ఉవ్వెత్తున ఎగసిన తెలంగాణ రుబాయిలు

By telugu team  |  First Published Mar 12, 2021, 6:34 PM IST

ఏనుగు నరసింహా రెడ్డి రాసిన తెలంగాణ రుబాయిలకు విశేష ప్రాచుర్యం వచ్చింది.  ఆ రుబాయిల్లోని రూపం, శిల్పంపై సౌభాగ్య అందించిన వ్యాసం.


ఏనుగు నరసింహా రెడ్డి వచన కవిగా సుప్రసిద్ధులు. ఒకోసారి కవులు అభివ్యక్తి కోసం రకరకాల ప్రక్రియలను ఆశ్రయిస్తారు.  ఏనుగు గారు రుబాయిలు తన అనుభూతులకు సరైన వాహికగా భావించారు.  అలా మొదలుపెట్టి ఎన్నో రాశారు.  ఎందరో వాటిని గానం చేశారు.  వాటికి విశేష ప్రాచుర్యం వచ్చింది.  వీటిలో వ్యక్తి గత అనుభూతుల నుంచి ఉద్యమస్ఫూర్తితో రాసినవి కూడా ఉన్నాయి.  ఆయన హృదయ తరంగాలు మనల్ని చుట్టుముడతాయి.  వాటిల్లో ఆర్ద్రత, నిజాయితీ ఉన్నాయి.

తాత్వికత ఉన్నప్పుడు కవిత గాంభీర్యాన్ని సంతరించుకుంటుంది.  కేవల అలంకారాలు గిలిగింతలు పెట్టవచ్చు.  తాత్వికత ఒకటే మనిషిని ఆలోచింపజేస్తుంది.

Latest Videos

“చౌరస్తాలో నిలుచుంటే సామాన్యులు ఎదురొస్తరు
ఊరవతల నడిచినప్పుడే పోయినోల్లు ఎదురొస్తరు
చదువు తోటి అర్థమయ్యే సైన్సు కాదీ  జీవితం
ఎదురీతలకు వెళ్ళినప్పుడే మన వాళ్ళు ఎదురొస్తరు”

ఊరవలకు వెళితే అక్కడ మట్టిలో మౌనంగా నిద్రిస్తున్న వాళ్లు మనసులో మెదలడమన్నది అందరి అనుభవమే! శాస్త్రీయ విజ్ఞానంతో అన్నీ సాధించాం అనుకుంటే తప్పు.  జీవితం సైన్సుకాదు.  ఒక జెన్ సన్యాసి దగ్గరకు వచ్చి ఒక సైంటిస్టు తాను రూపొందించిన ఎన్నో ఆవిష్కారాల్ని ప్రదర్శించాడు. బటన్ నొక్కితే దేశాలు మసి అయిపోయే ఆయుధాలు ఉన్నాయన్నాడు.  గర్విస్తున్న అతనితో జెన్ సన్యాసి "శాంతి కోసం ఏమైనా సృష్టించారా?" అని అడిగితే అతను నోరు వెళ్ళ బెట్టాడు.
ఏనుగు నరసింహా రెడ్డి శాంతి ప్రియులు.  సౌజన్యం సంస్కారం ఉంటేనే తప్ప పోయిన వాళ్ల గురించి ఉన్న వాళ్ల గురించి తపించరు.  ఈ సందర్భంలో వ్యక్తి అహంకారాన్ని ఎట్లా వదులుకోవాలో మనిషి ఎంత  అల్పుడో, అనంత విశ్వంలో పిపీలికం కన్నా ఎంత తక్కువవాడో అద్భుతంగా వివరించారు.

నువ్వుంటే ఎంత లేకుంటే ఎంత?
నేనుంటే ఎంత లేకుంటే ఎంత?
జీవరాశి మొత్తంలో ఒకానొకడు
మనిషుంటే ఎంత? లేకుంటే ఎంత?
   
