ఆశలపల్లకీపై ఊరేగే మనదైన కలల ప్రపంచాన్ని 'ఒకే ఒక్క' కవితలో చిత్తలూరి చూపెడుతున్నారు.
నిన్నటిదాకా శవాల పూడ్చివేతలో
పొక్కిలై గాయపడిన నేల
ఆకుపచ్చగా నవ్వుతుంది
కన్నీటిధారైన దిగులు మబ్బుల ఆకాశం
ఆనందభాష్పాల తొలకరితో తుళ్లుతుంది
యుద్ధంగెలిచిన వీరులతలపై పూలుచల్లుతూ
దేశం వీధులకిరువైపులా బారులు తీరుతుంది
విరిగిన రెక్కలు సరిచేసుకున్న పిట్టలు
మళ్లీ కొత్తగా ఎగరటం మొదలెడతాయి
చెట్లు తలపై పూలబుట్టల్ని సర్దుకుని
బతుకుదారిని పరిమళభరితం చేస్తాయి
మరుభూమిని తలపించిన మైదానాలు
వసంతుడి ఆటస్థలాలై కేరింతలు కొడతాయి
ఊపిరాడనితనాలు
నిర్బంధపు గదుల్ని కూలదోసుకునొచ్చి
గుండెలనిండా స్వేచ్ఛావాయువుల్ని పీలుస్తాయి
నిన్నటి గడ్డకట్టినరోజులు మెల్లగా కరిగి
రేపటిలోకి జీవనదులై ప్రవహిస్తాయి
ఎండిపోయిన ఆశల చెరువులు
ఇంకిపోయిన కలల కన్నీటి చెలిమెలు
కూలిపోయిన నిన్నటి శిథిలస్వప్నాలు
తమను తాము పునర్నిర్మించుకుని
సరికొత్త పునరుజ్జీవ జలంతో
నిండిపోయి కళ కళలాడతాయి
రేపటి రోజులన్నీ మనవేనన్న
ఒకే ఒక్క ఆత్మవిశ్వాసం చాలు
మళ్లీ మనదైన కలల ప్రపంచం
ఆశలపల్లకీపై ఊరేగుతూ వచ్చి
మన ఇంటి తలుపు తడుతుంది!