దైవభక్తి పరిమళించిన మొగ్గలు : హనుమాన్ చాలీసా

By Arun Kumar P  |  First Published Aug 30, 2022, 1:36 PM IST

కాటేగారి పాండురంగ విఠల్ రాసిన హనుమాన్ చాలీసా ( మొగ్గలు ) పైన పాలమూరు విశ్వవిద్యాలయం , తెలుగు శాఖ అధ్యాపకులు డా. బి.రవీందర్ గౌడ్ చేసిన సమీక్షను ఇక్కడ చదవండి :


తెలుగు సాహిత్యంలో ఈ మధ్యకాలంలో ఆవిర్భవించిన ప్రక్రియ మొగ్గలు.  ఈ మొగ్గల ప్రక్రియా పరిమళాలు నేడు తెలుగు రాష్ట్రాల్లో  సువాసనలు వెదజల్లుతున్నాయి. సాహిత్యంలో ఈ మొగ్గల ప్రక్రియను సృష్టించింది  పాలమూరు సాహితీ అధ్యక్షులుగా తెలుగు సాహిత్యానికి విశిష్టసేవలు అందిస్తున్న ప్రముఖ సాహిత్యవేత్త డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్.  వీరి కలల సాహితీ సౌధంగా ఆవిర్భవించిన నూతన కవితా ప్రక్రియ మొగ్గలు. అనతికాలంలోనే ఈ ప్రక్రియ శాఖోపశాఖలుగా వికసించి, విరబూసి  ఇప్పటిదాకా నలభై పుస్తకాలు వెలువడ్డాయి. 

హిందువులు పవిత్రదేవునిగా,  దైవంగా పూజించే శ్రీరామబంటు హనుమంతుని గురించి మొగ్గల ప్రక్రియలో హనుమాన్ చాలీసాను కాటేగారి పాండురంగ విఠల్ చక్కని తెలుగుభాషలో అద్భుతంగా రచించారు. మొగ్గల ప్రక్రియలో వచ్చిన ఈ రచన తెలుగు సాహిత్యంలో ఒక విశిష్టమైన భక్తి రచనగా పేర్కొనవచ్చు. 

Latest Videos

హనుమంతుడు శ్రీమంతుడు, బలవంతుడు, గుణవంతుడు, అంజనీసుతుడు, బజరంగబలి, మారుతి, వాయునందనుడు, హిందూ బంధు జనులందరిచే పూజలందుకొనే ఆంజనేయుడిపై ఇప్పటివరకు చాలామంది వివిధ ప్రక్రియలో రచనలు చేశారు.  కానీ పాండురంగ విఠల్ ఒక నూతన ప్రక్రియ అయిన మొగ్గలు ప్రక్రియలో హనుమాన్ చాలీసాను రాయడం విశేషం. ఈ హనుమాన్ చాలీసాను చక్కని మొగ్గల రూపంలో భక్తి పారవశ్యంతో అద్భుతంగా రచించారు. 

తులసీదాస్ హిందీలో రాసిన హనుమాన్ చాలీసాను రచయిత స్వతంత్రగా మొగ్గలుగా ఆవిష్కరించాడు.

"అతులిత బలధామం స్వర్ణ శైలాభ స్నేహం !
ధనుజవన కుషానుం జ్ఞాని నామాగ్రగణ్యమ్!!"

అనే దానిని మొగ్గగా ఆవిష్కరించిన తీరును చూడండి.

అత్యంత బలము వీరత్వం కలిగిన
స్వర్ణశోభితమైన దేహము కలవాడు
దృఢదేహుడు అంజని తనయుడు

అత్యంత బలం మరియు వీరత్వం కలిగి బంగారు వర్ణం వంటి దేహం గలవాడు, గట్టిదైనా శరీర అవయవ నిర్మాణం కలవాడు, ఈ లోకంలో ఎవరయ్యా అంటే అంజనీ సుతుడు రామభక్తుడు హనుమంతుడు అని రచయిత హనుమంతుని శరీరసౌష్టవాన్ని భక్తితో పరమానందభరితంగా వర్ణించాడు.