మన క్షణికమైన జీవితాన్ని వివరిస్తున్నాడు.  నువ్వు కావచ్చు నేను కావచ్చు, కానీ ఈ మహా ప్రపంచంలో మన ఉనికి లెక్కింప దగినది కాదు.  అది ప్రతి మనిషికీ వర్తిస్తుంది అంటాడు.  ఈ సందర్భంలో వివేకానందుడు చెప్పిన మాటలు గుర్తొస్తున్నాయి.  మనం నిష్క్రమిస్తే ఈ ప్రపంచానికి ఏమి లోటు ఉండదు.  ప్రపంచం నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది.  మన పరిమితుల్ని పరిధుల్ని గుర్తించి మన కర్తవ్యాన్ని మనం నిర్వహించి ఇక్కడి నుండి ప్రతి మనిషి మాయం కావాలి.  ఒక జెన్ ఋషి చెప్పినట్టు ఆకాశంలో పక్షులు అడుగుజాడల్ని వదలకుండా నిష్క్రమించినట్లు మనం మాత్రం అర్థం కావాలి.

కవి కావాలంటే మొదట అతను ప్రతిదాన్ని కవితాత్మకంగా చూడగలిగి ఉండాలి.  సౌందర్యమన్నది కవిత్వానికి మౌలిక ధాతువు.  అటువంటి సౌందర్యం ఏనుగు నరసింహారెడ్డి హృదయమంతా నిండి ఉంది.

"మాటల్లో మాధుర్యం గుర్తుపట్టవచ్చు
రాతల్లో సుకుమారం గుర్తుపట్టవచ్చు
మనసులోని అందాలకు కొలమానం లేదు
సహజమైన సౌందర్యం గుర్తుపట్టవచ్చు"

పైన చెప్పిన మాటలన్నీ ఏనుగు నరసింహా రెడ్డి కవిత్వం నిండా పరుచుకుని ఉంటాయి.  మాటలో మాధుర్యం సౌకుమార్యం సౌందర్యం సహజత్వం ఉట్టి పడుతూ ఉంటాయి.

సౌందర్యం తాత్వికత  సమ్మేళనం అపురూపమైంది. అటువంటి కవుల ఆవిష్కారాలు అజరామరంగా ఉంటాయి.  కేవలం ఒక సంఘటనకు లేక ఒక సిద్ధాంతానికి ఒక ఉద్యమానికి కట్టుబడి రాసిన కవితలు చిరస్థాయిగా ఉండే అవకాశం లేదు. అవి ప్రయోజనాన్ని దృష్టిలో ఉంచుకుని రాసినవి.  వాటి హద్దులు దాటి ఏనుగు నరసింహా రెడ్డి మనల్ని బంతిలా ఆకాశంలోకి విసురుతారు, భూమి పైకి తీసుకు వస్తారు.

“ఆకాశం అవతల ఏముంది
భూలోకం యివతల ఏముంది
కనిపించేవి చాలా తక్కువ
కలలకు రెండు కొసల ఏముంది”

ఈ మాటలు చదివి మనసు క్షణకాలం స్తంభించి పోతుంది.  మన ఆలోచనలు ఆగిపోతాయి.  నిజమే ఆకాశం అవతల ఏముందో మనకు తెలుసా? భూలోకంలో ఏముందో తెలుసా మనకు.   నిజంగానే తెలియదు కదా.  ఒక జెన్ ఋషి చెప్పినట్లు నువ్వు పుట్టక ముందు నీ రూపం ఏమిటి?  నువ్వు నిష్క్రమించిన తర్వాత నీ ఆకారం ఏమిటి?  వీటికి సమాధానాలు మనం ఎవరం చెప్పలేము.  ఈ సందర్భంలో జర్మన్ మహాకవి గేతే చెప్పిన మాటలు గుర్తొస్తున్నాయి. ఆనందం బంతి లాంటిదట. అది మన కాళ్ళ దగ్గర ఉంటే దాన్ని తన్ని దానికోసం పరిగెడుతుంటామట!

