"కవి చూపు ప్రశాంత ప్రళయం
కవి అక్షరం తలవంచని అరణ్యం
కవి మాట బహిరంగోపన్యాసం"
            —అన్వర్ 

తెలంగాణ కవి అన్వర్ తాజా కవిత్వసంపుటి "ఖుల్లం ఖుల్లా".పేరులోనే కవిత్వసారం ఏంటో తెలుస్తాంది.ఉన్నదున్నట్టు,సాఫ్ సీదాగా చెబుతున్నట్టు అర్థమైతాంది.సి.నా.రె కప్పి చెబితే కవిత్వం,విప్పి చెబితే విమర్శ అన్నడు.మరి కవి అంతా ఖుల్లం ఖుల్లా అంటాండు.కవిత్వమంటే కప్పి చెప్పాలె గద.మొత్తం బహిరంగమే అంటాండేందీ?తీసుకున్న వస్తువుల్లోనే కవిత్వ మర్మమేదో దాగివుంటుందనిపిత్తాంది.కొద్ది కొద్దిగా లోతుల్లోకి పోతేగని ముచ్చటేందో ఒంటబట్టదు.

కవిత్వం,కథ,నవల ఇతరేతర సాహిత్యప్రక్రియలను ఏకకాలంలో సమర్థవంతంగా నిర్వహిస్తున్న కవి బహురూపుల తత్త్వమేందో తెలుసుకోవాల్సిందే! తలవంచని అరణ్యం,ముఠ్ఠీ,సవాల్ తర్వాత యిప్పుడు ఖుల్లంఖుల్లా అనే 4 కవితా సంపుటాలు,బక్రీ (కథలు),జమీలాభాయి(నవల),స్కై బాబా తో కలిసి అజా,సుంకర రమేష్ తో కలిసి తెలంగాణ కవిత,నాయిన కవితా సంకలనాలకు సంపాదకత్వం;1969వరంగల్ అమరవీరులు మరియు ఆత్మబలిదానాలు మొదలైనవి ఆయన రచనలు.సాహిత్యకారుడుఅన్వర్ ను పట్టుకోవాలంటే కవిత్వమే సరైన దారి.

ఇక్కడైతే బహిరంగంగనే చేతికిజిక్కుతడు.ఎటువంటి కవితానిర్మాణ పద్ధతులకు లొంగనితనమొకటి కనిపిస్తుంది.సంప్రదాయ బంధనాలను తెంపుకుంటూ ముందుకు సాగిపోతనే వుంటడు.తనను తానుగా నిలుపుకుంటానికి,తనదైన వ్యక్తిత్వాన్ని పరిపుష్టం చేసుకుంటానికి కవిత్వ మార్గమే ఉత్తమమైనదిగా భావించడం గమనిస్తాం.కవిని పట్టుకోవడమంటే తను ఎటువైపు నిలబడి మాట్లాడుతున్నడు? ఎవరి కోసం మాట్లాడుతున్నడు? అన్నదే ప్రధానం.జీవితాన్ని, కవిత్వాన్నివిడదీయరానంతగా పెనవేసుకుని ముందుకు సాగుతున్న కవి కవిత్వంలో తన వైఖరిని బహిరంగంగనే వినిపిస్తడు.తన వ్యక్తిత్వం,ఆలోచనావిధానం కవిత్వంలో ప్రతిబింబిస్తుంది. ఏ పని మొదలెట్టినా సీరియస్ గా చేయడం,నిబద్ధతతో పూర్తిచేయడం అతని నైజం.

