పసిపిల్లలపై లైంగిక హింసను ఖండిస్తూ 63 మంది రచయిత్రులు రాసిన 'లేఖావలోకనం' పై చల్లా సరోజినీ దేవి చేసిన సమీక్ష ఇక్కడ చదవండి.
లేఖావలోకనం పేరులోనే పరిశీలనను ప్రదర్శించే పుస్తకం. జ్వలిత సంపాదకత్వంలో వెలువడిన ఎనిమిదవ పుస్తకం. జె.డి.పబ్లికేషన్స్ మూడవ పుస్తకం ఇది. జ్వలిత ఎంతో వ్యయ ప్రయాసలకోర్చి 63 మందినీ కూడగట్టి, నేడు పసి పిల్లలపై జరుగుతున్న లైంగిక హింసను ఎండగడ్తూ, వాటికి కారణాలను, పరిష్కార మార్గాలను చూపిస్తూ ప్రచురించిన అమూల్యమైన పుస్తక రాజమిది. అక్షర జ్ఞానం కలిగిన వారు అందరూ చదివి ఆలోచించడమే గాదు. అందులో సూచించిన పరిష్కార మార్గాలను అనుసరించాలి. ముందుగా ఆచార్య సూర్య ధనుంజయ్ చక్కని పరిచయం చేసారు. ఇంకా యశస్వి సతీష్, శీలా సుభద్రా దేవి వంటి ప్రముఖులు ముందు మాటలను హృద్యంగా రాసాక, సంపాదకురాలు చదువరులను ఉద్దేశించి రాసిన లేఖ వుంది.
మొత్తం 63 మంది రాసిన లేఖల్లో మహిళలకు అక్షర భిక్ష పెట్టిన చదువులమ్మ 'సావిత్రీ బాయి పూలే' కి జ్వలిత రాసిన లేఖ కూడా వుంది. అంతా చదివే సరికి మన గుండె బరువెక్కుతుంది. ఎక్కువ మంది తమ శిష్యులకు రాసినవి, కొన్ని గురువులకు రాసినవి, కొద్ది మంది తమ తల్లికీ, మరి కొన్ని కూతుర్లకు రాసినవి వున్నాయి. చివర్లో సావిత్రీ బాయి తన భర్తకు రాసిన మూడు లేఖలు, ఆమె శిష్యురాలు ముక్తాబాయి రాసిన తిరుగు బాటు లేఖ, మొగల్ చక్రవర్తి ఔరంగజేబు తన గురువు బోధనను విమర్శిస్తూ రాసిన లేఖ, అబ్రహం లింకన్ తన కుమారుడి ఉపాధ్యాయుడికి రాసిన లేఖ, బోయి భీమన్న లేఖ అత్యంత ముఖ్యమైనవి, విలువైనవి. చరిత్రలో నిలిచి పోదగినవి. నేను పీశ్వాల పాలన గురించి ఎంతో మంచిగా ఊహించే దానిని. కానీ ముక్తా బాయి లేఖ చదివాక ఆ ఊహలు తలక్రిందులు అయినవి. బ్రాహ్మణుల అధీనంలో దళితులు ఎన్ని కష్టాలు పడ్డారో తెలిసి బాధ కలిగింది. రచయిత్రులు చాలా మంది నేటి సమాజంలో చెలరేగుతున్న దురాగతాలకు కారణాలుగా తల్లి తండ్రుల పెంపక లోపాన్ని, ఉపాధ్యాయుల అలస త్వాన్ని, టి.వి, స్మార్ట్ ఫోన్లు వంటి ప్రసార మాధ్యమాల ను, ఎక్కడ పడితే అక్కడ విచ్చల విడిగా దొరికే మత్తు మందులను, మాదక ద్రవ్యాలను, అదుపులేని స్వేచ్ఛను ఉదహరించారు. చాలా వరకు అవి వాస్తవాలే. ఆడైన, మగైనా తల్లిదండ్రులు వివక్ష చూపకుండా ఒకే రీతిని పెంచాలి. ఆడ పిల్లలకు స్వీయ రక్షణ కోసం కొన్ని యుద్ధ విద్యలూ నేర్పాలి. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొన్ని ప్రత్యేక ఫోన్ నంబర్లను అందరూ తప్పనిసరిగా ఫీడ్ చేసుకోవాలి. ఎలాంటి విపత్కర పరిస్థితుల్లో కూడా ఆత్మ స్థైర్యం కోల్పో కుండా ధైర్యంగా ముందుకు వెళ్లే విధంగా అమ్మాయిలు ఆడపిల్లలుగా గాక అగ్గిపుల్లలుగా ప్రజ్వరిల్లాలని అందరి ఆకాంక్ష. నలుగురైదుగురు సోదరులు కూడా మంచి సూచనలు, సలహాలు ఇస్తూ లేఖలు రాశారు. అన్నీ జాగ్రత్తగా చదివి, ఆలోచించి ఇకనైనా ఆడపిల్లలు నిర్భయంగా , స్వేచ్ఛగా , నిశ్చింతగా జీవించే ఆరోగ్యకర సమాజాన్ని ఏర్పాటు చేయడంలో ప్రతీ ఒక్కరూ తమ తమ బాధ్యతను సక్రమంగా నిర్వహిస్తారు అని ఆశిస్తున్నాను.
