అర్జెంటీనా కవి రాబర్తో యువరోస్ కవితను హంసగీతి పేర సురేంద్రరాజు అనువదించారు. 1990, భోపాల్ లో వాగర్ధ విశ్వకవితా ఉత్సవంలో ఆయన ఈ కవితను చదివారు.
ఎదో ఒక పనిలో పడి
నిన్ను నువ్వు మరిచిన వేళ
ఎవరో ఒకరు
ఎక్కడో ఓ చోట చనిపోతుంటారు
నువ్వేమో
నీ బూట్లను పాలిష్ చేస్తుంటావు
అసహ్యించుకుంటుంటావు
వున్న ఒకే ఒక ప్రేయసికో,
సవాలక్ష ప్రేయస్సుల్లో ఒకరికో
అందమైన ప్రేమలేఖ రాస్తుంటావు
ఏ పనీ పెట్టుకోక
నువ్వు నిష్పూచీగా వున్నా
ఎవరో ఒకరు చనిపోతూనే వుంటారు
గది నాలుగు మూలలనూ
పరకాయించి చూస్తూనో,
గది గోడలను
తేరిపార చూడకుండా వుండేందుకు
విఫలయత్నం చేస్తూనో,
నువ్వెంత పనిలేకుండా రికామీగా వున్నా
ఎవరో ఒకరు చనిపోతూనే వుంటారు
నువ్వే ఒక వేళ చనిపోతున్నా
ఒక్కడివే, ఎవరితోనూ
పొత్తులేకుండా, ఒంటరిగా
నువ్వొక్కడివే ఒక్క క్షణం
కడుపారా చనిపోవాలని కోరుకున్నా-
ఎవరో ఒకరు (నీ) కూడా చనిపోతుంటారు
అందుకే
ప్రపంచం గురించి
ఎవరైనా నిన్నేమైనా అడిగితే
ఎవరో ఒకరు
ఎక్కడో ఓ చోట
చనిపోతున్నారని చెప్పు!
- మూలం : అర్జెంటీనా కవి రాబర్తో యువరోస్
- అనువాదం : సురేంద్రరాజు
(1990, భోపాల్ లో వాగర్ధ విశ్వకవితా ఉత్సవం నాటి కవిత)