రెండు దశాబ్ధాలకు పైగా సాగుతున్న సాహితీ ప్రస్థానం నుంచి కవిగా  అతని స్థానం ఏంటో కాలమే నిర్ణయించి,తలవంచని కవిగా నమస్కరించింది.అయితే కవిత్వ రచనపై ఇతర సాహిత్య ప్రక్రియలైన కథ,నవల లాంటివేమైనా ప్రభావం చూపుతున్నయా? ఇప్పటితరానికి తన కవిత్వాన్ని పరిచయం చేస్తున్నప్పీడు గడ్డ పెరుగు లాంటి స్థితి నుండి సర్రున గొంతుజారే సల్లను వడ్డించే దిశకు సాగుతీన్న పరిణామాల్ని ఎలా అర్థం చేసుకోవాలె?వస్తువు,వస్తువిస్తృతి దృష్ట్యా విశాలమైన కాన్వాసును ఉపయోగించాలంటే కవిత్వం సరిపోదనే దృక్పథంతోనే కథ,నవల వైపు పయనం కొనసాగిందా? కవి మరుగున పడిపోయిండా? అనుకొనేలోపు లేదు లేదు కవి మెలకువతోటే ఉన్నడని ,ఉంటాడని వాగ్ధానం చేయడం గమనించవచ్చు.బహుశా మారుతున్న సామాజిక పరిస్థితులు,ఒకచోట నిలువనీయకుండ చేస్తున్న సంఘటనలు,జరుగుతున్న దాడులు,పెరుగుతున్న అఘాయిత్యాలు తీవ్రమైన ప్రభావాన్నే కవిపై కలిగించి వుండాలె.లేకపోతే 'ఖుల్లంఖుల్లా'గా కవిత్వమై మనముందు నిలబడేటోడు కాదేమో ! ఇప్పటి తక్షణ అవసరం-అంతా బహిరంగంగానే చర్చించడం.ఈ తాజా కవిత్వ సంపుటి నవనవలాడుతూ తెలంగాణ సాధించుకున్న తర్వాతి పరిణామదశల్ని ఏకరువు పెట్టింది.నిజానికిదంతా బహిరంగోపన్యాసం.

తెలంగాణ ప్రభుత్వ వైఖరి ఎలా వుంది? అమరుల త్యాగాలను ఎలా రాజకీయం చేసింది? అప్పటికప్పుడు పబ్బం గడుపుకునే రాజకీయాల్ని ఏమనాలె? "మరువని త్యాగం" కవితలో అమరుల త్యాగాల గురించి ప్రస్తావిస్తడు.

"నాలుగు బాటల చౌరస్తాలల్ల
పొద్దుపొడుస్తున్న సూర్యుని లెక్క
అమరత్వం నిలబడే ఉంటది"
(పేజీ నం:38)

కొత్త రాష్ట్రం ఏర్పడినంక ఏమేం సదురుకోవాలె,ఎట్లెట్ల ఇగురంగ మసులుకోవాలె అని ఎన్నో ఇసారిచ్చుకున్నం.తెలంగాణ వచ్చినంక హరితహారం కార్యక్రమం పెద్ద ఎత్తున మొదలైంది.పచ్చగా కళకళలాడుతదనుకున్నం.పచ్చదనం మాటున ప్రకృతిని ధ్వంసం చేస్తున్న దగాకోరుతనం పట్టింపుకు నోసుకుంటలేదు.అధికార వర్గాలే గుట్టల్ని ఆంబుక్క పెడుతున్నయి.కొమ్ముగాశినోల్లకు సొమ్ముజేసుకుంటానికి పట్టాజేశిత్తానయి."గుట్ట కోసం" కవితలో ఆ ఆవేదనా రూపాన్ని దర్శించవచ్చు.

"గుట్టలు తొవ్వేటోనికి ఒక కులమున్నా బాగుండు
ఆ కులపోనికి ఇనేటోడు
ఒక పార్టీ వున్నా బాగుండు
ఆ పార్టోనికి ఇనేటోడు
వాడు మనిషైనా బాగుండు
మనుషులకు ఇనేటోడు"
(పేజీ నం:45)

ప్రకృతిని నాశనంజేశేటోడు మనిషే కాదని తీర్మానిస్తుడు.దోచుకోవడమే ఎజెండా అయినోడికి కులంతోనో,మతంతోనే పార్టీలతోనోే సంబంధం లేదని తేటతెల్లమైతది.