ముఖ్యంగా అంతరించి పోతున్న లేఖా సాహిత్యాన్ని సుసంపన్నం చేయాలనీ, ఈ లేఖల ద్వారా నేటి సమాజంలో ఆడవారు అదీ లోకం తెలియని పసి పిల్లలపై జరుగుతున్న లైంగిక దాడులను, హత్యాచా రాలను కొంత వరకైనా అరికట్టే దిశగా ప్రజలను చైతన్య పరచాలనీ జ్వలిత ఈ మహత్తర పుస్తకాన్ని ఆవిష్కరించారు. గతంలో లేఖా సాహిత్యాన్ని ఇంత సవివరంగా సంకలనం చేసిన వాళ్ళు లేరు. ఆ రకంగా ఇదే మొదటి పుస్తకం అవుతుంది. సావిత్రీ బాయి పూలే లేఖల్లో ఆ రోజుల్లోనే ఆమె కనబరిచిన ధైర్యం, చైతన్యం, సామాజిక న్యాయం కనిపిస్తాయి. ప్రేమ జంటను మరణ శిక్ష నుండి కాపాడిన ఆమె సమయ స్ఫూర్తి, చొరవ సాటి లేనివి. ఇంక లేఖలు అన్నీ కూడా చాలా హృద్యంగా, మనసును కదిలించే విధంగా ఉన్నాయి.
ఆకాశంలో, అవనిలోనే కాదు అవకాశాల్లో కూడా స్త్రీలకు సమాన భాగస్వామ్యం వుందని గుర్తించి, ఆమెను కేవలం భోగ వస్తువుగా గాక తమ పాలిటి భాగ్యలక్ష్మిగా భావించి, గౌరవించి, ఆదరించాలి అనే జ్ఞానం ఈ పుస్తకం ద్వారా మగవారిలో తప్పక కలుగుతుందనీ, తద్వారా సమ సమాజ స్థాపన జరుగుతుందనీ ఆశిస్తున్నాను.
జ్వలిత రచయిత్రులను ప్రోత్సహించి, అందరి రచనలూ వెలుగు చూసే అవకాశం కల్పిస్తూ, అవలోకనం, గల్పికా తరువు అనే పుస్తకాలతో పాటు ఈ లేఖావ లోకనం అనే పుస్తకాన్ని తమ జెడి పబ్లికేషన్స్ నుండి ముచ్చటగా మూడోసారి వెలువరించారు. ఆమె జ్వలించే అగ్ని శిఖ లాంటి సార్థక నామధేయురాలు. కలం పేరైనా, స్వంత పేరైనా ఆమెకు సరిగ్గా సరిపోతాయి. దెంచనాల విజయకుమారిలో విజయం సాధించడంలో అవిరళ కృషి దాగుంది. ఈ పుస్తకం కావాలను కొనే వారు, "సాహితీ వనం,15-21-130/2 బాలాజీ నగర్, కూకట్పల్లి-50072, ఫోన్ - 9989198943లో సంప్రదించ వచ్చు.