రవీంద్రసూరి నామాల కవిత: మళ్ళీ చెబుతున్నాను

By telugu team  |  First Published Dec 23, 2019, 4:52 PM IST

ఏషియా నెట్ తెలుగు కోసం రవీంద్ర సూరి నామాల ఓ కవిత రాశారు. ఆ కవితను పాఠకులకు అందిస్తున్నాం, చదివి మీ అభిప్రాయం చెప్పండి.


ఆలోచన సినిమా 
ఆవేదన సినిమా 
నా ఆలాపన ,ఆరాధన సినిమాయే 
నేనే ఓ సినిమా ....

సినిమా రంగం నాకో యుద్దభూమి 
యుద్ధం చేయడం ఇష్టం 
నాతో నేను యుద్ధం చేయడం మహా ఇష్టం 
నా యుద్ధం లో అటూ ఇటూ నేనే 
నేను వదిలిన శరం నాకే తగుల్తుంది 

Latest Videos

అప్పుడప్పుడు 
యుద్ధభూమి ఖాళీగా ఉంటుంది 
మనసంతా రక్తపాతమే
వచ్చింది యుద్ధం గెలవడానికి కదా ..
మళ్ళీ రణక్షేత్రం రగులుకుంటుంది 
నాతో నేనే భీకర పోరాటం 
గెలవడం కోసం యుద్ధం చేస్తున్న ...
కనుక అలసట రావడం లేదు 
గెలుపు కన్పిస్తోంది 
చేతికి గెలుపుకి మధ్య వెంట్రుకవాసి దూరం 
అయినా అందడం లేదు 
అది మరీచిక అనుకోవడానికి అవకాశం శూన్యం 
ఆయుధమైన నా చేతి అక్షరం 
యుద్ధభూమిలో వదిలేసి 
అప్పుడప్పుడూ చచ్చిపోతున్నాను 
యుద్ధం లో చావును చూడడం విషాదం కాదు 
యుద్ధం చూడక పోవడం విషాదం 

ఒక మొహమాటం 
నాలో సగమైన మరో గెలుపు చిహ్నం 
ఇంకో మానసిక వీరత్వం 
గెలుస్తావని వెన్నుతట్టిన నా వెన్నెముక 
కలిసి మళ్ళీ బరిలోకి దిగమని బతికిస్తాయి 

కాలం నిర్మించిన 
నా యుద్ధక్షేత్రం లో ఎటుచూసినా 
నా శరీరంపై  విసరగా 
విరిగి పడిన కత్తుల శరీరాలే..

అవిటివైనా ఆయుధాలు 
అదిరిపడి ఎదురుపడలేక 
ఒక్కోటి ఆత్మహత్య చేసుకుంటున్నాయి 

అదిగో అదిగదిగో 
గెలుపు చేతులు చాచి నా వైపే పరిగెత్తుకొస్తుంది 
యుద్ధక్షేత్రం విస్తృతమవుతుంది 
గెలుపు ఇచ్చిన ధృతరాష్ట్రుని కౌగిలితో 
సమరభూమి సగం కుంచించుకుపోయి 
వికృత రూపం దాలుస్తోంది 
ఆత్మహత్య చేసుకున్న కత్తుల శరీరాల మధ్య 
ఒంటరిగా నా శవం 
రక్తపు చుక్కైనా రాల్చని నా శవం సైతం 
గెలుపు కోసం యుద్ధభూమి లోనే 
సరికొత్త పంథాను అన్వేషిస్తోంది 
యుద్ధం చేయడమే గెలుపుకు సూత్రం 

ప్రపంచం చూస్తోంది 
వింతగా చూస్తోంది విడ్డురంగా చూస్తోంది 

మళ్ళీ చెబుతున్నాను
యుద్ధం గెలవకపోవడం విషాదం కాదు 
యుద్ధం చేయక పోవడమే విషాదం 

click me!