రైతు సంగతేంది? ఆయనెట్లున్నడు? అప్పుల బాధలు సమసిపోయినయా? మూడుపూటలు సొక్కంగ మెక్కి ,కంటినిండా నిద్రపోతున్నడా? బతికున్నడా..సచ్చిండా? సచ్చి బతుకుతున్నడా?తెలంగాణ వొచ్చినంక ఆయనకేం వొరిగింది?ఎకరానికింత? అని లెక్కగట్టి ఇచ్చుడా? భూమే లేనోని సంగతేంది?ఎన్ని ఎకురాలుంటే అంత ముట్టజెప్పుడే కదా..ఇండ్ల న్యాయమేమున్నది?ఓపాలి "పండని పంట" కవితను సుద్దం.

"రైతు బతుకులు వూరేగాల్సిన చోట 
శవాలు ఊరేగుతున్నయ్ 
ఇండ్ల ఎవ్వరి పాపమున్నదోకనీ
రైతు సావుల అందరి భాగమున్నది"
(పేజీ నం : 49)

ఎవ్వరి పాపమున్నదో కవికి తెల్వందిగాదు.రైతు సావుల నిజంగనే అందరి భాగమున్నది.రైతును సూసుకుంట సూసుకుంట బతికించుకోలేక పోతున్నం.అది మన శాతగానితనం కిందే లెక్క.నాసిక్ లో మొదలైన మహాపాదయాత్ర తీవ్రతకు కారణమేంది? సహనం కోల్పోయిండు రైతు. వాగ్థానాల ప్రభుత్వ మానిఫెస్టోల్ని తగలబెడుతున్నడు? ఆవేదనతో ,కడుపుమంటతో రగిలిరగిలిపోతున్నడు."మట్టికాళ్ల మహహానడక" కవితనే సూద్దం.

"చెమటచుక్కల దేహంతో పారుతున్న వాగులెక్క
మట్టికాళ్లతో మహానగరాన్ని చుట్టేసిన ఎవుసం లెక్క
నడిచిండ్లు ఎగిరిండ్లు దుమికిండ్లు వురికిండ్లు"
(పేజీ నం : 180)

పారుతున్న వాగులెక్క చుట్టేసిన రైతును తల్సుకుంటాండు కవి.రైతు పిలిస్తే బువ్వ తినేటోడైనా రొట్టె తినేటోడైనా ఎవ్వలైనా సరే తినే మెతుకుల సాక్షిగా ఏడికైనా నడిసొత్తమని రైతుకు భరోసా ఇస్తున్నడు.ఇది గదా కావాల్సింది.దేశానికి ఎన్నెముక అయినోడికి వెన్నుదన్నుగా నిలబడడం కంటే ఈ పుట్కలకు అర్థమేముంటది జెప్పుర్రి?

నిన్న గాక మొన్న వరంగల్లోనే నడిరోడ్డుమీద ఓ అమ్మాయిని పెట్రోల్ పోసి తగులబెట్టడం సూశినం.గతంలో ఆసిడ్ దాడులనూ కండ్లార సూశినం.కవి మొద్దునిద్ర పోతడా? ఋసూసుకుంట ఊకనే వుంటడా..వుండలేడు.చలించిపోతడు.తనకే,తనవాళ్లకే అది జరిగిందని తదాత్మ్యం చెందుతడు.ఊగిపోతడు.స్త్రీ ల మీద రోజురోజుకీ జరుగుతున్న దాడుల్ని ప్రశ్నిత్తడు."భూకంపం" కవితలో అత్యాచారం చేయబడ్డ అమ్మాయి తల్లి రోడ్డెక్కి పుట్టిస్తున్న భూకంపం గురించి,న్యాయం చేయాలని చేస్తున్న పోరాటం గురించి చెప్పుకొత్తడుకవి.ఎలాంటి పరిస్థితులు దాపురించినయో పటంగట్టి సూపెడుతడు.

"కాలేజీకి పోతూ ఆమె రోడ్డు మీద నడుస్తున్నది
భయంగా బెరుగ్గా వొంటరిగా అడవిలో నడుస్తున్నట్టుగా
అర్ధరాత్రి స్మశానంలో నడుస్తున్నట్టుగా
పిచ్చికుక్కల మధ్య నడుస్తున్నట్టుగా.."
(పేజీ నం:53)

స్వాతంత్య్రం వచ్చి ఇన్నేండ్లైనా అర్థరాత్రి కాదుగదా..పట్టపగలు స్వేచ్ఛగా సంచరించే అవకాశమే లేకుండా పోయింది.అభద్రతాభావం రోజురోజుకీ పెరిగిపోతుంది.రక్షణలేని స్థితిలో స్త్రీ  మానసిక వేదనకు గురవుతున్నది.

