భండారు విజయ, పి. జ్యోతి సంపాదకత్వం వహించిన 'స్వయం సిద్ధ' కథా సంకలన ఆవిష్కరణ సభ హన్మకొండలో జరిగింది. ఆ సభ వివరాలు ఇక్కడ చదవండి :
అభ్యుదయ రచయితల సంఘం మరియు తెలంగాణ రచయితల సంఘం, వరంగల్ వారి ఆధ్వర్యంలో తేది 18.06.2023 న భండారు విజయ, పి. జ్యోతి సంపాదకత్వం వహించిన 'స్వయం సిద్ధ' కథా సంకలన ఆవిష్కరణ సభ హన్మకొండలో జరిగింది.
ముఖ్య అతిథి, ప్రముఖ విమర్శకులు ప్రొ.కాత్యాయని విద్మహే పుస్తకాన్ని ఆవిష్కరించి మాట్లాడుతూ ఈ పితృస్వామ్య వ్యవస్థలో ఒంటరి మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను సవాలుగా స్వీకరించి మహిళా శక్తులకు ప్రతీకలుగా ఇందులోని రచయిత్రులు నిలిచారని అన్నారు.
కార్యక్రమానికి అధ్యక్షత వహించిన ప్రముఖ కవి పొట్లపల్లి శ్రీనివాసరావు అధ్యక్ష ఉపన్యాసం చేస్తూ ఒంటరి స్త్రీలను చులకనగా చూస్తూ రెండవ శ్రేణికి చెందినవారుగా మాట్లాడేవారికి ఈ కథలు ఒక చెంపపెట్టు అన్నారు. వ్యవస్థాగతమైన లోటుపాట్లను ఎత్తిచూపుతూ మహిళలు స్వయంచోదక శక్తులుగా ఎలా ఎదగవచ్చొ చెప్పిన కథలే స్వయం సిద్ధ సంకలనం అన్నారు.
ప్రముఖ కథా రచయిత బివిన్ స్వామి సమీక్షిస్తూ అన్ని మతాల వర్గాల వృత్తులలో పాతుకపోయిన సంఘర్షణలను ఎత్తిచూపుతోనే ఆత్మగౌరవంతో ఎదిగిన స్త్రీకి ఒంటరితనం ఎప్పుడు శాపం కాదనే వాస్తవ ఇతివృత్తాలు ఈ కథలు అన్నారు. గౌరవ అతిథులు డా. శ్రీ రంగస్వామి, డా. పల్లేరు వీరస్వామి మాట్లాడుతూ స్త్రీలను పురాతన సాంప్రదాయాల వైపు దారి మళ్లించే వారి పట్ల తగు జాగరకతతో ఉండాలని అన్నారు.
కార్తీక రాజు సమన్వయకర్తగ వ్యవహరించిన ఈ సభలో ప్రముఖ కవులు, రచయితలు నిధి, కొమర్రాజు రామలక్ష్మి, డాక్టర్ బండారు సుజాత,కొడెం కుమారస్వామి, ప్రభాకర్, బాల బోయిన రమాదేవి, రామరత్నమాల, ఏ. విద్యాదేవి, కాసర్ల రంగారావు, నల్లెల రాజయ్య తదితరులు పాల్గొన్నారు