పుస్తక పఠనంతో వ్యక్తిత్వ వికాసం .. ముల్కనూరు ప్రజా గ్రంధాలయానికి 250 పుస్తకాల విరాళం..

By Rajesh KarampooriFirst Published Feb 23, 2024, 11:03 PM IST
Highlights

ఆధునిక సాంకేతికత ఎంతగా అభివృద్ది జరిగినప్పటికీ పుస్తకాల్ని చదవడం ద్వారానే సంపూర్ణ వ్యక్తిత్వ వికాసం కలుగుతుందని కవి, అనువాదకులు కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు గ్రహీత వారాల ఆనంద్ అన్నారు. ఆయన శనివారం భీమదేవరపల్లి మండలం ముల్కనూరు ప్రజా గ్రంధాలయానికి 250 పుస్తకాలని విరాళంగా అందజేశారు. 
 

ఆధునిక సాంకేతికత ఎంతగా అభివృద్ది జరిగినప్పటికీ పుస్తకాల్ని చదవడం ద్వారానే సంపూర్ణ వ్యక్తిత్వ వికాసం కలుగుతుందని కవి, అనువాదకులు కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు గ్రహీత వారాల ఆనంద్ అన్నారు. ఆయన శనివారం భీమదేవరపల్లి మండలం ముల్కనూరు ప్రజా గ్రంధాలయానికి 250 పుస్తకాలని విరాళంగా అందజేశారు. ఈ సంధర్భంగా ఆయన మాట్లాడుతూ ఎవరు ఎంతగా ఎదిగినప్పటికీ సాటి మనిషిని ప్రేమించే గుణం, సమాజాన్ని అర్థం చేసుకునే శక్తి కేవలం ఉత్తమ పుస్తకాలు చదవడంతోటే లభిస్తుంది అన్నారు. ఆపిల్, మైక్రోసాఫ్ట్, ఇన్ఫోసిస్ లాంటి సంస్థల విజయాల వెనుక సాంకేతిక పరిజ్ఞానంతో పాటు అధ్యయనం ప్రధాన పాత్ర పోషించింది అన్నారు. పోటీ పరీక్షల అధ్యయనంతో పాటు సాహిత్య పరిచయం యువకులకు విజయం సాధించడానికి   ఎంతగానో తోడ్పడుతుంది అన్నారు. 

ఈ సందర్భంగా వారాల ఆనంద్ ముల్కనూరు గ్రంధాలయానికి సుమారు 20 వేల రూపాయల విలువయిన అరుదయిన సాహిత్య, చరిత్ర పుస్తకాలని అందజేశారు. వాటితో పాటు తాను రచించిన మనిషి లోపల,అక్షరాల చెలిమే లాంటి 12 పుస్తకాల్ని కూడా వారాల ఆనంద్ అందజేశారు. పుస్తకాల్ని స్వీకరించిన గ్రంధాలయ కార్యదర్శి గొల్లపల్లి లక్ష్మయ్య మాట్లాడుతూ ముల్కనూరు గ్రంధాలయం స్వచ్ఛందంగా సేవా భావంతో నడుపుతున్నామని వారాల ఆనంద్ లాంటి కవులు,రచయితల సహకారం అభినందనీయమని అన్నారు. సంస్థ బాధ్యుడు లెక్చరర్ డాక్టర్ ఏదులాపురం తిరుపతి, డాక్టర్ తాళ్ల వీరేశం, మెట్టు సుగందర్ రావు, శ్రీమతి ఇందిరా రాణి, శ్రీమతి వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. ముల్కనూరు గ్రంధాలయం చేస్తున్న సేవని ప్రశంసించారు.

click me!