ఆత్మగౌరవ ప్రతీకగా తలకెత్తుకున్న తంగేడును "పూల చాదర్ "గా కీర్తిస్తున్నడు.తలల పెట్టుకోకున్నా తలమీద ఎత్తుకుంథటున్నమని దాని ఔన్నత్యాన్ని వర్ణిస్తడు.

"పోరాటాల గొంతు విచ్చుకుని విరగబూసిన పువ్వు
పిడికిట్ల తనువు పులకించి మొలకెత్తిన  పువ్వు
తెలంగాణ మాగాణంలో తొలిపొద్దు పువ్వు-తంగేడు"
(పేజీ నం:59)

తంగేడును చెట్టునిండా పూచిన పూలమంద అనడం చూడొచ్చు.తంగేడుచెక్కతో లందల తోళ్లను శుద్ధి చేసే తొలి శాస్త్రవేత్తలు మనోళ్లు.తెలంగాణ ఉద్యమంలో తంగేడు పూల బతుకమ్మను నెత్తినెత్తుకున్నం.ఆ చరిత్ర గొప్పది.

"దేౌశమంటే ఏందిరా?
దేశమంటే బతుకు
దేశమంటే మట్టిబతుకులు

ఈ దేశం మీ సింహాసనం కావచ్చు?
మా మూలవాసం-"
(పేజీ నం:61)

ఎవ్వడు సచ్చినా డప్పుకొట్టేటోల్లది,బొందతోడేటోల్లది;మాసిన బట్టలు ఉతికి ఇస్త్రీ చేసేటోల్లది,బొచ్చు గీకేటోల్లది-కత్తిరిచ్చేటోల్లది,బహుజనులది,పుట్ పాత్ ల మీద బతుకీడ్చే మూలవాసిదేనని సర్శినట్టేజెప్తడు.

బాబాసాహెబ్ అంబేడ్కర్ గురించి "అంబేడ్కరం" కవితలో అతన్ని పేదప్రజల హక్కుల రాజ్యాంగపత్రమని,అతను నడిచిన బుద్ధ భూమే పవిత్రభూమియని తీర్మానంజేత్తడు.వేల సంవత్సరాల ఈ చీకటి కువ్వారానికి అగ్గిపుల్ల గీసి వెలుగును పంచిన జ్ఞానజ్యోతియని కీర్తిస్తడు.ఆత్మగౌరవ పుస్తకంగా సాగిన జ్ఞానం ,జ్ఞానంగా సాగిన సంచారం,సంచారంగా సాగిన దళిత సామ్రాజ్యం,దళిత సామ్రాజ్యపు ప్రపంచ మేధో ప్రవక్త- బాబా సాహెబ్ అని ఎలుగెత్తి చాటుతడు.

"సంచారకళ -సావుకొచ్చింది" కవితలో సంచార బతుకులెంత ఆగంగున్నయో వివరంగజెప్పుకొత్తడు.సంచారజాతుల సాంస్కృతిక అంబాసిడర్ కావల్సినోడు పిడికెడు మెతుకుల బిక్షమైండని కలత చెందుతడు.గంగెడ్లోళ్లు,కొర్రాజులు,మందెచ్చులోల్లు,పిచ్చకుంట్లోల్లు,యానాదులోల్లు ఎంతమంది సంచారజీవుల బతుకుల్లోకి తొంగిజూశినా సంబురంలేదని,సంచార బతుకు పీకేసిన గుడిశై పొద్దుగుంకిందంటడు.

