కోట్ల వెంకటేశ్వర రెడ్డి కవిత: భాష ఒక మాధ్యమం మాత్రమే!

By telugu teamFirst Published Nov 20, 2019, 2:56 PM IST
Highlights

ప్రభుత్వ పాఠశాలల్లో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టాలనే నిర్ణయానికి స్పందిస్తూ ప్రముఖ కవి కోట్ల వెంకటేశ్వర రెడ్డి కవిత రాశారు. భాష ఒక మాధ్యమం మాత్రమేనంటూ ఆయన వివాదాల్లోని గుట్టును విప్పాడు.

ఎవరూ
సెంటిమెంట్లతో
పరిణామాన్ని ఆపజాలరు!

అన్వేషణలో
తోక తెగిన మానవుడే
సౌందర్యాన్ని సంతరించుకున్నాడు!

భాషకు అమ్మతనం ఆపాదించడం
ఒక అర్థం లేని ఆరాధన
అవసరం కోసం చేసే రాజకీయం!

భాష ఏదైనా
ఒక పనిముట్టే
వినిమయ సాధనమే!

ఆది మానవుని భాష
వైవిధ్య భరిత
ధ్వని సంచలనమే!

అవసరాలు పెరిగాక కదా
అక్షరాలు కూర్చుకున్నది
పద్యాలు రాసుకుంటున్నది!

సంస్కృతీ ‌సంప్రదాయాలు
ఎప్పటికీ ప్రవాహ శీలాలే
వ్యతిరేకిస్తే మురికి కూపాలే!

మాధుర్యమూ
అవగాహన సృజన అన్నీ
సాధనమున సమకూరే విద్యలే!

అవసరాలు
బాంధవ్యాలనే తునాతునకలు చేస్తుంటే
భాష ఒక లెక్కా?!

సకల జనుల భాషను
ఒడిసి పట్టిన వాళ్ళకే
అవకాశాలు ద్వారాలు తెరుస్తాయి!

ప్రపంచం గుప్పిట్లో ఒదిగాక
భాష ఒక ఆటంకం కారాదు
విశ్వమానవ గీతం కావాలి!

ఇంటి భాష
మన ఎదలోనే భద్రంగా ఉండనీ
వ్యామోహాలన్నీ ఆదిలోనే తొలగనీ!!

click me!