“ఎన్నో సందళ్ళ నడుమ రోజు జారిపోతుంది
ఏ అలజడి లేకుండ శతాబ్ది దొర్లి పోతుంది
ఊద కుండానే ఆరిపోయే దీపం మనిషి
ఏ సడీ లేకుండా ఊపిరి ఆగిపోతుంది”

కవి జీవితాన్ని దూరం నుంచి పరిశీలిస్తున్నాడు. అనుక్షణం జరుగుతున్న మార్పుల్ని అనుశీలిస్తున్నాడు.  ఎన్నో సందర్భాలు, ఎన్నో సందళ్లు వస్తూ పోతూ ఉంటాయి.  సూర్యోదయానికి, సూర్యాస్తమయానికి మధ్య రాగద్వేషాల రంగేళి సాగుతూ ఉంటుంది.  ఇలా ఒకరోజు కాదు, వంద సంవత్సరాలు గడిచిపోతాయి.  ఇక్కడ ఆ కవి ఒక అద్భుతమైన అలంకారాన్ని ప్రదర్శించాడు.  మనిషి ఒక దీపం అట.  కానీ ఆ దీపం ఎవరూ ఊదకుండానే ఆరిపోతుందట.  ఇక్కడ  ఒక సూఫీ సందర్భం చెప్పాలి.

ఒక పసివాడు దీపం వెలిగించుకుని పట్టుకొని వెడుతున్నాడు.  ఒక సూఫీ గురువు ఆ కుర్రాడి దగ్గరకు వచ్చి ‘ఈ దీపం నువ్వే వెలిగించావా? వెలిగించినప్పుడు కాంతి ఎక్కడి నుండి వచ్చిందో చూశావా’ అని అడిగాడు.  దానికి ఆ కుర్రాడు ఆ దీపం ఆర్పేసి  ‘ఇది ఆర్పినప్పుడు మీరు పక్కనే ఉన్నారు కదా!  కాంతి ఎక్కడికి వెళ్లిందో చెప్పగలరా’  అని అడిగాడట.  అచ్చం అదే రీతిలో ఏనుగు నరసింహా రెడ్డి జీవితం గురించి చెప్పారు.

కవి దీని గురించి చెప్పిన కళలు హద్దులు దాటి వెళ్ళినట్లు ఎక్కడా కనిపించవు.  ఉదాహరణకి
“ఒకటి వెంట ఒకటి రుతువులోస్తై పోతై
ఒకరివెంట ఒకరి పానలోస్తై పోతై
చిరకాలం నిలిచేది జ్ఞానమొక్కటే
దోపిడీలు దొర తనాలు వస్తై పోతై”

“ప్రతి రాయి ఒక చిత్రమే
ప్రతి చెట్టు ఒక చిత్రమే
ఎవరు చేసిరో తెలుసుకో
ప్రతి జీవి ఒక చిత్రమే”

ఈ మాటలు మనల్ని దిగ్భ్రమకు లోను చేస్తాయి. ఋతువులు వస్తూపోతూ ఉన్నట్లే రకరకాల పాలకులు వస్తారు పోతారు, కానీ నీ జ్ఞానం ఒక్కటే శాశ్వతం. దోపిడీలు కాదు దొరతనాలు  కాదు.  ఇక్కడి నుంచి కవిలో భావుకత తాత్వికత రెంటి సమ్మేళనం కనిపిస్తోంది.

ఎప్పుడో పసితనంలోనో లేదా ఎవరో చెప్పిన మాటల ద్వారానో లేదా ఎక్కడో చదివిన వాక్యాల వల్లనో మనిషి విచలితుడవుతాడు.  మహా సుకుమారంగా, సున్నితంగా మారిపోతాడు.  అట్లా ఏనుగు నరసింహా రెడ్డి ఊహ తెలిసిన నాటినుంచి ఆలోచనా జీవిగా మారినట్లనిపిస్తుంది.  లేకుంటే ఇలాంటి ఆలోచనలు సాధారణ కవులకు రావు.  కేవలం ఏనుగు నరసింహారెడ్డి లాంటి అసాధారణ భావుకులకు మాత్రమే వస్తాయి.

