శ్రీరామోజు హరగోపాల్ కవిత : కోడిగుడ్డు

By Siva KodatiFirst Published Sep 17, 2023, 3:27 PM IST
Highlights

దాహం తీరని బాయెందుకు పూడ్చెయ్యక అంటూ శ్రీరామోజు హరగోపాల్ రాసిన కవిత ' కోడిగుడ్డు ' ఇక్కడ చదవండి : 
 

అట్లా అని భయపడేదేముంది?
అది మనుషులకు అక్కరకు రానపుడు

మొదట్నుంచి భయమదేకదా
కాళ్ళకు మొక్కో, కాళ్ళతో తొక్కించుకునో
బతుకుడేమిటని అడిగినందుకే కదా
నోటికి, నడుముకు ముంతా, చీపుర్లు

ఇంకానా, ఇకపై చెల్లదన్నందుకే 
తల తీసి మొలేస్తానని బెదిరింపులు
నాలుగు తీర్ల కాదు నలభై తీర్ల రేవులేని జన్మలే కదా

కుటిలనీతి ధర్మాలకు
తెగిపడిన తలలెన్ని? 
బట్టలూడిన బతుకులెన్ని??
అన్నింట్లో పరమార్థం చూసే కండ్లకు
కొంచెం ఎక్కువ సమానత్వం
అంటరానితనం మడిబట్టనా?

ఇంకా మనుషుల్ని చీరి పారకం బెట్టే
ధర్మమే మోద్దాం
ఇంకా మనుషుల్ని బానిసల్ని చేసే
ఖర్మమే భజిద్దాం

గుంటనక్క బోధన డేంజరుగా మారుతోంది
ఇంకానా, ఇకపై చెల్లదనే భయం
సూదితో పోయేదానికి సోదంతా ఎందుకు
వేలయేండ్ల మమ్మీలభాషెవరిది?

చెల్లని పైసలకు పూటకో రూపం
వల్లని కూడు ఉప్పిసం
చాదస్తం చూపుతారు చేదకొక బొక్కెన
దాహం తీరని బాయెందుకు పూడ్చెయ్యక

(పురుషసూక్తం శాలువా కప్పుకుని, కలియుగానికి పరాశరస్మృతిని Allott చేసి, అంటరానితనం వాళ్ళింటి మడితో వ్యాఖ్యానించిన వారికి అంకితం... 
గమనిక: వేదాలు, స్మృతులు, ధర్మం వగైరాల మీద డాక్టరేట్లున్నవారే కామెంటుకు అర్హులు)
-----పంచముడు

click me!