ప్రముఖ సాహితీవేత్త నిఖిలేశ్వర్ కు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. ఆయన రాసిన అగ్నిశ్వాసకు కేంద్ర సాహిత్య అకాడమీ ఆ అవార్డును ప్రకటించింది. మానస ఎండ్లూరికి యువపురస్కారం లభించింది.
హైదరాబాద్: ప్రముఖ కవి నిఖిలేశ్వర్ కు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. ఆయన కవిత్వ సంపుటి అగ్నిశ్వాసకు కేంద్ర సాహిత్య అకాడమీ ఆ అవార్డును ప్రకటించింది. కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కారం ఈ ఏడాది మానస ఎండ్లూరి దక్కించుకుంది. ఆమె రాసిన మిళింద అనే కథల సంపుటికి కేంద్ర సాహిత్య అకాడమీ ఆ అవార్డును ప్రకటించింది. అనసూయకు కేంద్ర సాహిత్య అకాడమీ బాల సాహిత్య పురస్కాం లభించింది.
నిఖిలేశ్వర్ అసలు పేరు యాదవరెడ్డి. తెలుగులో వచ్చిన దిగంబర కవిత్వ ఉద్యమంలోని ఆరుగురు కవుల్లో ఆయనొకరు. దిగంబర కవులు తమ అసలు పేర్లతో కాకుండా కలం పేర్లతో కవిత్వం రాశారు. అందులో భాగంగా యాదవ రెడ్డి తన పేరును నిఖిలేశ్వర్ గా మార్చుకున్నారు.
నిఖిలేశ్వర్ విప్లవ కవిత్వోద్యమంలో కూడా ప్రధానమైన కవి. దిగంబర కవిగా ఉన్న ఆయన ఆ తర్వాతి కాలంలో విప్లవ కవిత్వోద్యమంలో ప్రధాన భూమిక పోషించారు.
ఇక మానస ఎండ్లూరి ఇటీవలి కాలంలో విస్తృతంగా సాహిత్య సృజన చేస్తున్నారు. ఆమె ప్రముఖ కవి ఎండ్లూరి సుధాకర్ కూతురు. వారిద్దరికి సాహిత్యకారులు అభినందనలు తెలుపుతున్నారు. సోషల్ మీడియా వేదికగా వారిపై అభినందన వెల్లువ పెల్లుబుకుతోంది.