
హృదయస్పందనే గణగణమనే ఇనుపశబ్ధమయింది
కష్టాలగాట్లు నాట్యం చేసే శానంగాట్లనుమించిపోయింది
వంపులద్దిసొంపునిచ్చే
నా సుత్తిదెబ్బలు సద్దితెచ్చి
సాకుడు సెరువయింది
ధనధనమనే నా సమ్మెట పోటు
గ్రామబతుకులను, బస్తీలను
మేల్కొలిపే జ్ఞానసిరులపంట
రైతుల ఎద్దులబండ్లన్నీ
ఎవసంబసల ప్రాసలెన్నో
ఎగదూకే తరువులన్నీ
ఏలుబడే ధాన్యరాశులమిల్లే
పంచదాయిల ఇళ్ళే నిత్యనూతన ప్రయోగశాల
ఆసాముల వాకిటనిల్పే పాఠశాల
అది విశ్వకర్మల బారసాల
కొలిమిసెగల అలల భగభగలు
గుండెలదిరే ఇనుపధ్వనులు
కాలే కడుపులే మంటలై,
చితిమంటలై రగులుతుంటే
సృష్టికి ప్రతి సృష్టి చేస్తూ
ఇలలోన పుష్టినింపే ఈ విశ్వనరుడు