నువ్వు నేను దారంటే  వెళుతూ ఉంటాం.  మనము చెట్లను చూస్తాం, పుట్టలను చూస్తాం, రాళ్లు చూస్తాం, కానీ శ్రీశ్రీ చెప్పినట్లు " నీ వైపే చూస్తూ ఉంటాయి. తమ లోతు కనుక్కోమంటాయ్ " అన్నట్లు లోలోతులకు వెళ్లి ఎంతమంది పరిశీలిస్తారు, పరిశోధిస్తారు.  కవికి ప్రతి రాయి ఒక చిత్రమే, ప్రతి చెట్టు ఒక చిత్రమే.  వీటిని ఎవరుచేశారు? ఆ రకంగా ప్రతి జీవి ఒక చిత్రమే అంటున్నాడు కవి. రహస్యాన్ని పరిశోధించడం కాదు, పరిశీలించడం కాదు. ఆమోదించడంలో ఆనందించడంలో జీవితం ఉంది అని కవి గ్రహించాడు ఆ క్రమంలోనే
“మట్టి ని ఎవరైనా చిత్రిస్తే బాగుండు
నింగిని ఎవరైనా పట్టిస్తే బాగుండు
రేయికి  వెన్నాడే పన్నాగాలెన్నున్నా
చీకటిని ఎవరైనా దాపెడితే బాగుండు”

ప్రకృతి శక్తులు ఏవీ  మన అదుపులో ఉండవు.  ఉంటే బాగుండునని ఊహిస్తాం.  ఏనుగు నరసింహారెడ్డి తాత్విక శిఖరాలు అందుకున్నా, ఆయన జీవితాన్ని కాదనటం లేదు.  మానవ సంబంధాల మాధుర్యాన్ని మనసారా ఆహ్వానిస్తాడు.  స్నేహం కుటుంబం అన్నీ ఆయనకు కావాలి.

“అమ్మ యాదికొస్తె గుండె కరిగి పోతది
బిడ్డ ఎదుట పడితె వయసు కరిగిపోతది
వాళ్ల ఉనికి లోన బ్రహ్మ  పరిమళ మద్దే
ఆమె ఎదురు వస్తె మనసు కరిగి పోతది”

నిజమే ఇప్పటికీ ఈ భూమి చేసుకున్న అదృష్టం ఈ మనుషులు చేసుకున్న పుణ్యం ఒకటే.  అది అమ్మ. అనాదిగా మానవ జాతి చేసుకున్న నోము ఫలం అమ్మ. 

భూమికి ఆకర్షణలాగా కవికి ప్రేమ పెద్ద ఆకర్షణ. ప్రియురాలు ఒక వికసించిన పద్మం.  ఆ ప్రియురాల్ని ఊహించని కవి ఎవరూ ఉండరు.  ఒకరు ఇద్దరుగా ఉంటారు.  అప్పుడు ఆ దృశ్యాన్ని సన్నివేశాన్ని కవి ఎలా చెబుతున్నాడో చూడండి.

“ఎందుకో కొలనులో దృశ్యం విసుర్తది
ఊరికే మౌనంలో శబ్దం విసుర్తది
ఆమెకది మామూలే కావచ్చు కానీ
ఎందుకో పత్రం పై చిత్రం విసుర్తది”

కవి ఊహలకు పగ్గాలు ఉండవు.  ఆ ప్రియురాలు మచ్చలేని చందమామ.  నవ్వితే వెన్నెల విరుస్తుంది ఆమె అంతరంగం.  అట్లాంటి ప్రియురాల్ని ‘నువ్వు ఇట్లా పదేపదే గుర్తుకు రాకు, అదేపనిగా కలలోకి రాకు మరిచి పోదాం’ అంటే పిచ్చెక్కినట్టు ఉంది అని ఆరాటపడతారు.

