రమాదేవి బాలబోయిన వానై కుర్సినయి అనే కవితలో ఆర్ద్రత నిండి ఉంది. ఏషియానెట్ న్యూస్ తెలుగు పాఠకుల కోసం ఆ కవితను అందిస్తున్నాం.
నడిజామురాత్రి కాన్నుంచి
రికాం లేకుండా ఒకటే జల్లు
అలాయిబలాయిలిచ్చుకునుడు
మతిలున్నోళ్ళకన్నా ఫోనుకొట్టుడు
నిన్న ఉన్నట్టు ఇయ్యాల లేదు
ఇయ్యాలున్నట్టు రేపు ఉండదు
కాలం గట్టుతెగినట్టు సాగిపోతూనే ఉన్నది
క్షణమైనా ఆగకుంట మర్రిసూడనంటాంది
అయినా అదో తాపత్రం ఒల్లకున్నది
ఒడవని నాటకమింకా సాగుతూనే ఉన్నది
మొస్సమర్రనంత కష్టాలల్ల కూడా
కాలాన్ని నిందించేదేమున్నది
ఎవల రెక్కల కష్టం వాళ్ళకే దక్కినట్టు
ఎవలెంతరాసుకుంటే వాళ్ళరాత అట్లుంటది
అయినా ఒకలకొకలం సాయితగాళ్ళమన్నపుడు
గామాత్రం సమాచారమందుకోలేమా
ఒకల మనసుల ఇంకొకలం తలదాచుకోలేమా
ఈ యేటికి గాకున్నా మరోయేటిదాకైనా
మనం తోడున్నామనిపించామంటే
పోయే పాణం నిలబడతది
మనసును కోసే రంది పక్కకుపోతది
గందుకనే వస్తాంటయి అపుడపుడీ పండుగలు
శుభాకాంక్షలువానై కురిసి వరదై పోంగి
మనసును తేలికపడేసి
మరింత మానసిక స్తైర్యమిస్తూ ముందుకు తీస్కపోతయ్