనం ఏ మ్యూజియానికో పోనక్కెరలేదు
ఇగురంగ ఏడాదికోపాలి 
ఇల్లుసదిరితె సాలు

click me!