సిద్ధిపేట,హుస్నాబాద్ లను తల్సుకుంట రెండు కవితలు రాశిండు.మంజీర నాగేటిసాల్లు దూపతీరుస్తయని,కవుల మాటా పాటా మనసారా అర్సుకుంటయని,ఉద్యమ అక్షరధారలు తన్వి తీరుస్తయని వర్ణిస్తడు.అట్లనే హుస్నాబాద్ మట్టిమనుషుల గురించి చెప్తూ చేతులు పట్టుకుంటే తడితడిగా తలుగుతరని,కావలిచ్చీకుంటే తడిసిన మట్టిముద్దల్లెక్క హత్తుకుంటరని గొప్పగ కీర్తిస్తడు.

ఏ కవైనా కండ్లముందు జరుగుతున్న అన్యాయాన్ని,ఘోరాన్ని సూసుకుంట మౌనంగ ఉండలేడు.తనకండ్లముంగట్నే ఆగమైపోతున్న ఊళ్ల గురించి దుక్కిస్తున్నడు.ఓపెన్ క్యాస్ట్ మైనింగ్ లో ధ్వంసమవుతున్న ఊరు ఆనవాళ్లను,ప్రకృతి బీభత్సాన్ని చూస్తూ కండ్ల నీళ్లొత్తుకుంట బాధపడ్తడు.భూపాలపల్లి సుట్టుపక్కల ప్రభుత్వం అనుమతులు పొంది సింగరేణి ఆధ్వర్యంలో జరుగుతున్న ఉపరితల గనుల తవ్వకం పనులను చూస్తే అర్థమైతది.గోదావరి పరివాహక ప్రాంతం వరకు పొడుగూతా మొత్తం నామరూపాల్లేకుండా పోతున్న ప్రకృతి సంపదను చూసి వలపోసుకుంట ఏడుత్తాండు.ఇదంతా కేవలం ఒక్క ఎర్రగుంటపల్లి బాధేగాదు.ఉపరితల గనుల తవ్వకం వల్ల ఊళ్లకు ఊళ్లు నిర్వాసితులవుతున్న రైతుల బాధ సుత.పిట్టకూ పీచుకూ మనుగడ లేకుండబోతదనే బాధ సుత.ఊరుమాయమైతే ఆబాధేట్లుంటదుల్లా ? అవ్వనుపోగొట్టుకున్న దుక్కమసొంటిదే అది సుత. అనుభవిస్తేగని అర్ధంగాని బాధ అది.మనసు మనసుల ఉండదు.మనాది పట్టి రందితోటి మంచాన పడ్డట్టె అనిపిత్తది.

"పసువులు పెంచి పోషించిన వూరు
పంటలు పండించి నేలను ముద్దాడిన వూరు
కూలీనాలీ చేసి బతుకు ఎల్లదీసిన వూరు
కండ్లల్ల దుఃఖాన్ని
కడుపుల కోపాన్ని
మనసుల మంటల్ని మింగుతాంది!"
(ఊరు లేస్తాంది,పేజీ నం :94)

హిందూత్వ ముసుగులో మైనార్టీలపై,దళితులపై జరుగుతున్న దాడులు అత్యంత భయంకరమైనవి.గొడ్డుమాంసం తింటాండని "అఖ్లాక్ "ను ఇంట్లకచ్చి సంపిన  దారీణమైన సంఘటన మనకు తెలిసిందే.తినే తిండిమీద సుత ఆంక్షలే ఈ దేశంల.ముస్లింలపై ఎన్నిరకాలుగా దాడులు జరుగుతున్నయో
ఎంత మానసిక క్షోభకు గురిచేస్తున్నరో కళ్లకు కట్టినట్టు చెప్తరు.

"తీవ్రవాదివన్నరు
దేశద్రోహివన్నరు
ఈ దేశం వాడివి కాదన్నరు
ఇప్పుడు గొడ్డుమాంసం తింటున్నవని
ఇండ్లల్ల సొర్రి సంపుతాండ్లు-

నువ్వెవనివిరా
మా మీద ముద్రలేసి మమ్ముల ఖతం చేస్తానవ్ ?
ఖబడ్తార్ 
నేనిప్పుడు తిరగబడ్డ ముసల్మాన్ ని !"
(సోంచ్ పేజీ నం:98)