హనుమాన్ చాలీసా మొగ్గలలో హనుమంతుణ్ణి అనేక విధాలుగా భక్తితో అతని గొప్పదనాన్ని అద్భుతమైన రీతిలో వర్ణించి మొగ్గలుగా ఆవిష్కరించిన తీరు అమోఘమనిపిస్తుంది.  హనుమంతుని గుణగణాలు వర్ణిస్తూ జ్ఞానసంపన్నుడైన ఆంజనేయుడు, దశరథసుతుని ప్రియమైన భక్తుడు, రామాయణమాలలో రత్నం హనుమంతుడు, వాయుపుత్రుడు, హనుమంతుడు భక్త రక్షకుడు, రామభక్త హనుమంతుడు సకల శుభ ప్రదాయాకుడు, క్లేశం మనోవికారములు తొలగించు మారుతి, జ్ఞానగుణ తేజప్రదాత కపిలుడు, బలసంపన్నుడు, అంజనీపుత్రుడు, బుద్ధిమంతుల మిత్రుడు, బజరంగీ, బంగారపు మేనితో శోభిల్లువాడు, చేత ధ్వజం ధరించే వాయుపుత్రుడు, శంకరుని తనయుడు, వాయునందనుడు, అతిచతురుడు, శ్రీరామదాసుడు, ప్రభువును గుండెల్లో నిలిపే రామబంటు,  సీతను కనుగొని లంకను కూల్చిన మారుతి, రాక్షస మూకలను అంతంచేసే కపీశుడు, సంజీవనికై గిరిని ఎత్తుకొచ్చిన మహాకాయుడు, రాముని ప్రేమాభిమానాలు పొందే మారుతి, శ్రీరామునిచే కీర్తింపబడే హనుమంతుడు, ముని దేవతల మెప్పును పొందే మారుతి, భువి దివిలో కీర్తింపబడే హనుమంతుడు, స్నేహాన్ని కలిపి సహాయంచేసే మారుతి, హనుమ మాటే రామబాణం వేదమంత్రం, నింగిని ఎగిరి సూర్యుడిని అందుకునే మారుతి, ఆశ్చర్యం అద్భుతం నీ కార్యాలు హనుమా, భక్తులకు అండ అంజనీ సుతుడు, భక్తరక్షకుడు, వాయుపుత్రుడు మారుతి, భయభీతి తొలగించి రక్షించే మారుతి, లోకరక్షకుడు, తేజోమూర్తి మారుతి, దుష్టజన రక్షణ మారుతి, హనుమాన్ నామం కష్టాలు హరించు, హనుమ ధ్యానం తాపసులకు అండదండ, హనుమంతుడు సకల జగతికి వరమారుతి, మారుతి శిష్టరక్షకుడు, రామదాసుడు, మారుతి భక్తజన వరదాత, ఆంజనేయుడు రామ నామామృతం గ్రొలే రామబంటు, భజనతో సంతోషించు మారుతి, పుణ్యలోకం పేరును రామభక్తుడు హనుమంతుడే సర్వసుఖప్రదాత, సుఖమును ప్రసాదించు మారుతి, బజరంగబలికి జయజయములు, జన్మబంధం తొలగించును చాలీసా, శ్రీరాముడే అతని హృదయ నాథుడు.

పవనతనయ సంకటహరణ మంగళమారుతి రూప్ ! రామలఖన సీతాసహిత హృదయబసవు సురభూప్ !!
చివరి హనుమాన్ చాలీసా చరణానికి ఈ క్రింది మొగ్గలో...

కష్టసంకటములను తొలగించు మంగళమూర్తివై
రామ లక్ష్మణ సీతలతో నా హృది వసించుము
పవనతనయ వాయునందనుడా ! హనుమంతా !
అని అనువాదం చేశాడు.

సకల కష్టాలను, సంకటాలను తొలగించే శ్రీ రామభక్తా హనుమా ! రామలక్ష్మణ సీతాసమేతంగా నా హృదయంలో నివసించు అని భావం. ఈ విధంగా హనుమభక్తిని రచయిత మొగ్గలరూపంలో అద్భుతంగా చాటాడు.   తులసీదాస్ హిందీలో రాసిన హనుమాన్ చాలీసాను వృత్తిరీత్యా హిందీ ఉపాధ్యాయుడైన కాటేగారి పాండురంగ విఠల్ తెలుగులో మొగ్గల రూపంలో విశిష్టమైనరీతిలో రాసిన అద్భుతమైన హనుమభక్తి రచన అని చెప్పవచ్చు. ఈ రచనను హనుమంతుని భక్తులైన హిందువులందరూ తప్పకుండా చదవాలి.

తెలుగు సాహిత్యంలో  హనుమాన్ చాలీసా మొగ్గలు ఒక అద్భుత ఆవిష్కరణగా పేర్కొనవచ్చు.  ఈ హనుమాన్ చాలీసా మొగ్గలు తెలుగు వారందరికీ హనుమంతుని ఆశీస్సులు అందిస్తాయని ఆశిస్తూ.... మొగ్గల రూపంలో ఆవిష్కృతమైన ఈ హనుమాన్ చాలీసా మొగ్గలు అందరినీ అలరిస్తాయని ఆశించడంలో తప్పేమీలేదు. 

click me!