నొప్పెక్కడో తెలియకపోయినా కనపడని గాయం మాత్రం పచ్చి పుండు తడై తేమగా తాకుతూనే ఉంది అంటూ శ్రీరామ రాసిన కవిత ' సంఘర్షణ ' ఇక్కడ చదవండి :
మనసులోని ఆలోచనలు
జ్ఞాపకాల పొరలను తట్టి లేపి
అల్లకల్లోలం చేస్తుంటే
మనోభావాల యంత్రం
దేహాన్ని గాయ పరచకుండా
మనసునే బాధపెడుతుంది
నొప్పెక్కడో తెలియకపోయినా
కనపడని గాయం మాత్రం
పచ్చి పుండు తడై
తేమగా తాకుతూనే ఉంది
ఆ నియంత్రిత చర్యకు
మనసులో ఎన్నో వర్ణాల మనస్తత్వాలు
మనసు తెరచాటున ముసుగేసుకుంటాయి
ఓ వర్ణం
ఆనందపు సంతోషాలను
తట్టి లేపితే
మరికొన్ని
మనసును మెలిపెట్టే
తీరని వేదనలై
చుట్టూరా చేరుతాయి
ఇంకొన్ని
విషాదపు ఛాయలై అలుముకుంటాయి
నిశ్శబ్దపు చెరను
మనసుకు శిక్షగా వేసుకున్నా
నాకూ వర్తమానానికి
మధ్య సంఘర్షణ సంవేదనలై
ఆలోచనలు కొట్టు మిట్టాడూతూనే ఉంటాయి.