తెలుగు కవిత్వంలో పేరెన్నిక గన్న కవుల్లో రెడ్డి రత్నాకర్ రెడ్డి ఒకరు. ఆయన కవిత్వంలో మార్మికత తొంగి చూస్తూ ఉంటుంది. రెడ్డి రత్నాకర్ రెడ్డి రాసిన కవిత సింగిల్ డిజిట్ కెరటాల సముద్రం ఇక్కడ చదవండి.
ఇంట్లోకి పోతే
నా తలను పెకిలించుకొని
గోడకేసి కొట్టుకుంటాను
మీకు కనబడవు గానీ
గోడలనిండా రక్తపు మరకలే
undefined
బయటకు అడుగు పెట్టిన వెంటనే
కెరటాలు పోటీపడి
నా తలను మొండెంతో అతికిస్తాయి
ఎప్పట్లా సముద్రమవుతాను
సముద్రం
సముద్రమవుతుంది
* * * * *
ఎవరైనా నన్ను కలిసేందుకు వచ్చినప్పుడు
వాళ్ళ..'అనంతాకాశం కింది సాయంకాల సముద్ర'పు
ఊహ చెదిరిపోతుంది.
తల్లడిల్లిపోతరు
సింగిల్ డిజిట్ కెరటాలతోనైనా గోడల మీద యుద్ధం చేస్తున్నందుకు
ఇంకొందరు లోలోపలే వాయుగుండమై రగిలిపోతరు
మీలాగే
ఇలాగే
ఎవరైనా నన్ను కలిసేందుకు వచ్చినప్పుడు
గోడకు పిడకలా ఎండిపోతున్న నా తలను
తల లేని మొండెంతో మాట్లాడుతున్న నన్ను చూసి
ఇక్కడ కాదు
బయటెక్కడైనా
చాయ్ తాగుదాం..అంటారు
* * * * *
తెర చాపల్లా తేలిపోయిన వాళ్ళు
చేపల్లా నన్ను కనిపెట్టుకున్నవాళ్ళు
ఒక చీకటిని చెదరగొట్టినందుకు
నాలో చందమామల్లా ప్రతిబింబించినవాళ్ళు
బూడిద రాసుల మోసుకొచ్చిన వాళ్ళపై
అయ్యో పాపం అనకుండా
నాలుగు కట్టె పుల్లలు పేర్చినందుకు
నిప్పు రాజేసుకొని
నాకో కంకి కాల్చిచ్చిన వాళ్ళు
వెళ్ళేటప్పుడు
కర్రు కొడవలి పిడికిలిలా కదిలి పోయిన వాళ్ళు
నా విశ్రాంత సమయాల్లో
తెప్పరిల్లిన సూర్యుల్లు
నా ఊపిరి పోసే గాలీ
చినుకు చెమ్మా తాకి
ఒంటరి మొక్కల్లో
ముసురుకున్న అటవీకలలు
నా కోపానికి ప్రతీకలై
మెరిసిన ముత్తెపు చిప్పలు
నన్ను-
వాళ్ళు
వాళ్ళంతా
ఎప్పటికీ
వాళ్ళకు తెలిసిన సముద్రంగానే
చూడాలనుకుంటరు
అవుతలి మొకాన పోతే
సముద్రమయ్యే రహస్యం
నా నుండి వైరల్ అవుతుంది
నీనుండీ
నానుండీ
ప్రతి ఒక్కరి నుండి
పెను ఉప్పెనొకటి లేస్తుంది
కొత్త పాట పాడటానికి
పసిపాపలు కాగలిగిన వారే
భూమిపై ఉంటరు
గోడల్లా
నా చుట్టు లేసిన వాళ్ళు
వాళ్ళంతా
కూలి పోతరు !
మరింత సాహిత్యం కోసం క్లిక్ చేయండి: https://telugu.asianetnews.com/literature