నేనూ ఈదేశ పౌరున్నే అని నిరూపించుకోవాల్సిన దుస్థితి దాపురించింది.మనం చూసే చూపుల్లోనూ ముస్లింలపై అనుమానమే అడుగడుగునా! సినిమాల్లో సుత తీవ్రవాదిని సూపెట్టిలంటే ముస్లిం మాత్రమే వాళ్ల ఛాయిస్ . దీన్నెలా అధిగమించగలం ? రంజాన్ కు వాళ్లింట నుంచి తియ్యటి పాయసం ప్రతి యేడు మనింటికొత్తది. బిర్యానీ రుచుల్ని లొట్టలేసుకుంట పంచుకుంటం. ఒక్క దేశం వరకు వచ్చేటాల్లకు ఏం పుడుతదో.. తీవ్రవాదివని ముద్దెర్లు గుద్దుతం.ఎంత వివక్ష?

భూమిక,ప్రియాంకల అదృశ్యం,హత్యలను ఖండిస్తూ "ఊరవతవల" కవిత రాశిండు.చెన్నారావుపేట జల్లి గుట్టలల్ల శవమై నిర్జీవంగా పడివున్న లంబాడీ పిల్లల ఆచూకీ విశ్వాసమున్న కుక్క చెబితెనే తెలిసింది.కారకులెవరో ఇప్పటికీ తేలనే లేదు.ఈ ఘటనపై ఒక్క కవితన్నా వచ్చిందా అని నర్సంపేట కవుల్ని నిలదీసిండు ఒక సభల కవి అన్వర్ . కవి బాధ్యతగా వుంటున్నడా లేదా అని తోటి కవుల్ని మేల్కోల్పుతనే వున్నడు.

"పాపం ఉరికుక్క
ఊరవతల పడేసిన రెండు శవాల్లోంచి ఒక చేతిని
ఊర్లకు తెచ్చింది

విశ్వాసంగా వుండే కుక్క మాత్రమే 
సాక్ష్యంగా నిలబడ్డది"
(పేజీ నం :105)

కుక్కకున్న విశ్వాసం మనిషికెందుకు లేకుండా పోయిందని నిలదీసిండు కవి.మనిషి స్థానాన్ని కుక్క భర్తీచేస్తున్న సందర్భంలో ఈ సమాజంలో బతుకుతున్నం.

విప్లవకవి వరవరరావు లాంటి ప్రశ్నించే గొంతుల్ని నులుముతున్న ప్రభుత్వాల  తీరుకు మండిపడుతడు.

"అతను 
జీవితమంతా ప్రశ్నిస్తూనే బతికాడు
వాళ్లు
జవాబు చెప్పకుండా
మౌనంగానే ఉండిపోయారు "
(పేజీ నం :111)

ఒక్క కాళోజీలెక్క ,వరవరరావు లెక్క ప్రశ్నించె గొంతుకలెన్నున్నయని ప్రశ్నిత్తడు.అక్రమంగా అరెస్ట్ చేయడం అన్యాలమంటడు."భీమ్కోరేగావ్ "సంఘటనలో భాగంగా ప్రధాని మోడీ హత్యకు కుట్ర పన్నారనే అభియోగాన్ని మోపి ప్రశ్నించే గొంతును జైల్లో పెట్టిన్లు.మొన్నటికి మొన్న వరంగల్ ప్రెస్ క్లబ్ లో పుస్తకావిష్కరణ సభకు అనుమతిచ్చి తీరా సమయానికి తాళాలు వేసుకుపోయి పోలీసు నిఘాను ఏర్పాటుచేసిన పరిస్థితిని కండ్లారా సూశినం.ఫోర్త్ ఎస్టేట్ ఎవల పక్కన విశ్వాసంగా నిలబడ్డదో తేలిపోయడం సూశినం.

అలాగే అండాసెల్ లో మగ్గుతున్న పూర్తి వైకల్యమున్న జి.ఎన్ .సాయిబాబా నిర్భంధంపై రాసిన కవిత "పోరాట నెత్తుటి సంతకం"సూద్దం.

