డా. రూప్ కుమార్ డబ్బీకార్ కవిత : అతను.. సైనికుడు …

By Arun Kumar PFirst Published Aug 5, 2022, 4:18 PM IST
Highlights

ధారపోసిన రక్త దారలతో దేశ కాంతులకు జీవ ధాతువై బలిపీఠ మెక్కిన త్యాగాల గని  అతను..  సైనికుడు...  అంటూ   డా. రూప్ కుమార్ డబ్బీకార్ రాసిన కవిత : " అతను..  సైనికుడు....." ఇక్కడ చదవండి :            

యోజనాల దూరంలో తన వారు 
దేశమాత ఒడిలో భారత  సైనిక పుత్రుడు 
కనపడని దూరపు గొంతుకల పలకరింపులు అతని ఉల్లాసాలు 
వినబడని దగ్గరి  స్వరాల వీడ్కోలు  పలుకులు అతనికి అభినందనలు 
అతను..  సైనికుడు… 
సరిహద్దులపై పహారా కాసే జాతీయ పతాకమతను 
శత్రుమూకలనెదురొడ్డి నిలిచే అగ్ని శిఖ
తీవ్రవాద దాడులలో  ఛిద్రమైన దేహంతో ఎగసిన రక్త పుష్పమై 
ధారపోసిన రక్త దారలతో దేశ కాంతులకు జీవ ధాతువై 
బలిపీఠ మెక్కిన త్యాగాల గని  
అతను..  సైనికుడు... 
కాశ్మీరం లోయలో  ‘చీనార్’  వృక్షమై నీడనిస్తాడు
పుల్వామా మట్టిలో ‘కేసర్’ గా పరిమళిస్తాడు . 
జమ్మూ కాశ్మీర్ పర్వత  లోయల్లో నదుల సవ్వడి – 
అతనే జీలం, అతనే చీనాబ్, రబి అతనే, అతనే సట్లెజ్ ..  
భరత భూమి  గుండెల్లో జీవ నదుల సారమై ప్రవహిస్తాడు
అతనే గలగలల సంగీత స్వరమై నినదిస్తాడు, 
అతను..  సైనికుడు …
ఉన్నతుడతడు, హిమాలయ పర్వత శిఖరోన్నతుడతడు
బాంబుల దాడిలో విరిగి పడిన అతని చేతిలోని జెండాను సైతం నిలువెత్తు నిలిపిన  ధీశాలి
మువ్వన్నెల జెండాలో కప్పబడిన గౌరవ రేఖ
కన్నతల్లి,  నేల తల్లి ఒడిలో సేదతీర 
తిరిగొచ్చిన గర్వ కారణ మతను, జాతి గౌరవమతను
అతను  సైనికుడు,  సైనికుడు,  భారత  సైనికుడు...
 

click me!