ఎవరో చెప్పినట్లు మనసుకు కళ్ళు ఉంటే మనం ప్రతి దృశ్యం దగ్గర ప్రతి సన్నివేశం ముందు ఆగిపోతాం.  ఒక పువ్వును చూస్తూ యుగాలు గడిపేయవచ్చు అని శేషేంద్ర అన్నాడు.

“పూసేందుకు సిద్ధంగా ఉంటుంది పూలచెట్టు
పరిమళాలు పంచేందుకు పుట్టింది పూలచెట్టు
ప్రతి జీవి తన ధర్మపు పరిధిలోనె నడుస్తుంది
విరిచేసినా బేలగానే ఉంటుంది పూలచెట్టు”

కవి అలా చెట్టు ముందు నుంచుని ఉంటాడు.  పూలు పుయ్యడానికి సిద్ధంగా ఉన్న పూలమొక్కలు చూస్తూ ఉంటాడు.  ఎప్పుడో రాబోయే పూలు వాటి పరిమళాలను అతని మనస్సు దర్శిస్తుంది.  కారణం తన ధర్మం పరిధిలోనే ప్రతి జీవి నడుస్తుందని కవికి తెలుసు.  అనివార్యతని ఆయన దర్శించగలడు.

నన్నయ “స్వస్థాన వేష భాషాభి మతఃసంత రసప్రలుబ్ది దియః” అన్నాడు.  వాల్మీకి “జననీ జన్మ భూమిశ్చ స్వర్గాదపి గరీయసి” అన్నాడు.  అట్లా తను పుట్టిన తెలంగాణ పట్ల కవికి అపారమైన ప్రేమ, గౌరవం.

అధర స్పర్శలు లేని రామాయణపు సృష్టి
అచ్చతెనుగున పూని మహాభారతపు సృష్టి
తెలగాణ పలికింది తేనె సోనల తెలుగు
దేశిఛందాలలో  జానుతెనుగు సృష్టి
అంటూ సాహిత్య చరిత్రపు లోతులలోకి గతానికి వెళ్లి తెలంగాణ తెలుగును ఆకాశానికి ఎత్తుతాడు.
‘కోలాచలం ఒక పతాక, పిల్లలమర్రి ఒక పతాక, పోతన ఒకడేమీకాదు, ఊరూరా కైత పతాక..’ అంటూ ఉరకలెత్తుతాడు.

పోతన మహాకవి “ చేతులారంగ శివుని పూజింపడేని
నోరునివ్వంగ హరికీర్తి నుడువడేని
  దయయు సత్యంబు లోనుగా దలపడేని
కలుగ నేటికీ తల్లుల కడుపు చేటు” అన్నాడు.

ఇందులో మూడవ పాదం సంస్కృతంలో లేదని పుట్టపర్తి వారు చెప్పారు. ఆ మూడవ పాదంలోని దయ సత్యం పోతనగారిలోనే కాదు. ఏనుగు నరసింహారెడ్డి కవిత్వంలోనూ అడుగడుగునా కనిపిస్తాయి.  నిరహంకారిలో నిర్మల భావతరంగాలు ఉంటాయి.  అవి మన మనసులో దీపాలు వెలిగిస్తాయి.  ఏనుగు నరసింహారెడ్డిలో వస్తు వైవిధ్యం ఉంది.  కుటుంబం, వ్యక్తిగత సంబంధాలు మాత్రమే కాక అణగారిన ప్రజానీకపు ఆరాటాలు అడుగడుగునా కనిపిస్తాయి.  మానవజాతికి మంచి రోజులు రావాలి అని, సౌందర్య పథకాలు రెపరెపలాడాలి అని తపించే స్వప్నం అపూర్వమైన కవి ఏనుగు నరసింహా రెడ్డి.

click me!