"తనదైన మూడుచక్రాల సింహాసనమ్మీద కూర్చోని
జాతిని కాపాడే నాల్గో సింహంలా లేడూ!"(పేజీ నం :116)

అనేక ఆరోగ్య సమస్యలతో జైల్లో సచ్చిపుడుతున్న జి.ఎన్ .సాయిబాబా ఇప్పుడు కవిత్వమై మోగుతున్నడు.ప్రశ్నించే కలాన్ని నూరుతున్నడు.కలం ఎవరికీ బానిస కాదు.కాకూడదు.

భార్యశవాన్ని భుజంపీై మోసుకుంటూ బిడ్డతో సహా నడ్సుకుంటూ వెళ్లిన మాంఝీ సంఘటనకు స్పందిస్తూ రాసిన కవితే "శవం కాదు-ప్రాణంలో సగం ".
"భేతాలుని శవాన్ని ఎత్తుకుని నడిచిన రాజు కథ కాదిది
బతుకును శవంగా ఎత్తుకుని
పుట్టినూరి మట్టిలో సమాధవుతున్న పేదల బతుకిది

సత్తె నలుగురైనా నాలుగడుగులు మోయని దేశమిది"
(పేజీ నం :128)

ఎంత దుర్మార్గమైన సమాజంలో బత్కుతున్నం.నువ్వైనా,నేనైనా మాటల వరకేనా.,ఆచరణలో ఎప్పటికీ వెనకడుగేనా.,మనల్ని మనం ప్రశ్నించుకుందాం.

కవికి ప్రాణానికి ప్రాణమైన తీన కొడుకు "సూఫీ" గురించి 'నదులు పారుతున్నయ్ పెయ్  మీద' అని ఎంత పాయిరంగ కవితనల్లుతడో ..తండ్రి హృదయిం కదా మరి !

"చిన్నపిల్లగాడున్న ఇంట్లో
నేలమీదున్న సముద్రాలన్నొచ్చి కూలబడ్తయ్ 
అడవులు నిశబ్దాన్నొదిలి లేత గొంతుల్ని సవరించుకుంటయ్ "
(పేజీ నం : 142)

పిల్లల ప్రపంచంలో మనం పసివాళ్లమైపోతం.బాల్యం ఎంత మధురమైనదో.,కఠినాత్ముడైన మనిషిని సుత సున్నిత మనస్కుడిగా మార్చేస్తది.బుజ్జిబుజ్జి మాటలు,చిలిపి చేష్టలు మనల్ని ఉక్కిరి బిక్కిరి చేస్తయి.

ఒక్క ఊపులో సదివించే గుణమున్న కవిత్వం.కవిత్వం లోపలికి దిగండి.మిమ్మల్ని మీరు మరిచిపోతరు.సంఘటనలన్నీ ఒక్కొక్కటే కండ్ల ముందు నర్తించడం జూశి మనసుల మనసుండదు.కకావికలమై పోతరు.ఊగిపోతరు. ఖుల్లం ఖుల్లా ఏమాటకామాటే జెప్పుకోవాలె.పీడితుడి పక్షాన వకాల్తా పుచ్చుకుని వాదించే కవిత్వమిది.కవి మాట్లాడినపుడు వినండి.ప్రేక్షకుల నాడీ పట్టుకుని ఆరోహణావరోహణా డోలికల్లో ఉయ్యాలూపుతడు.తనను తాను మరిచిపోయి మిమ్మల్ని మీరు మరిచిపోయేలా చేసి ఒక తుఫాను బీభత్సాన్ని సృష్టిత్తడు.మాటల్లో సమ్మోహనశక్తేదో దాసుకుని తిరుగుతడు కదా..నవ్వుల్తో మనుషుల్ని పలకరిత్తడు కదా..మానవత్వమై పరిమళిస్తడు కదా..అందుకే ఖుల్లంఖుల్లా చెప్పదల్సుకున్నదేదో చెప్పే తీరిన.నాల్గు ముక్కలు రాయదల్సుకున్నదేదో కడుపుల దాసుకోకుంట రాసే అవకాశం దొరికింది.కవిత్వాన్ని పట్టుకోవడంలో,అంచనావేయడంలో పొరపాట్లు దొర్లితే సహృదయంతో మన్నిస్తూ తెలియజేస్తారిని భావిస్తూ శుభాకాంక్షలు.

- బండారి రాజ్ కుమార్